logo

అబ్బో ఇదేం పోటీ..!

జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ద్వారా గతంలో భర్తీచేయగా మిగిలిన పోస్టులను భర్తీ చేయడానికి గతనెలలో నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఒప్పంద, పొరుగు సేవల పద్ధతిలో నియమించుకోనున్న ఈ పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి.

Published : 29 Jun 2022 03:42 IST

స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు వెల్లువెత్తిన దరఖాస్తులు


వివిధ పోస్టులకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్న వైద్యారోగ్య శాఖ సిబ్బంది (పాత చిత్రం)

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ద్వారా గతంలో భర్తీచేయగా మిగిలిన పోస్టులను భర్తీ చేయడానికి గతనెలలో నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఒప్పంద, పొరుగు సేవల పద్ధతిలో నియమించుకోనున్న ఈ పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. కొవిడ్‌ విధుల నుంచి తొలగించిన సిబ్బందికి ప్రాధాన్యం ఇవ్వనుండడంతో వారంతా ఈ పోస్టులకు దరఖాస్తు చేశారు. వీరితో పాటు కొత్త అభ్యర్థులు తోడవ్వడంతో పోస్టులు తక్కువ, పోటీ ఎక్కువ కనిపిస్తోంది. దీంతో కొంతమంది అభ్యర్థులు దరఖాస్తుతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సుల లేఖలు తెస్తున్నారు.. మరికొందరైతే మధ్యవర్తుల ద్వారా బేరాలు నడుపుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో స్టాఫ్‌నర్స్‌లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు (డీఈవో), ఫార్మసిస్ట్‌లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు (ఎల్‌టీ), నాలుగో తరగతి సిబ్బంది కలిపి 334 పోస్టులను భర్తీచేయడానికి గతేడాది నోటిఫికేషన్‌ ఇచ్చారు. అప్పట్లోనే ఈ పోస్టుల్లో చాలావరకు భర్తీ అయ్యాయి. రిజర్వేషన్లు అనుకూలించనివి, దివ్యాంగుల కేటగిరిలో కొన్ని రకాలతో పాటు, విధుల్లో చేరి రెండు మూడు నెలలకు మానేయడంతో 74 ఖాళీలు ఉండిపోయాయి. దీంతో మిగులు పోస్టుల కోసం గతనెలలో నోటిఫికేషన్‌ జారీచేశారు. ఇప్పటికే నియామక ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉన్నా దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో వాటిని ఆన్‌లైన్‌ చేయడం, ధ్రువపత్రాల పరిశీలన వంటి విషయాల్లో జాప్యం జరిగింది. తాజాగా వీటికి సంబంధించిన మెరిట్‌ ప్రొవిజనల్‌ జాబితాను సంబంధిత పోర్టల్‌లో పెట్టారు. ఈనెలాఖరు నాటికి నియామకం పూర్తిచేయనున్నారు.

* గతేడాది 139 స్టాఫ్‌ నర్సుల పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా 5 వేల మంది దరఖాస్తు చేశారు. ఇప్పుడు 17 పోస్టులకే మూడు వేలకు పైగా దరఖాస్తులు రావడం గమనార్హం. ఒక్కో పోస్టుకు సగటున 196 మంది పోటీ పడుతున్నారు.

* ఫార్మసిస్ట్‌ పోస్టులు 5 ఖాళీలుంటే 271 మంది  దరఖాస్తు చేసుకోగా వీటిని ముందే భర్తీ చేశారు.


డబ్బులిస్తాం.. ఎలాగైనా వచ్చేలా చూడండి..

వైద్యారోగ్య శాఖలో పోస్టులను రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారమే భర్తీ చేయనున్నారు. గతంలో కొవిడ్‌ సేవల్లో పాల్గొన్న సిబ్బందికి పని కాలాన్ని బట్టి వెయిటేజి ఇస్తారు. కొంతమంది అభ్యర్థులు తమకు పోస్టు దక్కుతుందో లేదో అని ఆఖరివరకు చూడకుండా ముందే బేరాలు కుదుర్చుకుంటున్నారు. ఇటీవల చీడికాడ మండలానికి చెందిన ఓ అభ్యర్థిని స్టాఫ్‌నర్స్‌ పోస్టు తనకిస్తే రూ.3 లక్షల వరకు ఇస్తానని డీఎంహెచ్‌వో కార్యాలయంలో తెలిసిన అధికారుల వద్ద బేరాలు పెట్టింది. మరికొందరు దళారుల ద్వారా వస్తున్నారు. గతంలో ఇలాగే మాకు తెలిసిన వారు డబ్బులు ఇచ్చి చేయించుకున్నారట, మాకూ కూడా చేసిపెట్టండంటూ వెంటపడుతున్నారు. పదిరోజుల క్రితం ఓ అభ్యర్థిని జిల్లాలో అధికార పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్యే లేఖ తెచ్చి ఫలానా చోట కావాలని కోరింది. ఈ విషయమై విశాఖ డీఎంహెచ్‌వో డా.విజయలక్ష్మి వద్ద ప్రస్తావించగా ఈ పోస్టుల భర్తీ పారదర్శకంగానే చేపడుతున్నామని చెప్పారు. వారంలో నియమాక ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. కొన్ని రిజర్వేషన్లలో ఎవరూ లేకపోతే కేటగిరి మార్చి నియామకాలు చేపడతామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని