logo

విశాఖ కాదు..అచ్యుతాపురం నుంచే..!

విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) టెర్మినల్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి తన పూర్వ వైభవాన్ని కోల్పోనుంది

Published : 29 Mar 2024 03:47 IST

ఏప్రిల్‌ ఒకటిన ఐఓసీ టెర్మినల్‌ నుంచి ఇంధన రవాణా ప్రారంభం

 

ఐఓసీలో చమురు నిల్వ ట్యాంకులు

న్యూస్‌టుడే, సింధియా: విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) టెర్మినల్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి తన పూర్వ వైభవాన్ని కోల్పోనుంది. అదే తేదీ నుంచి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఐఓసీ కొత్త టెర్మినల్‌ నుంచి పూర్తిస్థాయిలో పెట్రోల్‌, డీజిల్‌ తోలకానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

 మూడున్నర దశాబ్దాల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు పూర్వ తూర్పు గోదావరి జిల్లా వరకు పారిశ్రామిక ప్రాంతం నుంచే ఇంధన రవాణా జరిగేది. తొలి రోజుల్లో ఇక్కడ టెర్మినల్‌ నుంచి మోటార్‌ స్పిరిట్‌, హైస్పీడ్‌ డీజిల్‌ మాత్రమే నాలుగు ర్యాంపుల ద్వారా ఫిల్లింగ్‌ జరిగేది. అప్పట్లో రోజుకు 160 ట్రక్కుల లోడింగ్‌ అయ్యేది. ఆ తర్వాత ర్యాంపుల సంఖ్య పెంచడంతో 280 ట్రక్కుల వరకు లోడింగ్‌ జరిగేది.

 నూతన ఏర్పాట్లు ఇలా..

వచ్చే నెల మొదటి తేదీ నుంచి అచ్యుతాపురంలోని ఐఓసీ కొత్త టెర్మినల్‌ నుంచి పూర్తిస్థాయిలో ఇంధన రవాణా జరగనుంది. ఈ మేరకు రవాణా కాంట్రాక్టర్లు అక్కడ నుంచే ఇంధన సరఫరాకు ఏర్పాట్లు చేసుకునేలా టెండర్లలో ఒప్పందం కుదిరింది.

  •  విశాఖలోని పాత టెర్మినల్‌ నుంచి కేవలం బ్లాక్‌ ఆయిల్‌ లోడింగ్‌కే పరిమితం చేయడానికి ఐఓసీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. సాంకేతికపరమైన అంశాలతో కూడిన ప్రక్రియ పూర్తి చేసింది. ఈ బ్లాక్‌ ఆయిల్‌ విభాగంలో ఎల్‌డీఓ, ఎఫ్‌ఓ(ఫర్నేస్‌ ఆయిల్‌), ఏటీఎఫ్‌(విమానయాన ఇంధనం) వంటి ఉత్పత్తులు మాత్రమే రవాణా జరగనుంది.
  •  ఈ ఉత్పత్తులకైతే రోజుకు 20-25 ట్రక్కులకు మించి లోడింగ్‌ ఉండదని ట్యాంకర్ల యజమానులు చెబుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి పారిశ్రామిక ప్రాంతంతో ఉన్న అనుబంధం తెగిపోతోందని పలువురు ట్యాంకర్ల సిబ్బంది విచారం వ్యక్తం చేస్తున్నారు.
  •  ప్రస్తుతం విశాఖపట్నం ఐఓసీ ప్రాంగణంలోని భారీ ఇంధన నిల్వ ట్యాంకుల నుంచి నేరుగా అచ్యుతాపురానికి తీసుకెళ్లి అక్కడ ర్యాంపుల ద్వారా ట్యాంకర్లకు లోడింగ్‌ చేసే ప్రక్రియను ప్రయోగాత్మకంగా చేపట్టారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని