జగనన్న బాదుడుతో లబోదిబో!
ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలంటే ప్రజలపై పెను భారం పడకుండా ధరలు పెంచాలి. వైకాపా ప్రభుత్వానికి ఇవేమీ పట్టడం లేదు
భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్ ధరలు..
100 నుంచి 150 శాతానికి పెరిగిన మార్కెట్ విలువ
అనకాపల్లిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలంటే ప్రజలపై పెను భారం పడకుండా ధరలు పెంచాలి. వైకాపా ప్రభుత్వానికి ఇవేమీ పట్టడం లేదు. ప్రజలు ఏమైపోతేనేమి ఖజానా నిండాలని చూస్తోంది. ఇప్పటికే అన్ని ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో వీటి సరసన భూముల మార్కెట్ ధరల పెంపు చేరింది. నూతనంగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాలో భూముల క్రయ విక్రయాలు పెరగడం, ప్లాట్లు, ఇళ్ల అమ్మకాల జోరు సాగడంతో ప్రజల నుంచి ఎక్కువగా రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఆదాయాన్ని రాబట్టాలని ప్రభుత్వం భావించింది. దీని కోసం గత నెల 20న జాయింట్ కలెక్టర్ ఛైర్మన్‌గా, జిల్లా రిజిస్ట్రార్, జడ్పీ సీఈఓ, వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ కమిషనర్‌లతో ఒక కమిటీని వేసి 10 రోజుల పాటు కసరత్తు చేసింది. జూన్ 1 నుంచి భూముల మార్కెట్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవంగా మార్కెట్ ధరలు పెంచే సమయంలో నోటిఫికేషన్ ఇచ్చి అభ్యంతరాలు స్వీకరించి అనంతరం నిర్ణయం తీసుకోవాలి. ఇదేమీ లేకుండా జిల్లాలో 30 నుంచి 130 శాతం వరకు నచ్చిన రీతిలో మార్కెట్ ధరలు పెంచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడ్డాక 2022 ఏప్రిల్‌లో భూముల మార్కెట్ ధరలు పెంచారు. ఇప్పడు జోరుగా రిజిస్ట్రేషన్లు అవుతున్న ప్రాంతాలను గుర్తించి 30 శాతం వరకు మార్కెట్ ధరను పెంచారు.
* అచ్యుతాపురం మండలం దుప్పితూరు రెవెన్యూ పరిధిలో నివాస ప్రాంతాల్లో గజం రూ. 2,300 ఉండగా దీన్ని రూ. 5 వేలు చేశారు. ఈ ప్రాంతంలో భూమి ధర ఎకరా రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షలు ఉండగా దీన్ని రూ. 90 లక్షలకు పెంచారు. తోడపల్లి, వెదురువాడ, కొండకర్ల ప్రాంతాల్లోనూ పెంచారు. ఇక్కడ 120 నుంచి 130 శాతం వరకు మార్కెట్ ధరలు పెరిగాయి.
* ఎలమంచిలిలో నివాస ప్రాంతాల్లో గజం రూ. 4,500 నుంచి రూ. 7 వేలు, వాణిజ్య ప్రాంతాల్లో రూ. 5,400 నుంచి రూ. 9 వేలు, ఎకరం భూమి ధరను రూ. 25 లక్షలు నుంచి రూ. 35 లక్షలు చేశారు. లంకలపాలెంలో 60 శాతం వరకు మార్కెట్ విలువల్లో హెచ్చుదల కనిపించింది.
* సబ్బవరం పరిధిలో 85 శాతం, వి.మాడుగులలో 12 గ్రామాల్లో 166 శాతం వరకు భూముల మార్కెట్ ధరలు పెరిగాయి. లక్ష్యాన్ని అధిగమించేందుకు మార్కెట్ ధరలను పెంచుతూ రహదారి పక్కగా ఉన్న భూములకు ఒక ధర.. లోపల ఉన్న వారికి మరో ధర ఉంది. ఆదాయం వస్తుందని భావించిన ఎంపిక చేసిన గ్రామాల్లో అన్నిచోట్ల ఉండే భూములకు మార్కెట్ ధరలను ఒకేలా పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
* చోడవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని ఎంపిక చేసిన 21 గ్రామాల్లో 100 శాతం పైగా మార్కెట్ ధరలను పెంచారు.
* నర్సీపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని 18 గ్రామాల్లో 150 శాతానికి పైగా ధరలు పెరిగిపోయాయి.
* కె.కోటపాడు పరిధిలో ఎంపిక చేసిన 13 గ్రామాల్లో 142 శాతం వరకు పెంచారు.
అనకాపల్లి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. 2022-23 ఏడాదిలో రూ. 368.08 కోట్లు లక్ష్యంగా పెట్టారు. దీంట్లో రూ.251.64 కోట్లు చేరుకోగలిగారు. 2023-24 ఏడాది లక్ష్యం రూ. 429.87 కోట్లు లక్ష్యం, మే నెలాఖరుకు రూ.42.70 కోట్లు సాధించారు. లక్ష్యాన్ని చేరుకునేలా మార్కెట్ ధరలను పెంచారని పలువురు ఆరోపిస్తున్నారు.
కలిసొచ్చిన భూముల రీసర్వే.. భూముల రీ సర్వే మార్కెట్ ధరలను పెంచడానికి బాగా కలిసొచ్చింది. రీ సర్వేలో నివాస, వాణిజ్య, వ్యవసాయ, వ్యవసాయయేతర భూములు, లేఅవుట్ల వివరాలు సమగ్రంగా ఇచ్చారు. దీని ఆధారంగా ధరలను పెంచారు.
‘జగనన్నకు చెబుదాం’లో ఫిర్యాదు చేశా
భూముల మార్కెట్ ధరలు ఏ ప్రాతిపదికను పెంచారో అర్థం కావడం లేదు. 150 శాతానికి పైగా ఒకేసారి పెంచేశారు. ఇది ఎలా భరిస్తారో కనీసం అర్థం చేసుకోకుండా ధరలు పెంచడం దారణం. అచ్యుతాపురం మండలంలో డిమాండ్ ఉన్న డిమాండ్ లేని ప్రాంతాలను కలిపి ఒకే ధర నిర్ణయించి మార్కెట్ ధరలు పెంచారు. దీనిపై ‘జగనన్నకు చెబుదాం’లో ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులకు అడగండి అని సమాధానం చెబుతున్నారు.
ధర్మిరెడ్డి చిరంజీవి, రామన్నపాలెం
గతంలో తక్కువగా ఉన్న వాటిని గుర్తించి..
భూముల మార్కెట్ ధరలు బాగా తక్కువగా ఉన్నవాటిని గుర్తించి ప్రస్తుత ధరలకు అనుగుణంగా పెంచాం. ఒక్కోచోట మార్కెట్ ధర ఎకరా రూ. 3 లక్షలు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. ఇలాంటి చోట్ల ప్రస్తుత ధర ప్రకారం మార్కెట్ ధరలను పెంచాం. ఇది భారీగా అనిపించొచ్చు. భూముల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఎక్కడ జరుగుతున్నాయో అయా ప్రాంతాల్లో మార్కెట్ ధరలు పెంచాం. అన్ని గ్రామాలకు ఒకేలా ధరలు పెంచలేదు.
సీహెచ్ జానకీదేవి, జిల్లా రిజిస్ట్రార్, అనకాపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Harsha Kumar: ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చంద్రబాబును ఏమీ చేయలేరు: హర్షకుమార్
-
Rohit Sharma: కెప్టెన్సీకి సరైన సమయమదే.. అనుకున్నట్లు ఏదీ జరగదు: రోహిత్ శర్మ
-
Arvind Kejriwal: 1000 సోదాలు చేసినా.. ఒక్క పైసా దొరకలేదు: అరవింద్ కేజ్రీవాల్
-
Pakistan: మా దేశం విడిచి వెళ్లిపోండి.. 17లక్షల మందికి పాకిస్థాన్ హుకుం!
-
Festival Sale: పండగ సేల్లో ఫోన్ కొంటున్నారా? మంచి ఫోన్ ఎలా ఎంచుకోవాలంటే..
-
Mansion 24 Trailer: ఆ భవంతిలోకి వెళ్లిన వారందరూ ఏమయ్యారు: ‘మాన్షన్ 24’ ట్రైలర్