logo

స్టేషన్‌కొచ్చే కేసులే.. యూట్యూబ్‌ పాఠాలుగా..

సైబర్‌ నేరాలు నిత్యకృత్యమయ్యాయి. కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము రెప్పపాటులో కాజేస్తున్నారు. సాధారణ రైతు నుంచి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు దాకా వీరి బాధితులే. హైదరాబాద్‌ సైబర్‌ క్రైం విభాగంలో

Published : 23 May 2022 04:55 IST

 సైబర్‌ నేరాలపై అవగాహన కల్పిస్తున్న గృహిణి

న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌: సైబర్‌ నేరాలు నిత్యకృత్యమయ్యాయి. కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము రెప్పపాటులో కాజేస్తున్నారు. సాధారణ రైతు నుంచి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు దాకా వీరి బాధితులే. హైదరాబాద్‌ సైబర్‌ క్రైం విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్న భర్త ఇంటికి వచ్చాక స్టేషన్‌కు వచ్చిన ఇలాంటి కేసుల గురించి ఆమెతో మాట్లాడేవారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటి బారినపడకుండా ఉండొచ్చని చెప్పేవారు. అలా వీటిపై అవగాహన పెంచుకున్న ఆమె ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆలోచించారు. గృహిణిగా ఇద్దరు చిన్నారుల సంరక్షణ చూసుకుంటూనే తెలుగులో క్రైం ఫ్రీ ఇండియా అనే యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించారు. రెండేళ్లుగా వివిధ సైబర్‌ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆమే కామారెడ్డి జిల్లా భిక్కనూరుకు చెందిన గడ్డం సుశీల.

 ఒక్కో వీడియోతో అడుగులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా గొల్లపల్లికి చెందిన సుశీల వరంగల్‌ నిట్‌లో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదువుకున్నారు. భిక్కనూరుకు చెందిన మల్లేశ్‌తో 2015లో వివాహమైంది. సైబర్‌ నేరాలపై అవగాహన కల్పిస్తూ 2020లో ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీనికి మంచి స్పందన రావడంతో యూట్యూబ్‌ ఛానెల్‌ ఆలోచన చేశారు. ఈ అంశంపై అప్పటికి పోలీసుశాఖకు కూడా ఎలాంటి యూట్యూబ్‌ ఛానెల్‌ లేదు. భర్త సహకారంతో 2020 సెప్టెంబరు 14న తెలుగులో సైబర్‌ నేరాలపై మొట్టమొదటి ‘క్రైం ఫ్రీ ఇండియా’ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించారు. రోజూ వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న మోసాల గురించి తెలుసుకుంటూ వీడియోలు రూపొందిస్తున్నారు. అలా ఇప్పటి వరకు సైబర్‌ క్రైం, మహిళల అంశాలపై 50కిపైగా వీడియోలు పెట్టారు. 25 లైవ్‌ వీడియోలు చేశారు. ఈ ఛానెల్‌ను 20 వేల మందికిపైగా అనుసరిస్తున్నారు. 

మెయిల్‌.. సెమినార్‌ల ద్వారా..

వీడియోలతోపాటు ఆయా కళాశాలల్లో భర్తతో కలిసి సెమినార్లు నిర్వహిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. సందేహాల నివృత్తి కోసం ‘౯i్ఝ’÷౯’’i-్టi్చజీ ్ణ్ఝ్చiః.‘్న్ఝ మెయిల్‌ను అందుబాటులో ఉంచారు. ఇందులో వచ్చిన ప్రశ్నలకు ఎప్పటికప్పుడు సమాధానాలు ఇస్తున్నారు. ఫొటోలు మార్ఫింగ్‌ చేస్తున్నారని, చరవాణి పోయిందని, ఓటీపీ అడుగుతున్నారని ఎక్కువగా సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. 

పోలీసుశాఖ రివార్డు..

పోలీసుశాఖకు మద్దతుగా వివిధ కార్యక్రమాలు చేపట్టేవారికి సివిలియన్‌ రివార్డు ఇస్తుంటారు. సుమారు రెండున్నరేళ్లుగా సైబర్‌ నేరాలపై వీడియోలు చేస్తున్న సుశీలకు గతేడాది ఇది వరించింది. హైదరాబాద్‌ సీటి పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఈ మేరకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని మున్ముందు కొనసాగించాలని ఆయన సూచించారు.

నకిలీ సైట్లతో భద్రం: గడ్డం సుశీల

అందరి చేతుల్లోకి స్మార్ట్‌ ఫోన్లు వచ్చాక సైబర్‌ నేరాలు అధికమయ్యాయి. ఆన్‌లైన్‌ షాపింగ్‌ పేరిట వస్తున్న నకిలీ సైట్లు, వాట్సాప్‌ ద్వారా గుర్తుతెలియని వ్యక్తులతో చాటింగ్, బహుమతులు వచ్చాయని పంపే లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజలు కూడా అదే స్థాయిలో అవగాహన పెంచుకోవాలి. బ్యాంకు ఖాతాలు, ఆధార్, పాన్‌ కార్డుల సమాచారం గోప్యంగా ఉంచాలి. వీటి వివరాలను ఫోన్లో ఎవరు అడిగినా ఇవ్వకూడదు. అవసరమైతే బ్యాంకుకు వెళ్లి సందేహం నివృత్తి చేసుకోవాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు