logo

గులాబీ శ్రేణుల్లో జోష్‌

పార్లమెంటు ఎన్నికలకు గులాబీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం తాడ్దాన్‌పల్లి గ్రామ శివారులో మంగళవారం భారాస నిర్వహించిన జహీరాబాద్‌, మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభ ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపింది.

Updated : 17 Apr 2024 06:14 IST

మాట్లాడుతున్న మాజీ సీఎం కేసీఆర్‌, చిత్రంలో  హరీశ్‌రావు, పోచారం, ఎంపీ అభ్యర్థులు వెంకట్రామిరెడ్డి, గాలి అనిల్‌ కుమార్‌ తదితరులు

జోగిపేట, జోగిపేట టౌన్‌, పుల్కల్‌, న్యూస్‌టుడే: పార్లమెంటు ఎన్నికలకు గులాబీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం తాడ్దాన్‌పల్లి గ్రామ శివారులో మంగళవారం భారాస నిర్వహించిన జహీరాబాద్‌, మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభ ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగం కార్యకర్తల్లో జోష్‌ తెచ్చింది. సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, నేతలు హాజరయ్యారు. రసమయి బాలకిషన్‌ ధూంధాం సభికులను ఆకట్టుకుంది.

ఆరు గ్యారంటీలే మట్టుబెడతాయ్‌: హరీశ్‌రావు

కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలే గడ్డపారలై, ఈ ఎన్నికల్లో ఆ పార్టీని మట్టుబెడతాయని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన వంద రోజుల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. డిసెంబరు 9న రైతులకు రూ.2లక్షల రుణమాఫీ అన్నారు, ఇపుడు ఏమైందన్నారు? మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ.2,500 ఇస్తామన్నారు. రైతులకు క్వింటాకు రూ.500 బోనస్‌ వంటి వాటిని ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. రైతు బంధు కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ఆ మాటను వారు నిలబెట్టుకోలేదన్నారు. నాలుగు నెలలకే కరెంటు, తాగు, సాగు నీళ్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత, కేసీఆర్‌ కిట్ల కొరత వంటి ఇబ్బందులు తలెత్తాయన్నారు. పదేళ్లలో ప్రజలకు ఏ ఒక్క మంచి పథకాన్ని భాజపా అమలు చేయలేదన్నారు.

ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన జనం

పాలిచ్చే గేదెను కాదనుకుని : ఎమ్మెల్యే పోచారం

‘ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మాజీ సీఎం కేసీఆర్‌ను మించినోళ్లు ఎవరూ లేరు. అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటు జరిగింది, ఇపుడు మళ్లీ చేయకుండా ఓట్లు వేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. పాలిచ్చే గేదెను కాదనుకుని.. తన్నించుకునే దున్నపోతును తెచ్చుకున్నామన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ సారి పాలిచ్చే గేదెను తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు. జహీరాబాద్‌ భాజపా అభ్యర్థి బీబీ పాటిల్‌ పదేళ్ల పాటు భారాసలోనే ఉన్నారు. ఆయన ఎంపీగా ఉన్న సమయంలో ఏ గ్రామంలో చిన్నపాటి అభివృద్ధి చేయలేదు. అలాంటి వ్యక్తి ఇపుడు భాజపా తరఫున ఇంకేం చేస్తారు. ఈ సారి తప్పకుండా మెదక్‌, జహీరాబాద్‌ భారాస అభ్యర్థులు వెంకట్‌రాంరెడ్డి, గాలి అనిల్‌కుమార్‌లను గెలిపించాలి.’ అని మాజీ సభాపతి, ఎమ్మెల్యే పోచారం అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు