logo

శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీరామారావు శుక్రవారం వరంగల్‌ నగరంలో విస్తృతంగా పర్యటించనున్నారు. వరంగల్‌ పశ్చిమ, తూర్పులో సుమారు రూ.1000 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.

Published : 06 Oct 2023 04:17 IST

నేడు నగరంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన
ఈనాడు, వరంగల్‌, కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీరామారావు శుక్రవారం వరంగల్‌ నగరంలో విస్తృతంగా పర్యటించనున్నారు. వరంగల్‌ పశ్చిమ, తూర్పులో సుమారు రూ.1000 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మంత్రి కేటీఆర్‌ పర్యటనకు ప్రభుత్వ శాఖలు సర్వం సిద్ధం చేశాయి. హనుమకొండలోని హయగ్రీవ చారి మైదానం, ఖిలా వరంగల్‌లో జరిగే బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు వివిధ సంక్షేమ పథకాల ఆస్తులు పంపిణీ చేస్తారు. కాజీపేట, హనుమకొండ, వరంగల్‌ ప్రధాన రహదారులు, కూడళ్లు ముస్తాబయ్యాయి. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. కేటీఆర్‌ పర్యటనను అడ్డుకుంటామని ప్రతిపక్ష పార్టీల ప్రకటనతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.               

35 ఫ్లాట్ఫారాలతో విశాలంగా

హనుమకొండ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాన్ని ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా కొత్తగా నిర్మించనున్నారు. మంత్రి కేటీఆర్‌ దీనికి శంకుస్థాపన చేయనున్నారు. రూ.83 కోటతో సకల సౌకర్యాలు కల్పిస్తూ 35  ఫ్లాట్ఫారాలతో పునర్నిర్మించనున్నారు.   నిర్మాణం వచ్చే ఏడాది మేడారం జాతర తర్వాత మొదలుపెట్టి ఏడాదిన్నరలో పూర్తి చేస్తారు. హయగ్రీవాచారి మైదానంలో తాత్కాలిక బస్టాండు కొనసాగుతుంది.  


ట్రాఫిక్‌ ఆంక్షలు

వరంగల్‌క్రైం: మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని సీపీ రంగనాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 

  • ములుగు, భూపాలపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్లే భారీ వాహనాలు ఆరెపల్లి నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డు మీదుగా, ఖమ్మం వెళ్లే వాహనాలు కరుణాపురం, మడికొండ, కడిపికొండ, నాయుడు పెట్రోల్‌బంక్‌ నుంచి వెళ్లాలి. నర్సంపేటకు కొత్తపేట, రెడ్డిపాలెం, జాన్‌పీరీలు, గొర్రెకుంట నుంచి వెళ్లాలి.
  • నగరంలోకి వచ్చే భారీ వాహనాలు నగరం బయటనే ఉండాలి. పర్యటన పూర్తయిన తర్వాత లోపలికి అనుమతిస్తారు.
  • ములుగు, పరకాల నుంచి నగరంలోకి వచ్చే బస్సులు పెద్దమ్మగడ్డ, కేయూసీ, సీపీవో, అంబేడ్కర్‌ జంక్షన్‌, ఏషియాన్‌ మాల్‌ మీదుగా బస్టాండ్‌కు చేరుకోవాలి.
  • హనుమకొండ బస్టాండ్‌ నుంచి ములుగు, కరీంనగర్‌ వైపునకు వెళ్లే బస్సులు ఏషియన్‌ మాల్‌, అంబేడ్కర్‌ జంక్షన్‌, సీపీవో, కేయూ జంక్షన్‌ నుంచి వెళ్లాలి. 
  • హనుమకొండ బస్టాండ్‌ నుంచి నర్సంపేట, కొత్తగూడెం, భద్రాచలం, తొర్రూరు, ఖమ్మం వైపునకు బాలసముద్రం, అదాలత్‌, హంటర్‌రోడ్డు మీదుగా వెళ్లాలి. 
  • వరంగల్‌ బస్టాండ్‌ నుంచి హనుమకొండ వైపునకు వచ్చే బస్సులు చింతల్‌బ్రిడ్జి నుంచి రంగాశాయిపేట మీదుగా నాయుడు పెట్రోల్‌ పంపు, ఉర్సుగుట్ట, అదాలత్‌, బాలసముద్రం, మీదుగా చేరుకోవాలి.


ఇతర ప్రాజెక్టుల వివరాలు

  • కాజీపేట దర్గా, ఎఫ్‌సీఐ కాలనీ, ప్రగతినగర్‌ తదితర కాలనీల నుంచి వెలువడే మురుగునీరు శుద్ధిపరిచేందుకు రూ.26.13 కోట్లతో 15 ఎంఎల్‌డీల సామర్థ్యం గల మురుగునీటి శుద్ధీకరణ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. శుద్ధమైన నీళ్లను బంధం చెరువులోకి మళ్లిస్తారు.
  • వరంగల్‌ పోతన మందిరంలో ఆధునిక చెత్త రవాణా కేంద్రం అభివృద్ధి చేశారు. స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా వచ్చే చెత్తను నేరుగా భారీ వాహనాల్లో రాంపూర్‌ డంపింగ్‌కు తరలిస్తారు.
  • గత జులైలో భారీ వర్షాలతో వరంగల్‌, హనుమకొండ ప్రాంతాల్లోని 200 కాలనీలు నీట మునిగాయి. రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు, పైపులైన్లు దెబ్బ తిన్నాయి. అత్యవసరంగా చేయాల్సిన పనుల కోసం రాష్ట్ర పురపాలక శాఖ టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా రూ.250 కోట్లు కేటాయించింది. ఈ పనులను మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారు.
  • హంటర్‌రోడ్డు బొందివాగు నాలా విస్తరణ, ఇరువైపులా రిటైనింగ్‌ గోడ, భద్రకాళి చెరువు వద్ద పెద్ద ప్వలింగ్‌ షట్టర్ల కోసం రూ.158 కోట్లు కేటాయించారు. ఈ పనులకు శంకుస్థాపన చేస్తారు.
  • వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో ఇళ్లు లేని పేదల కోసం రూ.121.05 కోట్లతో సుమారు 2500 రెండు పడకల ఇళ్లు నిర్మించారు. వీటిని లాంఛనంగా మంత్రి ప్రారంభిస్తారు.

భారీ బందోబస్తు

వరంగల్‌క్రైం: మంత్రి కేటీఆర్‌ పర్యటన అడ్డుకుంటామని కొన్ని సంఘాలు, విద్యార్థుల పిలుపు మేరకు వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. 1600 మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వీరితో పాటుగా నిఘా విభాగం అధికారులు, సిబ్బంది అడుగడుగునా ఉంటారు. సమావేశాలు, కార్యక్రమాల వద్ద  ఏసీపీలు ఇన్‌ఛార్జులుగా ఉంటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేటీఆర్‌ పర్యటన అడ్డుకుంటారని అనుమానం ఉన్న వ్యక్తులను పోలీసులు గురువారం రాత్రి ముందస్తు అరెస్టు చేశారు. డీసీపీలు 4, ఏసీపీలు 14, ఇన్‌స్పెక్టర్లు 36. ఎస్పైలు 74, ఏఎస్సైలు 241,  కానిస్టేబుళ్లు 773, మహిళా కానిస్టేబుళ్లు 64, హోంగార్డు 500 మంది బందోబస్తు చేపడతారు.


ఇదీ పర్యటన షెడ్యూలు

  • ఉదయం 9.30 - హైదరాబాద్‌ నుంచి హనుమకొండకు హెలికాప్టర్‌లో వస్తారు. ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో దిగుతారు.
  • 9.45 - హనుమకొండలో రూ.10 కోట్లతో నిర్మించిన ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ప్రారంభోత్సవం, ‘కుడా’కు చెందిన రూ.56 కోట్ల పనులకు శంకుస్థాపన, రూ.100 కోట్ల వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రారంభం, లబ్దిదారులకు అందజేత
  • 10.10 -  కాజీపేట బంధం చెరువు వద్ద మురుగునీటి శుద్ధీకరణ కేంద్రం, బస్తీ దవాఖాన ప్రారంభోత్సవం
  • 10.30 - కాజీపేట ఎన్‌ఐటీ వద్ద రూ.30 లక్షలతో ముస్తాబైన కూడలి ప్రారంభం
  • 10.45 - మడికొండలో రూ.40 కోట్లతో సిద్ధమైన ఐటీ కంపెనీ ప్రారంభం, విద్యార్థులతో సమావేశమవుతారు.
  • 11.30 - బాలసముద్రం హయగ్రీవాచారి మైదానంలో సభ
  • మధ్యాహ్నం 1.00 - హనుమకొండ కొత్త బస్టాండ్‌ నిర్మాణానికి శంకుస్థాపన
  • 1.20 - అలంకార్‌ కూడలి ప్రారంభోత్సవం
  • 1.40 - వరంగల్‌ పోతననగర్‌లో స్మార్ట్‌సిటీ ద్వారా రూ.9 కోట్లతో ఆధునిక దోబీఘాటు, ఆధునిక చెత్త రవాణా కేంద్రం ప్రారంభోత్సవం
  • 1.50 - వరంగల్‌ ఎంజీఎం రోడ్‌ భద్రకాళి స్వాగత తోరణం వద్ద రూ.327.50 కోట్లతో భద్రకాళి బండ్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జి, మ్యూజికల్‌ గార్డెన్‌ ఆధునికీకరణ, ప్లానిటోరియం పునరుద్ధరణ, మున్నూరుకాపు భవన్‌కు శంకుస్థాపన, స్మార్ట్‌సిటీ, టీయూఎఫ్‌ఐడీసీ పనులకు శంకుస్థాపనలు
  • 2.00 - రంగంపేట పోలీసు క్వార్టర్స్‌లో పోలీసు భరోసా కేంద్రం ప్రారంభోత్సవం
  • 2.15 - హనుమకొండ పద్మాక్షిగుట్టరోడ్‌లో రూ.6 కోట్లతో కేసీఆర్‌ భవన్‌ (రజక భవన్‌) ప్రారంభోత్సవం, ఆధునిక దోబీ ఘాట్‌కు శంకుస్థాపన
  •  2.30 - భోజన విశ్రాంతి ః 3.00 -  దూపకుంటలో రూ.121.05 కోట్లతో నిర్మించిన రెండు పడకల గదుల ఇళ్ల ప్రారంభోత్సవం
  • 3.15-  ఖిలావరంగల్‌ కోటలో వరంగల్‌ తూర్పు సంక్షేమ లబ్ధిదారుల సభ, రూ.158 కోట్లతో హంటర్‌రోడ్‌ బొందివాగు నాలా విస్తరణ, ప్వలింగ్‌ షట్టర్ల విస్తరణకు శంకుస్థాపన, సీఎం హామీలు, స్మార్ట్‌సిటీ, ఇతర పనులకు శంకుస్థాపనలు
  • 3.30 - ఖిలా వరంగల్‌లో బహిరంగ సభ, లబ్ధిదారులకు వివిధ సంక్షేమ పథకాల ఆస్తుల పంపిణీ.
  • సాయంత్రం 4.45 - వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సందర్శన.
  • 5.00 - ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యాలయంలో అధికారులతో సమావేశం.
  • 5.30 మామునూరు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని