logo

సెజ్‌లో భద్రత గాలికి..!

పదివేల ఎకరాల్లో ఏర్పాటు చేసిన పారిశ్రామిక వాడలో భద్రత గాలిలో దీపంలా మారింది. ప్రమాదకరమైన రెడ్‌జోన్‌ ఫార్మా, రసాయన పరిశ్రమలను ఏర్పాటు చేసిన పాలకులు కార్మికులు, స్థానికులు జీవితాలకు గ్యారంటీ లేకుండా చేశారు.

Published : 01 Feb 2023 05:25 IST

పరిశ్రమల మంత్రి ఇలాకాలో తరచూ ప్రమాదాలే..
ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి, న్యూస్‌టుడే, అచ్యుతాపురం

జీఎంఎఫ్‌సీ కంపెనీలో రియాక్టర్‌ పేలుడు తీవ్రతకు దట్టంగా ఏర్పడిన పొగలు

పదివేల ఎకరాల్లో ఏర్పాటు చేసిన పారిశ్రామిక వాడలో భద్రత గాలిలో దీపంలా మారింది. ప్రమాదకరమైన రెడ్‌జోన్‌ ఫార్మా, రసాయన పరిశ్రమలను ఏర్పాటు చేసిన పాలకులు కార్మికులు, స్థానికులు జీవితాలకు గ్యారంటీ లేకుండా చేశారు. అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థికమండలిలో 206 పరిశ్రమ ఉండగా వీటిలో 134 పరిశ్రమలు రెడ్‌జోన్‌ కేటగిరికి చెందినవే ఉన్నాయి. గతేడాది గ్రీన్‌ జోన్‌లో ఉన్న సీడ్స్‌ దుస్తుల తయారీ పరిశ్రమలో విషవాయువులు విడుదలై వందలాది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. నక్కపల్లి హెటిరో మందుల పరిశ్రమలో ఒకరు చనిపోయారు. ఇటీవల పరవాడ ఫార్మాసిటీలోని లారస్‌ ల్యాబ్స్‌లో జరిగిన ప్రమాదంలో అయిదుగురు మరణించారు. తాజాగా జీఎంఎఫ్‌సీ ల్యాబ్స్‌లో రియాక్టర్‌ పేలి ఒకరు మరణించగా మరో అయిదుగురు గాయపడ్డారు. ఆర్డీవో చిన్నికృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సెజ్‌లో ఏక్షణం ఏ ప్రమాదం జరుగుతుందో తెలియక కార్మికులు, స్థానికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. సెజ్‌లో ఒకే ఒక్క అగ్నిమాపక వాహనం మాత్రమే అందుబాటులో ఉంది. రసాయనాలతో మంటలను అర్పే సాంకేతిక పరికరాలు మచ్చుకైనా లేవు. ఇదీ అచ్యుతాపురం సెజ్‌లో భద్రతా డొల్లతనానికి నిదర్శనం.

అంబులెన్స్‌లేవీ..

అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థికమండలిలో 22వేల మంది మహిళా కార్మికులు పనిచేసే బ్రాండిక్స్‌ అపెరల్‌సిటీపాటు 206వరకు రసాయన, ఫార్మా కంపెనీలు ఉత్పత్తులు కొనసాగిస్తున్నాయి. వీటిలో మరో 20వేల మంది వరకు కార్మికులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఇంత భారీ సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్న ఇక్కడ కంపెనీల్లో అంబులెన్స్‌లు ఎక్కడా కనిపించడం లేదు. బ్రాండిక్స్‌ అపెరల్‌ సిటీ పరిధిలో మాత్రమే ఒకటి రెండు చొప్పున అంబులెన్స్‌లు ఉన్నాయి.

మంటలను అదుపుచేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

ఈఎస్‌ఐ ఆసుపత్రి ఎక్కడ...

ఈ ప్రాంతంలో నిర్మిస్తామన్న ఈఎస్‌ఐ ఆసుపత్రి స్థల గుర్తింపునకు పరిమితమైంది. రాష్ట్ర ప్రభుత్వం దీని నిర్మాణంపై శ్రద్ధ తీసుకోకపోవడంతో ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించిన స్థలంలో తుప్పలు పెరుగుతున్నాయి. అనుకొని ఆపద వస్తే కార్మికులు అనకాపల్లి, గాజువాక, విశాఖపట్నంలోని ఆసుపత్రులకు పరుగులెత్తాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీడ్స్‌ ప్రమాద బాధితులకు ఒక్క ప్రైవేటు ఆసుపత్రిలో సైతం ఆక్సిజన్‌ అందివ్వలేకపోయారంటే ఇక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

పరిహారంతో సరిపెడుతూ..

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సొంత జిల్లాలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులతో వచ్చి హంగామా చేయడం తప్ప తర్వాత కంపెనీల్లో భద్రతా లోపాలపై చర్యలు తీసుకున్న సందర్బాలు లేవు. చనిపోతున్న కార్మికులకు ఎంతోకొంత పరిహారం అందించి చేతులు దులుపుకొంటున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు నిరంతరం సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పెద్దలు కలిపారు.. విధి విడదీసింది..

సీతానగరం, న్యూస్‌టుడే: మనస్పర్థలతో విడిపోయిన దంపతులను గ్రామ పెద్దలు ఒక్కటి చేశారు. వారి మధ్య సఖ్యత నెలకొంటున్న సమయంలో విధి వక్రించి భర్త శాశ్వతంగా దూరమయ్యాడు. కెమిస్టు చొంగల రామారావు (35) విషాద ఉదంతం ఇది. సీతానగరం మండలం గెడ్డలుప్పి నివాసి రామారావు చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడు. ఎమ్మెస్సీ పూర్తి చేసి ఫార్మా కంపెనీలో చేరి కుటుంబానికి అండగా నిలిచాడు. ఈయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఇటీవల గొడవల అనంతరం భార్యాభర్త ఒక్కటయ్యారు. త్వరలో భార్య, కుమార్తెను తాను ఉంటున్న ప్రాంతానికి తీసుకెళ్లాలని భావించాడు. ఇంతలో ఉపాధి పొందిన చోటే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదం వార్త విని అతడి తల్లిదండ్రులు, భార్య శోకసంద్రంలో మునిగిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని