logo

నాడు ప్రత్యర్థులు.. నేడు మిత్రులు

కోదాడ నియోజకవర్గంలో ఒకప్పటి రాజకీయ ప్రత్యర్థులు నేడు ఒక్కటయ్యారు. ఒకే పార్టీలో కలిసి మిత్రులయ్యారు. ఈ నియోజకవర్గానికి ఒకరు నాలుగు సార్లు, మరొకరు రెండు సార్లు వేర్వేరు పార్టీల ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించినప్పటికీ నేటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరూ ఒకే పార్టీవారయ్యారు.

Updated : 29 Oct 2023 04:54 IST

కోదాడ నియోజకవర్గంలో ఒకప్పటి రాజకీయ ప్రత్యర్థులు నేడు ఒక్కటయ్యారు. ఒకే పార్టీలో కలిసి మిత్రులయ్యారు. ఈ నియోజకవర్గానికి ఒకరు నాలుగు సార్లు, మరొకరు రెండు సార్లు వేర్వేరు పార్టీల ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించినప్పటికీ నేటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరూ ఒకే పార్టీవారయ్యారు. వీరే ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు. కోదాడ అసెంబ్లీ ఎమ్మెల్యే స్థానం కోసం 1994 ఎన్నికల్లో చందర్‌రావు (తెదేపా), ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌ పార్టీ) పోటీ పడ్డారు. 9,149 ఓట్ల మెజార్టీతో వేనేపల్లి గెలుపొందారు. 1999లో వీరిద్దరూ అవే పార్టీల్లో కొనసాగుతూ మళ్లీ పోటీ పడ్డారు. రెండోసారి 7,309 ఓట్ల మెజార్టీతో ఉత్తమ్‌ను విజయం వరించింది. 2004లోనూ మళ్లీ మూడోసారీ వీరిద్దరి మధ్యే పోటీ జరిగింది. 23,787 ఓట్ల మెజార్టీతో గెలుపు ఉత్తమ్‌ సొంతమైంది. ఆ తర్వాత 2009లో కొత్తగా ఏర్పడిన హుజూర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున ఉత్తమ్‌ పోటీ చేసి జగదీశ్‌రెడ్డి (తెరాస, ప్రస్తుత మంత్రి)పై గెలిచారు. వేనేపల్లి (తెదేపా) కోదాడలో కాంగ్రెస్‌ అభ్యర్థి మహబూబ్‌ జానీపై గెలుపొందారు. కొన్నేళ్ల తర్వాత చందర్‌రావు తెరాసలో చేరారు. దాదాపు 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో వేనేపల్లి, ఉత్తమ్‌ మూడుసార్లు ప్రత్యర్థులుగా పోటీ పడ్డారు. తాజాగా 2023లో భారాస నుంచి వేనేపల్లి కాంగ్రెస్‌లో చేరి ఉత్తమ్‌తో కలిసిపోయారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులుండరు అనే నానుడికి వీరి కలయిక ఒక నిదర్శనంగా ఓటర్లు చెప్పుకొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని