logo

ఆదర్శమూర్తి.. విప్లవ సేనాని రావి

రావి నారాయణరెడ్డి 1908 జూన్‌ 5న జన్మించారు. తల్లి వెంకటరామమ్మ, తండ్రి గోపాల్‌రెడ్డి. భువనగిరి మండలం బొల్లెపల్లి స్వగ్రామం. భువనగిరిలో ప్రాథమిక విద్య, హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌ స్కూల్‌ విద్యను పూర్తి చేశారు.

Updated : 07 Nov 2023 05:10 IST

ఆయనో దొర బిడ్డ.. కానీ దొరతనాన్ని ఎదిరించిన పోరుబిడ్డ.. స్వాతంత్య్ర సమరయోధుడు. మార్క్స్‌.. జయప్రకాశ్‌నారాయణ్‌ రచనలకు ఆకర్షితుడై గాంధేయ వాదం వదిలి.. కమ్యూనిజం వైపు మళ్లిన సాయుధ పోరాట యోధుడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరుకు సారథ్యం వహించిన విప్లవ సేనాని రావి నారాయణరెడ్డి. నిజాం నిరంకుశ పాలనలో పీడిత ప్రజలకు విముక్తి కోసం సాగిన గెరిల్లా పోరుకు సారథ్యం వహించి చరిత్రపుటల్లో నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ మహనీయుడి ప్రస్థానం, ముఖ్య ఘట్టాలు స్మరించుకుందాం.

భూస్వామ్య కుటుంబం నుంచి..

రావి నారాయణరెడ్డి 1908 జూన్‌ 5న జన్మించారు. తల్లి వెంకటరామమ్మ, తండ్రి గోపాల్‌రెడ్డి. భువనగిరి మండలం బొల్లెపల్లి స్వగ్రామం. భువనగిరిలో ప్రాథమిక విద్య, హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌ స్కూల్‌ విద్యను పూర్తి చేశారు. నిజాం కళాశాలలో ఇంటర్‌ అభ్యసించారు. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నా కళాశాలలో అలాంటి అవకాశాలు రాకపోవడంతో క్రీడల్లో రాణించి ఇంటర్‌ కాలేజీ ఛాంపియన్‌ షిప్‌ సాధించారు. అఖిల భారత ఒలింపిక్‌ క్రీడల్లోనూ పాల్గొన్నారు. క్రీడా స్ఫూర్తే రాజకీయాల్లో రాణించేందుకు దోహద పడింది. 18వ ఏటనే మీనమ్మతో మొదటి వివాహం జరగ్గా.. క్షయ వ్యాధితో ఆమె మృతి చెందడంతో భూదాన్‌పోచంపల్లికి చెందిన వెదిరె సీతమ్మను మళ్లీ వివాహం చేసుకున్నారు.

తొలుత గాంధేయవాదం వైపు..

బాపూజీ రచనలు నారాయణరెడ్డిని గాంధేయవాదం వైపు నడిపించాయి. 1930లో కాకినాడలో జరిగిన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమానికి బద్దం ఎల్లారెడ్డితో కలిసి పాల్గొన్నారు. సోవియట్‌ యూనియన్‌ అవతరణ, మార్క్స్‌ పుస్తకాలు, జయప్రకాశ్‌ నారాయణ రచనలు, ఆయనలో సోషలిస్టు భావ జాలం వైపు మళ్లించి కరడుకట్టిన కమ్యూనిస్టుగా మార్చాయి.

ఆంధ్రా మహాసభలకు సారథ్యం

తెలుగు భాషా, సంస్కృతుల పునర్జీవం.. నైజాం పాలన.. ఫ్యూడల్‌ వ్యవస్థకు వ్యతిరేకంగా 1930లో ఆంధ్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. జోగిపేటలో పొరుడు పోసుకున్న ప్రథమ ఆంధ్ర మహాసభకు వాలంటీర్‌గా ఆరుట్ల రామచంద్రారెడ్డితో కలిసి హైదరాబాద్‌ నుంచి 15 మందితో సైకిళ్లపై వెళ్లిన వారిలో నారాయణరెడ్డి ఒకరు. 1941లో హుజూర్‌నగర్‌లో 8వ, 1944లో భువనగిరిలో జరిగిన 11వ, 1945లో ఖమ్మంలో జరిగిన 12వ మహాసభలకు అధ్యక్షత వహించారు. భువనగిరిలో జరిగిన మహాసభతోనే ‘రావి’ సారథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా గెరిల్లా దళాలు ఏర్పడి భూస్వాములు, నిజాం సైన్యానికి వ్యతిరేకంగా సాయుధ పోరు రగిలింది.

పెరోల్‌పై తొలి ఎన్నికలకు..

సాయుధ పోరాటంలో పాల్గొన్న నారాయణరెడ్డి అప్పటి ప్రభుత్వం అరెస్ట్‌ చేయడంలో రెండున్నర నెలలపాటు డిటెన్యూగా నిర్బంధించింది. తొలిసార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా 1951 డిసెంబరు 5న మూడు నెలల పాటు పెరోల్‌పై విడుదల చేశారు. జైలులో ఉండగానే 1952లో జరిగిన నల్గొండ పార్లమెంట్‌, భువనగిరి అసెంబ్లీ స్థానాలకు నామినేషన్‌ వేశారు. పీపుల్స్‌ డెమెక్రటిక్‌ ఫ్రంట్‌ పేరుతో పోటీ చేశారు. పెరోల్‌పై వచ్చాక ప్రచారం చేపట్టారు. పార్టీ ఆదేశాల మేరకు వరంగల్‌ జిల్లాలో ప్రచార బాధ్యతలు చేపట్టారు. పెద్దగా ప్రచారం చేయకున్నా నారాయణరెడ్డి నల్గొండ ఎంపీగా, భువనగిరి ఎమ్మెల్యేగా ఉభయ స్థానాల నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. నెహ్రూ కన్నా అత్యధిక ఓట్లు, మెజార్టీ సాధించి దేశంలోనే చరిత్ర సృష్టించారు. 1957లోనూ భువనగిరి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1962లో తిరిగి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఆ తరువాత పోటీ చేయలేదు.

నేటి తరాలకు ఆదర్శప్రాయంగా..

యువతరానికి రావి నారాయణరెడ్డి జీవితం ఆదర్శంగా నిలుస్తోంది. నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండటమే కాక ఆచరించారు. ఆయన 1991 సెప్టెంబరు 7న కన్నుమూశారు. ఇంత త్యాగం చేసినా ఆయన తన ’వీర తెలంగాణ అనుభవాలు.. జ్ఞాపకాలు’ పుస్తకంలో తాను చేసిన సేవ అంత పెద్దది కాకపోయినా తెలంగాణ ప్రజలు.. నల్గొండ జిల్లా వాసులు ఆదరించి గౌరవించారని పేర్కొనడం ఆయన నిరాడంబరతకు నిదర్శనం.
భువనగిరి, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని