logo

Ysrcp: వైకాపా ప్రచార యావ.. ప్రజాధనం వృథా

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ‘కాదేదీ ప్రచారానికి అనర్హం’ అంటూ వ్యవహరించింది.  చెట్టు, పుట్ట, విద్యుత్తు స్తంభాలు, గృహాలు, ఆసుపత్రులు.. అనే తేడా లేకుండా వైకాపా జెండా నమూనా రంగులేశారు.

Updated : 20 Mar 2024 07:54 IST

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ‘కాదేదీ ప్రచారానికి అనర్హం’ అంటూ వ్యవహరించింది.  చెట్టు, పుట్ట, విద్యుత్తు స్తంభాలు, గృహాలు, ఆసుపత్రులు.. అనే తేడా లేకుండా వైకాపా జెండా నమూనా రంగులేశారు. అంబులెన్సుల నుంచి ఆర్టీసీ బస్సుల వరకు సంక్షేమ పథకాల పోస్టర్లతో నింపేశారు.


వైకాపా నాయకుల ప్రచార యావ వల్ల ఇప్పటికే రూ.కోట్లలో ప్రజాధనం వృథా అయింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వాటన్నింటినీ తీసేయటానికి, రంగులు చెరపడానికి మళ్లీ భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.


ఒక్కో భవనానికి రూ.3 వేలు: జిల్లాలో గత ప్రభుత్వాల హయాంలో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు నడిచేవి. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటుచేశారు. మరికొన్ని చోట్ల యూపీహెచ్‌సీల కోసం కొత్తగా 36 భవనాలు నిర్మించారు. అధికారులు, స్థానిక నాయకులు అత్యుత్సాహంతో భారీగా ఖర్చుపెట్టి వాటికి వైకాపా జెండా రంగులు వేయించారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఆయా భవనాలకు గతంలో వేసిన రంగులు చెరపడానికి ఇద్దరేసి చొప్పున నియమించారు. ఒక్కో భవనానికి తెలుపు రంగు వేయడానికి కనీసం రూ.3 వేలు ఖర్చవుతోంది.

ప్రభుత్వ ఛాతి ఆసుపత్రిలో అంబులెన్సుపై జగన్‌, వైఎస్సార్‌ చిత్రాలు

టిడ్కో ఇళ్లు మరిచారా..?: తాటిచెట్లపాలెం (ఏఎస్‌ఆర్‌ నగర్‌), చిలకపేట, సుద్ధగెడ్డ, పెందుర్తి, గాజువాక, గోపాలపట్నం తదితర ప్రాంతాల్లో తెదేపా హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వైకాపా అధికారంలోకి రాగానే ‘మేమే అంతా చేశామని’ చెప్పుకొనేందుకు ప్రయత్నించింది. భవనాల లోపల పనులు పూర్తి చేయకుండానే, బయట వైకాపా జెండా పోలినట్లు తెలుపు, నీలం రంగులు వేయించారు. వాటిని ఏం చేయాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారు. ఇప్పుడు వాటిని మార్చాలంటే భారీగా వ్యయం చేయక తప్పదు.

వీటినెలా మార్చుతారు..: గతంలో విద్యా దీవెన కిట్లు, జగనన్న భూరక్ష, పాసుపుస్తకాలు, ధ్రువపత్రాలు తదితరాలపై ముఖ్యమంత్రి చిత్రాలు, పేర్లు ముద్రించారు. మరోవైపు పాఠశాల విద్యార్థులకు అందజేసిన ట్యాబుల్లోనూ సీఎం జగన్‌, నవరత్నాల వీడియోలు ప్రసారమవుతున్నాయి. ఇప్పుడు వాటిని ఎలా తొలగించాలో తెలియని పరిస్థితి నెలకొంది. కోడ్‌ అమల్లోకి వచ్చి రెండు రోజులు గడుస్తున్నా రాజకీయ పార్టీలకు చెందిన పోస్టర్లు, చిత్రాలు తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పార్కులు, ఇళ్ల గోడలపై ఇప్పటికీ ‘సిద్ధం’ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.

- ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని