logo

క్యాంపు రాజకీయాలు షురూ!

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు మూడు రోజులే గడువు ఉండటంతో క్యాంప్‌ రాజకీయాలు మొదలయ్యాయి. అత్యధిక సంఖ్యలో ఉన్న తమ ఓటర్లను అధికార పార్టీ నియోజకవర్గాల వారీగా శిబిరాలకు తరలించినట్లు తెలిసింది. విజయం

Published : 07 Dec 2021 03:59 IST

ఈనాడు, నల్గొండ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు మూడు రోజులే గడువు ఉండటంతో క్యాంప్‌ రాజకీయాలు మొదలయ్యాయి. అత్యధిక సంఖ్యలో ఉన్న తమ ఓటర్లను అధికార పార్టీ నియోజకవర్గాల వారీగా శిబిరాలకు తరలించినట్లు తెలిసింది. విజయం లాంఛనమే అయినా.. ఏ అవకాశాన్ని వదలకూడదనే తలంపుతో తెరాస ముందు నుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గెలుపు బాధ్యతను తెరాస అధిష్ఠానం అప్పగించటంతో మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నీ తానై సాగుతున్నారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని 12 నియోజకవర్గాల నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సమన్వయం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి సమన్వయ సమావేశాలు నిర్వహించారు. చివరి అస్త్రంగా ప్రజాప్రతినిధులందరినీ శిబిరాలకు పంపించారు. మంగళ, బుధవారం కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు వివిధ పుణ్యక్షేత్రాలు, దేవాలయాల సందర్శిస్తారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకొని అక్కడ మాక్‌ పోలింగ్‌ నిర్వహించనున్నారు. అనంతరం ఓటర్లు తమ ఎమ్మెల్యేలతో కలిసి పోలింగ్‌ కేంద్రాలకు శుక్రవారం చేరుకోనున్నారు. హైదరాబాద్‌లోని తన క్యాంప్‌ కార్యాలయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలతో మంత్రి జగదీశ్‌రెడ్డి సోమవారం సమావేశమై ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపై చర్చించినట్లు తెలిసింది. ఎన్నికల్లో 1,271 ఓట్లు ఉండగా.. సుమారు 980 ఓట్లు అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారు. నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, భువనగిరి, చౌటుప్పల్‌ రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్‌ మద్దతుపై నగేశ్‌ ఆశలు.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ ఆలేరు జడ్పీటీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే నగేశ్‌ ఆపార్టీ అధికారికంగా తనకు మద్దతు ప్రకటిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. నల్గొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ ఎంపీలే ఉన్నా ఆపార్టీ నుంచి అధికారిక అభ్యర్థి లేకపోవడం మంచి పరిణామం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మంగళవారం సాయంత్రం వరకు పార్టీ తన అభిప్రాయాన్ని ప్రకటించే అవకాశం ఉందని మాజీ మంత్రి ఒకరు ‘ఈనాడు’కు వెల్లడించారు. మరోవైపు తెరాస అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డితో పాటు మరో ఆరుగురు అభ్యర్థులు రంగంలో ఉన్నా.. స్వతంత్ర అభ్యర్థి నగేశ్‌ ఒక్కరే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ తనకు మద్దతివ్వాలని కోరుతున్నారు. మరోవైపు తెరాస నేతలు తమను సంప్రదిస్తారేమోనని పలువురు కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఆశగా చూస్తున్నారు. ‘‘గతంలో రెండు పార్టీల బలాబలాలు సమానంగా ఉండటంతో ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మాకు ఏకపక్ష మెజార్టీ ఉంది. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన వారు మాకు ఓటేస్తామంటే సరే. కానీ మేం ఎవరినీ సంప్రదించడం లేదు’’ అని ఓ తెరాస ఎమ్మెల్యే ‘ఈనాడు’కు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని