logo

ఆధార్‌ కార్డు మీది.. క్రెడిట్‌ వారిది..

ఆధార్‌ కార్డులతో బ్యాంకుల్లో క్రెడిట్‌ కార్డులు తీసుకుంటూ పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని మోసాలకు పాల్పడి దండుకుంటున్న ముఠాను కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

Published : 08 Aug 2022 05:26 IST

టాస్క్‌ఫోర్స్‌ అదుపులో ముఠా!

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: ఆధార్‌ కార్డులతో బ్యాంకుల్లో క్రెడిట్‌ కార్డులు తీసుకుంటూ పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని మోసాలకు పాల్పడి దండుకుంటున్న ముఠాను కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలిసింది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఓ ముఠా కమిషనరేట్‌ పరిధిలోని కొంతమందికి ఈ వ్యవహారంలో సాయమందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చాలావరకు ప్రైవేటు బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఇటీవల వెలుగులోకి రావడంతో బ్యాంకు అధికారులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా టాస్క్‌ఫోర్స్‌ రంగంలోకి దిగింది. చాలా రోజులుగా దందా సాగుతోంది. గతంలో కేయూసీ ఠాణాలో కేసు కూడా నమోదైంది. పోలీసుల విచారణ తరువాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇలా మోసం చేస్తారు..: బ్యాంకుల్లో ఖాతా లేకపోయినా క్రెడిట్‌ కార్డులు జారీ చేసే వ్యవహారాలను బ్యాంక్‌ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగిస్తుంది. తొలుత వ్యక్తి ఆధార్‌ కార్డు తీసుకుని క్రెడిట్‌ కార్డు కోసం బ్యాంకుల్లో దరఖాస్తు చేయడంతో కార్డు జారీ అవుతుంది. ఇదే సమయంలో మోసగాళ్లు అదే బ్యాంకులో ఆధార్‌ కార్డు ఇచ్చిన వ్యక్తికి తెలియకుండానే బ్యాంకు ఖాతా తెరిచి దానికి క్రెడిట్‌ కార్డును అనుసంధానిస్తారు. ఖాతాదారులకు ఇవ్వకుండా ఆ కార్డుతో రుణాలు తీసుకుంటారు. ఇలా కొద్ది రోజుల పాటు లావాదేవీలు నడిపిస్తుంటారు. తీరా క్రెడిట్‌ కార్డు బిల్లు ఆధార్‌కార్డుపై ఉన్న చిరునామాకు వస్తే అప్పుడు అసలు వ్యక్తికి తెలుస్తుంది. బ్యాంక్‌కు వెళ్లి తాను ఎలాంటి రుణం తీసుకోలేదని చెప్పిన వారు వినరు. ఆధార్‌కార్డు మీది... క్రెడిట్‌కార్డు మీ పేరు ఉంది... ఖాతాలో మీపేరు ఉంది. మీరు తీసుకున్నారని రుణం కట్టాలని ఒత్తిడి తెస్తుంటారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న ముఠా నిరక్షరాస్యులే లక్ష్యంగా పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని