logo

కారుణ్య నియామకాలు చేపట్టాలని ఆందోళన

కారుణ్య నియామకాలు చేపట్టడంతో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని ఏపీ అమరావతి జేఏసీ విశాఖ జిల్లా నాయకులు విమర్శించారు.

Published : 28 Mar 2023 04:16 IST

కలెక్టరేట్‌లో నినాదాలు చేస్తున్న రెవెన్యూ ఉద్యోగులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కారుణ్య నియామకాలు చేపట్టడంతో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని ఏపీ అమరావతి జేఏసీ విశాఖ జిల్లా నాయకులు విమర్శించారు. రాష్ట్ర కమిటీ పిలుపును అనుసరించి వరసగా 19వ రోజు సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. ఆందోళన కార్యక్రమంలో భాగంగా కారుణ్య నియామకాలు పొందని ఉద్యోగుల కుటుంబాలను ఓదార్చారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపి కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. విశాఖ జిల్లాలో 130 మంది కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేస్తే ఒక్కరికీ ఉద్యోగం రాలేదన్నారు. దీనిపై ప్రశ్నిస్తే అర్హతలకు తగిన  ఉద్యోగాలు ఇచ్చేందుకు రోస్టరు పాయింట్లు కుదరకపోవడమే కారణమని చెప్పడం సరికాదన్నారు. కరోనా బారిన పడి పలు ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు మృతి చెందారని, వారి కుటుంబ సభ్యులకు ఇంతవరకు ఉపాధి కల్పించలేదన్నారు,. తక్షణమే కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ రద్దు చేయాలని, మూడు డీఏ బకాయిలు చెల్లించాలని తదితర డిమాండ్ల సాధనకు ఉద్యమం చేపట్టామని, ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. ఏపీ అమరావతి జేఏసీ విశాఖ జిల్లా అధ్యక్షులు సత్తి నాగేశ్వరరెడ్డి, నాయకులు ఎస్‌.ఎ.త్రినాథ్‌, సిహెచ్‌.వి.రమేష్‌, రవిశంకర్‌, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నమ్మి శ్రీనివాసరావు, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా కార్యదర్శి ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని