logo

విశాఖను వదిలి రైలెళ్లి పోతోంది..!

రాష్ట్రంలోనే విశాఖపట్నం పెద్ద నగరం. నిత్యం లక్షల మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు.. ఆ స్థాయిలో రైళ్లు అందుబాటులో లేకపోవడంతో సీట్ల కోసం పాట్లు తప్పడం లేదు.

Updated : 15 Mar 2024 12:43 IST

దువ్వాడ మీదుగా 35 సర్వీసుల రాకపోకలు
దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ రాకపోవడమే కారణం
ఐదేళ్లుగా పట్టించుకోని జగన్‌ ప్రభుత్వం

చలువతోట(రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే: రాష్ట్రంలోనే విశాఖపట్నం పెద్ద నగరం. నిత్యం లక్షల మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు.. ఆ స్థాయిలో రైళ్లు అందుబాటులో లేకపోవడంతో సీట్ల కోసం పాట్లు తప్పడం లేదు. మరో పక్క వారంలో 35 వరకు రైళ్లు విశాఖ రాకుండా దువ్వాడ స్టేషన్‌ మీదుగా వెళ్లిపోతున్నాయి. విశాఖలో తగినన్ని ప్లాట్‌ఫాంలు లేకపోవడం, స్టేషన్‌లోకి వచ్చిన ప్రతి రైలు, ఇంజిన్‌ మార్చుకుని బయలుదేరాలంటే 20 నిమిషాలకుపైగా సమయం పట్టడం దీనికి కారణమని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి బల్బ్‌ స్టేషన్‌, మర్రిపాలెం స్టేషన్‌ అభివృద్ధికి ప్రతిపాదనలు చేశారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ సాకారమై ఉంటే వాటిల్లో ఒక్కటైనా పట్టాలెక్కేది. కాని వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జోన్‌ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

రైల్వే జోన్‌ వచ్చి ఉంటే..

‘బల్బ్‌ స్టేషన్‌ అభివృద్ధికి అవసరమైన స్థలం ఇవ్వడానికి పోర్టు అంగీకరించకపోవడంతో ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చడం కష్టమే. అయితే కొంచెం దృష్టిపెడితే మర్రిపాలెం స్టేషన్‌ను అభివృద్ధి చేయవచ్చు. గతంలో దీన్ని టెర్మినల్‌ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని భావించారు. ఈ మేరకు కొన్ని పనులు కూడా చేశారు. తర్వాత ఏమైందో ఏమో అది అటకెక్కింది. ఇక్కడ నాలుగైదు ప్లాట్‌ఫారాలు నిర్మిస్తే చాలు.. విశాఖ నుంచి బయలుదేరే రైళ్లను ఇక్కడి నుంచి పంపించవచ్చు. తద్వారా దువ్వాడ మీదుగా వెళ్లే రైళ్లను విశాఖకు మళ్లించవచ్చ’ని ఎప్పటి నుంచో రైల్వే వినియోగదారుల సంక్షేమ సంఘం చెబుతోంది. రైల్వే జోన్‌ సాకారమై ఉంటే ఈ ప్రతిపాదన పట్టాలెక్కి ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే విధంగా విశాఖ నుంచి మరిన్ని కొత్త రైళ్లను నడిపే అవకాశం ఉండేదని, కేవలం జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నగరవాసులు మంచి అవకాశం కోల్పోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

స్థలం విషయంలో ప్రభుత్వం దొంగాట..

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు అవసరమైన స్థలం కేటాయింపులో వైకాపా ప్రభుత్వం దొంగాట ఆడింది. ముడసర్లోవలో సుమారు 52 ఎకరాల స్థలం కేటాయించామని, రైల్వే అధికారులే తీసుకోలేదని చెప్పింది. వాస్తవంగా ఆ స్థలం రిజర్వాయరు పరివాహక ప్రాంతంలో ఉండడంతో తెదేపా హయాంలో అప్పటి కలెక్టర్‌ యువరాజ్‌ నిషేధిత జాబితాలో చేర్చారు. అందులో పట్టాలు కలిగి ఉన్న గిరిజనులను ఖాళీ చేయించారు. వీటన్నింటినీ దాచిపెట్టిన వైకాపా ప్రభుత్వం స్థలం ఇచ్చేసినట్లు నమ్మబలికింది. చివరికి రైల్వేశాఖ మంత్రి లోక్‌సభలో వాస్తవాలు చెప్పడంతో జగన్‌ ప్రభుత్వ దొంగాట బయటపడింది. రైల్వేజోన్‌ సాకారమై ఉంటే రైల్వేబోర్డు వచ్చేదని, విభజన కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి మంచి జరిగేదని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా లక్షలాది మంది రాష్ట్ర యువత ఉద్యోగావకాశాలు కోల్పోయారు. ఆర్‌ఆర్‌బీ పరీక్షలు రాయడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది.


దువ్వాడ మీదుగా రాకపోకలు సాగిస్తున్న రైళ్లు

  • టాటానగర్‌-ఎర్నాకుళం-టాటానగర్‌(నిత్యం)
  • బెంగళూరు-హావ్‌డా-బెంగళూరు (5రోజులు) (విజయనగరం మీదుగా).. బీ బెంగళూరు - హావ్‌డా-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌ (ఒకరోజు)
  • భువనేశ్వర్‌-చెన్నై-భువనేశ్వర్‌ ప్రత్యేక రైలు (ఒకరోజు) బీ హావ్‌డా-సత్యసాయి ప్రశాంతి నిలయం-హావ్‌డా రైలు (ఒకరోజు)
  • కామాఖ్య- బెంగళూరు- కామాఖ్య ప్రత్యేక రైలు (ఒకరోజు) బీ భువనేశ్వర్‌- తిరుపతి-భువనేశ్వర్‌ ప్రత్యేక రైలు (ఒకరోజు)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని