logo

వైద్యకళాశాలలో వసతులు ఉన్నాయా?

గతంలో వైద్య విద్య కమిషన్‌ సభ్యులు నేరుగా వచ్చి వైద్యకళాశాలతో పాటు అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలో సౌకర్యాలు, రోగులకు అందించే సేవలను గమనించేవారు.

Published : 16 Apr 2024 06:22 IST

ఆన్‌లైన్‌లో పరిశీలించనున్న కమిషన్‌

జిల్లా వైద్యకళాశాల

ఈనాడు, కామారెడ్డి: గతంలో వైద్య విద్య కమిషన్‌ సభ్యులు నేరుగా వచ్చి వైద్యకళాశాలతో పాటు అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలో సౌకర్యాలు, రోగులకు అందించే సేవలను గమనించేవారు. ప్రస్తుతం గతానికి భిన్నంగా మొదటిసారి వైద్యకళాశాలలోని తరగతి గదులు, లాబొరేటరీలు, గ్రంథాలయం, బోధనాసుపత్రి నిర్వహణ, బోధన సిబ్బంది హాజరు, పనితీరు తదితర అంశాలను క్షుణ్ణంగా ఆన్‌లైన్‌లోనే వైద్యవిద్య కమిషన్‌ పరిశీలించనుంది. ఈ నేపథ్యంలో జిల్లా వైద్యకళాశాల యంత్రాంగం కళాశాలలోని వసతులకు సంబంధించిన చిత్రాలు, బోధనాసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవలు, ఇతరత్రా వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. ఆచార్యుల నియామకం, హాజరు తీరే ప్రధాన సమస్యగా మారింది. వైద్య విద్య కమిషన్‌ ఈ అంశంపైనే ప్రధాన దృష్టి సారించే అవకాశముంది.

బోధనాసుపత్రిలో సరిపడా లేని సౌకర్యాలు

జిల్లా ఆసుపత్రిగా ఉన్న భవనాన్ని బోధనాసుపత్రిగా మార్చి పడకల సంఖ్యను పెంచినా.. ఆ స్థాయిలో వసతులు సమకూరలేదు. దీంతో రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలల కిందట బోధనాసుపత్రిలోని ఐసీయూలో రోగిని ఎలుకలు కొరికిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మాతాశిశు సంరక్షణ కేంద్రం కోసం నిర్మించిన భవనంలో తాత్కాలికంగా వైద్యకళాశాలను నిర్వహిస్తున్నారు. కళాశాలకు ప్రత్యేకంగా భవనం నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతో భవన నిర్మాణ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ప్రస్తుతం బోధనాసుపత్రిలో అత్యవసర రోగులకు సైతం పడకలు లభించని పరిస్థితి ఉంది. ఆసుపత్రి భవనం ఇరుకుగా ఉండడంతో రోగులకు, వైద్యులకు ఇబ్బందిగా ఉంది.

హాజరు అంతంత మాత్రమే

ఆచార్యుల కొరతతో రోగులకు నాణ్యమైన సేవలు అందడం లేదనే విమర్శలున్నాయి. దీనికి తోడు ఆచార్యులు వచ్చినా గంట, గంటన్నరకు మించి ఆసుపత్రిలో సేవలు అందించడం లేదనే ఆరోపణలున్నాయి. ఆచార్యులతో పాటు వైద్యకళాశాల, బోధనాసుపత్రి సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేసుకోవాలని ఏడాది క్రితమే వైద్యవిద్య కమిషన్‌ ఆదేశించినప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. ఆచార్యుల కొరతను తీర్చేందుకు వైద్యవిధాన పరిషత్‌ వైద్యుల సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే వైద్యవిధాన పరిషత్‌, వైద్య విద్య ఆచార్యుల మధ్య సమన్వయం కొరవడడం సమస్యగా మారింది.

తీరని ఆచార్యుల కొరత

హైదరాబాద్‌ నగరానికి సమీపంలోనే ఉన్నా ఆచార్యుల కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం వైద్యకళాశాలలో విద్యార్థులు మొదటి సంవత్సరం పూర్తిచేసుకుని ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశించనున్నారు. ఆచార్యుల కొరతతో వారు కొంత మేర ఇబ్బందులు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పద్నాలుగు మంది సహాయ ఆచార్యులు కొత్తగా విధుల్లోకి వచ్చారు.


నమోదు పూర్తి చేశాం
- డాక్టర్‌.వెంకటేశ్వర్లు, కామారెడ్డి వైద్యకళాశాల ప్రిన్సిపల్‌

జాతీయ వైద్యవిద్య కమిషన్‌ నిర్దేశానుసారం కళాశాలతో పాటు బోధనాసుపత్రిలోని వసతులను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను పూర్తిచేశాం. ఇటీవల ప్రభుత్వ ఆదేశానుసారం ఒప్పంద ప్రాతిపదికన ఆచార్యులు, సహాయ ఆచార్యుల నియామకం చేపట్టాం. రోగులకు ఇబ్బందులు లేకుండా నాణ్యమైన సేవలు అందిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని