logo

కోనసీమ అల్లర్ల కేసులో సమగ్ర విచారణ అవసరం

‘కోనసీమ జిల్లా పేరును ‘డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ’ జిల్లాగా మార్చినందుకు జరిగిన అల్లర్లలో నమోదైన కేసులలో రాష్ట్ర ప్రభుత్వం ప్రాసిక్యూషను ఉపసంహరించుకునే నిర్ణయం చట్టబద్ధత పాలనను అపహాస్యం చేయడమే

Published : 01 Apr 2023 06:51 IST

 కేసుల ఉపసంహరణ నిర్ణయం తగదు: మానవహక్కుల వేదిక

ఈనాడు-విశాఖపట్నం: ‘కోనసీమ జిల్లా పేరును ‘డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ’ జిల్లాగా మార్చినందుకు జరిగిన అల్లర్లలో నమోదైన కేసులలో రాష్ట్ర ప్రభుత్వం ప్రాసిక్యూషను ఉపసంహరించుకునే నిర్ణయం చట్టబద్ధత పాలనను అపహాస్యం చేయడమే. రాజకీయ ప్రయోజనాలకు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, వాటి స్వతంత్ర ప్రతిపత్తిని నాశనం చేసి జేబు సంస్థలుగా వాడుకోవడం పాలక పార్టీలకు పరిపాటిగా మారింది. గతంలోనూ తుని అల్లర్ల కేసులు ఎత్తి వేయడం ఈ కోవలోనిదే. కోనసీమ అల్లర్ల కేసులపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలి. తద్వారా సామాన్యులకు చట్టబద్ధ పాలనపై నమ్మకం కలిగించాలి’ అని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు యు.జి. శ్రీనివాసులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.రాజేష్‌, తెలుగు రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు వి.ఎస్‌ కృష్ణ శుక్రవారం ఓ ప్రకటనలో అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నియమించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు ప్రభుత్వాలకు వంత పాడటం తప్ప, స్వతంత్రంగా వ్యవహరించడం లేదన్నారు. కోర్టులు సైతం ఈ విషయంలో స్వతంత్రంగా వ్యవహరించకపోవడం చట్టభద్ధత పాలనకే ముప్పన్నారు. రైతులు, అంగన్వాడీ కార్యకర్తలు, కార్మికులు, దళిత, బలహీన వర్గాలు తమ న్యాయపరమైన హక్కుల కోసం నిరసన తెలియజేసినప్పుడు నమోదైన కేసుల విషయంలో మాత్రం ఈ విచక్షణాధికారాన్ని ఉపయోగించక పోవడం విడ్డూరమన్నారు. ‘ఈ విచక్షణాధికారాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడం ఇప్పుడు సాధారణమై పోయింది’ అని వారు ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని