logo

కోమాలో ట్రామా

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ట్రామా కేంద్రాన్ని 14 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు భవన నిర్మాణం జరగలేదు.

Updated : 16 Apr 2024 06:39 IST

ఏళ్ల నుంచి మెరుగుపడని సేవలు
న్యూస్‌టుడే, కామారెడ్డి వైద్యవిభాగం

ట్రామా కేంద్రం నిర్వహిస్తున్న గది

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ట్రామా కేంద్రాన్ని 14 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు భవన నిర్మాణం జరగలేదు. అందుబాటులో ఉన్న గదిలోనే నిర్వహణ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్ర నిర్వహణకు వైద్యులను నియమించలేదు. కేంద్ర నిధులతో ఏర్పాటైన ట్రామాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వైద్యులను నియమించుకోవాలని సూచించినా ఆ దిశగా చర్యలు లేవు. ఏళ్ల నుంచి పరిస్థితిలో మార్పు కానరావడం లేదు.

రూ.4.5 కోట్లతో హంగులు

ట్రామా కేంద్రంలో పరికరాల ఏర్పాటు పూర్తి చేశారు. ఒక వాహనాన్ని సమకూర్చారు. రూ.4.5 కోట్లతో ఆధునిక హంగులను సమకూర్చారు. ఇక్కడ రోగుల తాకిడి అధికంగా ఉంది. రోడ్డు ప్రమాదాల బారిన పడి ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. నెలకు 100-120 రోడ్డు ప్రమాదాల కేసులు వస్తుంటాయి. తీవ్రంగా గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలందించాల్సి ఉండగా.. వసతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ట్రామాకేర్‌ ఏర్పాటైనా సేవలు అందించడంలో తీవ్ర జాప్యం నెలకొంటోంది.

పరికరాలు వృథా..

ట్రామాకేర్‌ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పరికరాలు వృథా అయ్యాయి. కామారెడ్డిలో కేంద్రం ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఆక్సిజన్‌, రక్తస్రావాన్ని నియంత్రించడం, గుండె పనితీరును మెరుగుపరచడం తదితర ప్రక్రియలకు వాడే పరికరాలు వినియోగంలో లేవు. కాగా ట్రామా కేంద్రానికి వేరుగా ప్రత్యేక నిపుణులను కేటాయించలేదని వైద్యాధికారులు చెబుతున్నారు. అందుబాటులో ఉన్న సిబ్బందితో సేవలందిస్తున్నామన్నారు.

ప్రమాద బాధితుల పరిస్థితి

ప్రమాదాల్లో గాయపడిన వారిలో చాలామంది తీవ్రమైన రక్తస్రావం, అంతర్గత రక్తస్రావం, గాయాలు, మానసికంగా ఆందోళన చెందుతారు. ప్రమాదం జరిగిన గంటలోపే ఆసుపత్రికి తరలించి అంతర్గత రక్తస్రావం కాకుండా నివారణ చర్యలు తీసుకోవాలి. ఆక్సిజన్‌, రక్తం ఎక్కించడం తదితర ప్రాథమిక వైద్యసేవలు అందిస్తే 20 శాతం వరకు ప్రాణాపాయం నుంచి గట్టెక్కే వీలుంది.

వివరాలు (రోజుకు)

ఓపీ 900-950
ఐపీ 40-60
రోడ్డు ప్రమాద కేసులు 10


వైద్య సిబ్బంది జాడేది..?

జాతీయ రహదారులకు సమీపంలో ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ట్రామాకేర్‌ కేంద్రాల్లో ప్రత్యేక వైద్య సిబ్బందిని నియమిస్తామని గతంలో ప్రకటించారు. ప్రతి కేంద్రంలో ముగ్గురు ఎముకల వైద్య నిపుణులు, ముగ్గురు మత్తుమందు వైద్యులు, నర్సింగ్‌ సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు ఆ నిర్ణయం కార్యరూపం దాల్చలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని