logo

తొమ్మిదేళ్లకు ఊరట

గిరిపల్లెల్లో పండించే వాణిజ్య, ఔషధ గుణాలున్న పంటల్లో పిప్పళ్లు ప్రధానమైంది. మన్యంలో సుమారు ఐదువేల ఎకరాల్లో దీన్ని పండిస్తున్నారు. ప్రభుత్వపరంగా కొనుగోలు చేయకపోవడం, ప్రైవేటు వ్యాపారులే దిక్కవటంతో వారు నిర్ణయించిన

Published : 24 Jan 2022 01:38 IST

పెరిగిన పిప్పళ్ల ధర

ప్రైవేటు తక్కువ ధరకు విక్రయిస్తున్న సరకు

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: గిరిపల్లెల్లో పండించే వాణిజ్య, ఔషధ గుణాలున్న పంటల్లో పిప్పళ్లు ప్రధానమైంది. మన్యంలో సుమారు ఐదువేల ఎకరాల్లో దీన్ని పండిస్తున్నారు. ప్రభుత్వపరంగా కొనుగోలు చేయకపోవడం, ప్రైవేటు వ్యాపారులే దిక్కవటంతో వారు నిర్ణయించిన ధరకే విక్రయించాల్సి వస్తోంది. తొమ్మిదేళ్లగా తగ్గుముఖం పట్టిన పిప్పళ్ల ధర ఈ ఏడాది పెరగడంతో గిరి రైతులకు కొంత ఉపశమనం కలిగింది.
పెదబయలు, హుకుంపేట, ముంచంగిపుట్టు, జి.మాడుగుల, డుంబ్రిగుడ తదితర మండలాలతో పాటు ఒడిశా సరిహద్దుల్లో పిప్పళ్లను సాగు చేస్తున్నారు. దీన్ని ఎంతకాలం భూమిలో ఉంచితే అంత నాణ్యత ఉంటుంది. దీంతో కనీసం రెండు నుంచి మూడేళ్లు, ఆపైన ఐదేళ్ల వరకు ఉంచుతారు. గతంలో పిప్పళ్ల ద్వారా గిరి రైతులకు ఏటా లక్షలాది రూపాయలు ఆదాయం సమకూరేది. కొన్నేళ్లుగా అంతా తిరోగమనంలో ఉంది.

ముంబయికి తరలింపు
మన్యంలో గిరి రైతులు పండించిన పిప్పళ్లను ముంబయికి తరలిస్తున్నారు. దీనికి ముఖ్యంగా వడ్డాది మాడుగుల వ్యాపారులు కొనుగోలు చేసి అక్కడ శుభ్రం చేసి తరలిస్తున్నారు. వీటిని ముంబయిలో ఔషధాల వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని  తెలుస్తోంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పిప్పళ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదు. గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కూడా వీటి కొనుగోలులో చేతులెత్తేయడంతో ప్రైవేటు వ్యాపారులే దిక్కవుతున్నారు. ఏటా నష్టాలు వస్తున్నా.. సాగు మానలేక రైతులు నలిగిపోయేవారు.
కుంగదీస్తున్న దళారుల బెడద
అసలే పడిపోతున్న పిప్పళ్ల ధరలతో నష్టాల్లో మునిగిన రైతులకు దళారుల బెడద మరింత కుంగదీస్తోంది. వి.మాడుగుల వ్యాపారులకు, రైతులకు మధ్య దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. ధరలు లేనివాటికి స్ప్రింగ్‌ త్రాసులు, ఇతరత్రా కాటాలతో రైతులను బురిడీ కొట్టిస్తున్నారు. దీంతో చిరు వ్యాపారులు కూడా నష్టాల పాలవుతున్నారు. సరకు ఎక్కువగా వస్తే ధరలు తగ్గడం, సరకు తక్కువగా వస్తే ధరలు పెంచడం చేస్తున్నారు.
తొమ్మిదేళ్లుగా ధరలు తగ్గుముఖం
పిప్పళ్ల ధరలు తొమ్మిదేళ్లుగా తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. పదేళ్ల క్రితం వరకు ధరలు ఏటా పెరుగుతుండడంతో దీని సాగుపై రైతులు ఆసక్తి కనబరిచారు. ఆ తర్వాత నుంచి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. తొమ్మిదేళ్ల క్రితం పిప్పళ్లు మొదటి రకం కేజీ రూ. 500 నుంచి రూ.800, రెండోరకం కేజీ రూ.300 నుంచి రూ.500 వరకు, మూడోరకం కేజీ రూ.60 నుంచి 100 పలికేవి. ప్రస్తుతం మొదటిరకం కేజీ రూ.350 నుంచి రూ. 420 లోపు, రెండోరకం రూ.280 నుంచి 320వరకు, మూడోరకం రూ.150 నుంచి 190 లోపే పలుకుతున్నాయి.
లావాదేవీలు ఘనం ...సౌకర్యాలు శూన్యం
మన్యంలో వారపు సంతలే కేంద్రంగా కోట్లాది రూపాయల మేర పిప్పళ్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ఎక్కడా అవసరమైన సౌకర్యాలు లేవు. ప్రతి వారపు సంతలోనూ పాడేరు మార్కెట్‌ కమిటీ పన్ను వసూలు చేస్తున్నా.. రైతులకు సౌకర్యాలు కల్పించడం లేదు. కనీసం రైతులు ఉండటానికి, తీసుకొచ్చిన సరకును ఎండా వానల నుంచి రక్షణకు షెడ్లు నిర్మించకపోవడంతో ఆరుబయటే అవస్థలు పడి విక్రయిస్తున్నారు.
 నష్టం వస్తున్నా మానలేదు
పిప్పళ్ల వల్ల తొమ్మిదేళ్లుగా పెద్దగా లాభాలు లేవు. అలవాటు పడ్డాము కాబట్టి చాలా ఇబ్బందులు పడినా వ్యాపారం కొనసాగిస్తున్నాం..

- శెట్టి వెంకట రమణ, వ్యాపారి, సంతారి గ్రామం, హుకుంపేట మండలం

  శ్రమకు తగ్గ ఫలితం లేదు
పిప్పళ్లను సాగుచేస్తున్నా శ్రమకు తగ్గ ఫలితం లేకుండా పోయింది. ఒక వారం ధరలు పెరిగితే మరో వారం తగ్గుతున్నాయి. దీంతో ఎప్పుడు అమ్మితే లాభం వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ధరలు పెరగడంతో కొంత ఆనందంగా ఉంది.

- కొండబాబు, ఇరాడపల్లి గ్రామం, పాడేరు మండలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని