logo

కొత్త హంగులతో ఎన్నికల ఏర్పాట్లు

ఎన్నికల ఏర్పాట్లకు కొత్త హంగులు జోడించి అటు అభ్యర్థులకు, ఇటు ఓటర్లకు సౌకర్యాలు కల్పిస్తున్నారు.

Published : 16 Apr 2024 03:06 IST

హుజూర్‌నగర్‌, హుజూర్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్నికల ఏర్పాట్లకు కొత్త హంగులు జోడించి అటు అభ్యర్థులకు, ఇటు ఓటర్లకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎక్కువ ఓటింగ్‌ శాతం నమోదు కావడమే లక్ష్యంగా పలు నూతన పద్ధతులను అవలంబించనున్నారు. ఈనెల 18న ఎన్నికల ప్రకటన  వెలువడనున్న క్రమంలో అధికారులు అన్ని ఏర్పాట్లపై దృష్టి సారించారు.

ఇంటి వద్ద ఓటు..

మొదటిసారి లోక్‌సభ ఎన్నికల్లో ఇంటి వద్దే ఓటు వేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. నడవలేని వృద్ధులు, దివ్యాంగులు, వివిధ జబ్బులతో కదల్లేని ఓటర్లు తమ ఓటు హక్కును ఇంటి వద్దే వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నారు. ముందస్తుగా ఇంటి వద్ద ఓటు వేయాలనుకునేవారు ఫారం-12డి తో దరఖాస్తు చేసుకోవాలి. వారికి అధికారులు ఎన్నికలకు ముందుగానే ఇంటికి వచ్చి బ్యాలెట్‌ పేపరు ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.

ఆన్‌లైన్‌లో నామినేషన్ల దాఖలు..

ఈసారి లోక్‌సభ ఎన్నికల నామినేషన్లు ఆన్‌లైన్‌లోనూ దాఖలు చేయవచ్చు. మామూలుగా ఆర్వో కార్యాలయంలో నామినేషన్లు వేస్తుంటారు. ఎన్నికల కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో నామినేన్లు వేసుకునే అవకాశం కల్పించారు. ఇలా నామినేషన్లు వేసిన వారు ధ్రువపత్రాలను ఆర్వో కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.

ఆధునికీకరించిన సీ-విజిల్‌ యాప్‌..

సీ-విజిల్‌ యాప్‌ పాతదే. దాన్ని పూర్తిగా ఆధునికీకరించి అందుబాటులోకి తీసుకువచ్చారు. మొదట ఈ యాప్‌ 2014 ఎన్నికల్లో తీసుకువచ్చారు. నగదు, మద్యం, వివిధ రకాల కానుకలు ఇస్తూ ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు ఏం జరిగినా ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లోనే అధికారులు చర్యలు తీసుకుని అక్రమాలను అరికట్టేందుకు చర్యలు తీసుకొంటారు.

పెరిగిన నమూనా పోలింగ్‌ కేంద్రాలు..

ఓటింగ్‌ శాతం పెంచేందుకు ఓటర్లకు మరింత సౌకర్యవంతమైన కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఒక లోక్‌సభ నియోజకవర్గంలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మహిళలకు ప్రత్యేకంగా ఐదు పోలింగ్‌ కేంద్రాలు, ఐదు ఆదర్శ పోలింగ్‌ కేంద్రాలు, దివ్యాంగులకు ఒక పోలింగ్‌ కేంద్రం, నూతన ఓటర్లు, యువకులకు ఒక పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు వీటి సంఖ్య పెంచారు.

సువిధ పోర్టల్‌ ద్వారా అనుమతులు..

రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారం కోసం సభలు, సమావేశాలు, ర్యాలీలు, లౌడ్‌ స్పీకర్లు, వాహనాల్లో ప్రచారం తదితర వాటికి సువిధ పోర్టల్‌ ద్వారా అనుమతులు తీసుకునే అవకాశం కల్పించారు. ప్రత్యేకంగా అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఈ పోర్టల్‌ ద్వారా అనుమతులు తీసుకుని వాటి పత్రాలు దగ్గర పెట్టుకుని తనిఖీ అధికారులు వచ్చినప్పుడు చూపించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని