logo

అందరి ఆదరాభిమానాలతోనే విజయం సాధించా!

మా మాస్టారు నిలబడ్డారు.. మా ఉద్యోగి పోటీ చేస్తున్నారు. మావాడు గెలవాలి అంటూ అన్నివర్గాల వారు పార్టీలకు అతీతంగా పనిచేశారు.

Published : 27 Mar 2023 03:55 IST

చిరంజీవిరావును సన్మానిస్తున్న మాజీ ఎమ్మెల్యే రాజు, ఇన్‌ఛార్జి తాతయ్యబాబు తదితరులు

రావికమతం, న్యూస్‌టుడే: మా మాస్టారు నిలబడ్డారు.. మా ఉద్యోగి పోటీ చేస్తున్నారు. మావాడు గెలవాలి అంటూ అన్నివర్గాల వారు పార్టీలకు అతీతంగా పనిచేశారు. అందరి ఆదరాభిమానాలతోనే ఘన విజయం సాధించానని ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీగా విజయం సాధించిన వేపాడ చిరంజీవిరావు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిచిన తరవాత తొలిసారి ఆదివారం స్వగ్రామం వచ్చిన ఆయనకు ఘనస్వాగతం లభించింది. అనంతరం నియోజకవర్గ స్థాయి అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీగా తన విజయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ యువకులు, నా శిష్యబృందం, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని తెదేపా నాయకులు ఎంతో శ్రమించారని, పట్టుదలతో పనిచేశారని చెప్పారు. వైకాపాకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు పార్టీలకు అతీతంగా ఓట్లేసి విజయానికి కారకులయ్యారని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు క్రమశిక్షణ చర్యలకు భయపడి ప్రచారంలోకి రాకుండా ఓటు వేయగా, తన విద్యార్థులతోపాటు కొందరు రోడ్లపైకొచ్చి ప్రచారం చేశారని చెప్పారు. పోలింగ్‌ రోజున కొన్నిచోట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాత్రి 9 గంటల వరకు క్యూలో ఉండి ఓట్లేశారని ప్రశంసించారు. తెదేపా తరఫున తనకు టికెట్‌ ఖరారు అవగానే సొంతూరు దొండపూడి వచ్చి వైకాపా, తెదేపా నాయకులను కలిసి వారి మద్దతు కోరిన విషయం గుర్తుచేశారు. అంతా ఏకాభిప్రాయంతో తనకు మద్దతు పలికారన్నారు. తనకు జన్మనిచ్చిన గ్రామం రుణం తీర్చుకుంటానని చెప్పారు. చోడవరం నియోకవర్గంలో తనకు అత్యధికరులు ఓట్లు వేశారని తెలిపారు. పార్టీ అభివృద్ధికి, రానున్న ఎన్నికల్లో తెదేపా విజయానికి కృషి చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు మాట్లాడుతూ పట్టభద్ర ఎన్నికలు, శాసన సభ్యుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా విజయం సాధించడంతో వైకాపా పాలకుల్లో వణుకు పుట్టిందన్నారు. తెదేపాకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తెదేపా ఇన్‌ఛార్జి బత్తుల తాతయ్యబాబు, గూనూరు మల్లునాయుడు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు