logo

కాసులుంటేనే క్రీడా బరిలోకి!

ప్రభుత్వ నిర్ణయంతో ఆటగాళ్లు.. క్రీడారంగంలోకి ప్రవేశించాలనుకునే వారు అయోమయానికి గురవుతున్నారు. సొమ్ములున్నవారే ఈ విభాగంలో శిక్షణ తీసుకోవటానికి వీలవుతుందనే రీతిలో భారీగా పెంచిన రుసుములపై ఆవేదన వ్యక్తం

Published : 26 May 2022 04:58 IST

శిక్షణ రుసుముల భారీగా పెంపు

ఈనాడు, విశాఖపట్నం:  ప్రభుత్వ నిర్ణయంతో ఆటగాళ్లు.. క్రీడారంగంలోకి ప్రవేశించాలనుకునే వారు అయోమయానికి గురవుతున్నారు. సొమ్ములున్నవారే ఈ విభాగంలో శిక్షణ తీసుకోవటానికి వీలవుతుందనే రీతిలో భారీగా పెంచిన రుసుములపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వపరంగా తగిన ప్రోత్సాహం అందడంతోనే నిఖత్‌ జరీన్‌ ఇటీవల బాక్సింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని పెంచింది. అలా ఆటల్లో రాటుతేలాలనుకునే క్రీడాకారులకు ప్రస్తుత పరిస్థితులు నిరాశ కలిగిస్తున్నాయి. ‘శాప్‌’ నిర్వహణలోని మైదానాల్లో అడుగు పెట్టాలంటే భారీగా చెల్లించాల్సిందే. ఈ మేరకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) ఉత్తర్వులు వచ్చాయి. క్రీడా మైదానాల వినియోగ రుసుములతో మైదానాల నిర్వహణ, విద్యుత్తు, నీటి సౌకర్యం, శిక్షకులకు వేతనాలు ఇవ్వాల్సి ఉందని అధికారులు చెప్పుకొస్తున్నారు. ఈ భారంపై   ఇటీవల కొందరు కలెక్టర్‌ని కలిసి తమ గోడు వివరించారు. 

విశాఖలో నిత్యం సాధన చేసే వారు... క్రీడాకారులు తాజా పరిస్థితిపై కలవరపడుతున్నారు. బ్యాడ్మింటన్, క్రికెట్, స్కేటింగ్, ఈత, టేబుల్‌ టెన్నిస్, టెన్నిస్‌ క్రీడల్లో ఉదయం 5 నుంచి 9 , సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల మధ్య వచ్చే వారికి ప్రత్యేక రుసుములు ప్రకటించారు.

జిమ్నాస్టిక్స్‌లో శిక్షణకు పేదలైతే గతంలో ప్రవేశ రుసుం రూ.50, ప్రతి నెలా రూ.30 చెల్లించాలి. రేషన్‌కార్డు లేకపోతే ప్రవేశ రుసుం రూ.1000, ప్రతి నెలా రూ.500 చెల్లించేవారు. వీటినీ భారీగా పెంచారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు సమావేశమై అంత చెల్లించుకోలేమని ప్రతి నెలా రూ.200, ప్రవేశ రుసుం రూ.500 వసూలు చేసేలా నిర్ణయం తీసుకోవాలని గట్టిగా కోరారు.

తగ్గించాలని కోరాం: క్రీడాకారులు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన అభ్యర్థనలను ఉన్నతాధికారులకు తెలియజేశాం. పెంచిన రుసుములను తగ్గించేలా ప్రతిపాదనల పంపగా సానుకూల నిర్ణయం వస్తుందనే ఆశాభావంతో ఉన్నాం. పేదలకు ఉచితంగానే శిక్షణ ఇవ్వొచ్చు. జిమ్నాస్టిక్స్, క్రికెట్‌ ఇలా మరికొన్నింటికి తగ్గించాలని వినతులు ఇచ్చాం.

- సూర్యారావు, డీఎస్‌డీవో 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని