logo

పర్యాటక నిర్లక్ష్యం

కొంతకాలంగా నగరాన్ని సందర్శించే విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గుతోంది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఆ సంఖ్య సగానికిపైగా పడిపోయింది. కొవిడ్‌-19 అనంతరం సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ పర్యాటకపరంగా సరైన ఆదరణ లభించడం లేదు. ఇక్కడున్న ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం,

Published : 26 Sep 2022 05:29 IST

తగ్గుతున్న విదేశీ సందర్శకులు
శ్రద్ధ చూపని యంత్రాంగం
ఈనాడు, విశాఖపట్నం


రుషికొండ బీచ్‌లో విదేశీయుల సందడి (పాత చిత్రం)

కొంతకాలంగా నగరాన్ని సందర్శించే విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గుతోంది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఆ సంఖ్య సగానికిపైగా పడిపోయింది. కొవిడ్‌-19 అనంతరం సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ పర్యాటకపరంగా సరైన ఆదరణ లభించడం లేదు. ఇక్కడున్న ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం, సరైన ప్రచారం లేకపోవడంతో వారంతా ఇతర నగరాలకు వెళ్లిపోతున్నారు.  

ముఖ్యమైన ప్రాంతాలున్నప్పటికీ..

విశాఖ పరిసరాల్లో విదేశీయులను ఆకట్టుకునే ప్రాంతాలున్నప్పటికీ వాటిని అభివృద్ధి చేయకపోవడంతో సందర్శించేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు రూ.7 కోట్లు ఖర్చు చేసి రుషికొండ తీరాన్ని బ్లూఫ్లాగ్‌ బీచ్‌గా అభివృద్ధి చేసినా ఆశించిన స్థాయిలో రావడం లేదు. కొందరు విదేశీయులు ఎక్కడెక్కడ బ్లూఫ్లాగ్‌ బీచ్‌లు ఉన్నాయనేది చూసుకొని మరీ వస్తారు. అలా పరిశీలించుకొని వచ్చేవారూ కరవయ్యారు.

విశాఖ-భీమిలి బీచ్‌ రోడ్డులో వేల సంవత్సరాల కిందట ఏర్పడిన ఎర్రమట్టి దిబ్బలున్నా వీటి వైపు చూసేవారే లేరు. కేంద్రం భౌగోళిక వారసత్వ ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని గుర్తించినప్పటికీ తగిన మౌలిక వసతులు కల్పించకపోవడంతో వీక్షించడానికి వీలు లేకుండా ఉంది.  

గతంలో భీమిలిలో డచ్‌ దేశీయులు నివశించేవారు. అప్పట్లో మృతిచెందిన వారిని అక్కడ సమాధి చేశారు. ఆ సమాధులు ఇప్పటికీ ఉన్నాయి. విశాఖ పాతనగరంలోనూ మరెన్నో ఆంగ్లేయుల స్మృతులున్నాయి. వీటిని సందర్శించేవారు తక్కువగా ఉంటున్నారు.

మంగమారిపేట వద్ద సహజ శిలా తోరణం, బొర్రా గుహలు, గిరిజన సంస్కృతిని తెలియజేసే లంబసింగి, అరకు పరిసరాలను చూసేవారు తగ్గుతున్నారు.

బౌద్ధ పర్యాటకం ఉన్నా..: బౌద్ధులను ఆకర్షించే నిర్మాణాలు ఉమ్మడి విశాఖ జిల్లాలో అత్యధికంగా ఉన్నాయి. తొట్లకొండ, బావికొండలో స్తూపాలు, ఆరామాలు ఆకట్టుకుంటాయి. వీటిని వీక్షించేందుకు కంబోడియా, థాయ్‌లాండ్‌, భూటాన్‌, నేపాల్‌, శ్రీలంక, మయన్మార్‌, జపాన్‌, టిబెట్‌, హాంకాంగ్‌ దేశీయులు అధిక సంఖ్యలో విశాఖకు వచ్చే అవకాశం ఉన్నా సరైన ప్రచారం లేకపోవడంతో రావడం లేదు. గతంలో ప్రత్యేకంగా టూర్‌ ఆపరేటర్లు బుద్ధిజం పర్యాటకానికి ప్రాచుర్యం కల్పించేవారు. గయా నుంచి విశాఖలోని ప్రాంతాలను సందర్శించేలా ప్యాకేజీలు నిర్వహించేవారు. ఇప్పుడు వాటి ఊసేలేదు.

గతంలో ఇక్కడి టూర్‌ ఆపరేటర్లు విదేశాల్లో నిర్వహించే అంతర్జాతీయ పర్యాటక ప్రదర్శనలు, ఇతర వాటికి హాజరయ్యేవారు. స్థానికంగా నిర్వహించే ప్రదర్శనల్లో ఇతర దేశాలకు చెందిన వారు పాల్గొనేవారు. దీంతో వినూత్న పర్యాటక ప్యాకేజీలతో ఆకట్టుకునేవారు. ఇప్పుడు అటువంటివి నిర్వహించడం అరుదుగా మారింది. తగిన ప్రోత్సాహం లేకపోవడంతో టూర్‌ ఆపరేటర్లు సైతం ప్యాకేజీల నిర్వహణకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికైనా విదేశీయులను ఆకట్టుకునే ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని నగర పర్యాటక ప్రేమికులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని