logo

ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం

లోక్‌సభ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఉదయం నుంచి నామపత్రాల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పటికే ఏర్పాట్లలో తలమునకలవుతున్న యంత్రాంగం ఇక నుంచి మరింత అప్రమత్తంగా ఉండాలి.

Published : 18 Apr 2024 06:19 IST

263 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించాం
వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారిణి ప్రావీణ్య
ఈనాడు, వరంగల్‌

లోక్‌సభ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఉదయం నుంచి నామపత్రాల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పటికే ఏర్పాట్లలో తలమునకలవుతున్న యంత్రాంగం ఇక నుంచి మరింత అప్రమత్తంగా ఉండాలి. మే 13న పోలింగ్‌, జూన్‌ 4న ఫలితాలు వెలువడే వరకు వివిధ దశల్లో ఎంతో కీలక పాత్ర పోషించాలి.  వరంగల్‌ జిల్లా పాలనాధికారి ప్రావీణ్య లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారిణిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధతపై ఆమెతో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది.

నామపత్రాల స్వీకరణ సమయంలో అభ్యర్థితోపాటు మరో నలుగురిని మాత్రమే లోనికి అనుమతిస్తాం. వంద మీటర్ల దూరం వరకు నిషేధిత ప్రాంతంగా ఉంటుంది.

ఇప్పుడున్న ఓటర్ల సంఖ్య 18,16,543. ఏప్రిల్‌ 27వ తేదీ కల్లా సప్లమెంటరీ రోల్‌ కూడా వేస్తాం. అదే ఫైనల్‌ ఓటరు జాబితాగా పరిగణించాలి.

గర్భిణులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్లు ఉండేలా చూస్తున్నాం. గతంలో ఉన్నట్టే ఆదర్శ పోలింగ్‌ కేంద్రాలు, మహిళ, దివ్యాంగ పోలింగ్‌ కేంద్రాలు ఉంటాయి.

ఈసారి 85 ఏళ్లు దాటిన వృద్ధులే ఇంటి వద్ద ఓటేసేందుకు అర్హులు. గత అసెంబ్లీలో 80 దాటిన వారికి కూడా ఉండేది.

ఈనాడు: గురువారం నుంచి నామపత్రాల స్వీకరణ ప్రక్రియ మొదలవుతోంది. తగిన ఏర్పాట్లు చేశారా?
ప్రావీణ్య:
గెజిట్ నోటిఫికేషన్‌ గురువారం విడుదలైన నాటి నుంచే నామపత్రాల స్వీకరణ ఉంటుంది. ఏప్రిల్‌ 25 మధ్యాహ్నం 3 గంటల వరకు తీసుకుంటాం. మధ్యలో 21వ తేదీ ఆదివారం సెలవు ఉంటుంది. వరంగల్‌ కలెక్టరేట్లోనే నామినేషన్లు ఆర్వోగా నేనే స్వీకరిస్తా. ఇప్పటికే పోలీసు కమిషనర్‌తో కలిసి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించాం. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఏర్పాట్లు పూర్తయ్యాయి.

గత అసెంబ్లీ ఎన్నికల్లో విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్ పొందడంలో ఇబ్బంది పడ్డారు. ఈసారి ఎలా?
ఈ సారి ఎన్నికల సంఘం ఎన్‌ఐసీ(నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌) నుంచి ఒక యాప్‌ ఇచ్చారు. పోర్టల్‌లో వివరాలు పొందుపరిచేలా ఉంటుంది. వారి ఎపిక్‌ నెంబర్‌తో సహా అందులో ఎంట్రీ చేస్తే వారి ఓటు ఎక్కడ ఉందో అక్కడ డేటాతో సహా క్యాప్చర్‌ అవుతుంది. గతంలో మాన్యువల్‌గా జరిగే సరికి కొద్దిగా అయోమయానికి గురయ్యారు. ఈ సారి ఆన్‌లైన్‌ ఉంది కాబట్టి ఎవరు ఎక్కడ ఓటేసేందుకు ఎంపిక చేసుకున్నారో అందిరికీ తెలుస్తుంది.

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఎన్ని గుర్తించారు? వాటి వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారా?
పార్లమెంటు నియోజకవర్గం మొత్తం మీద 1903 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో ఇప్పటి వరకు 263 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించాం. వీటిల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర రక్షణ బలగాల ద్వారా నిఘా ఉంటుంది. సూక్ష్మ పరిశీలకులు పర్యవేక్షిస్తారు. అన్ని సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటుచేస్తున్నాం. వీటితోపాటు అర్బన్‌ ప్రాంతాల్లోని కేంద్రాల్లో కూడా వెబ్‌కాస్టింగ్‌ ఉంటుంది. మొత్తం పోలింగ్‌ కేంద్రాల్లో 50 శాతం వాటిల్లో వెబ్‌కాస్టింగ్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

తీవ్రమైన ఎండలు ఉన్నాయి. పోలింగ్‌ కేంద్రాల వద్ద  సౌకర్యాలపై దృష్టి సారించారా?
కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. తాగునీటి వసతి, విద్యుత్తు, పంకాలు, మరుగుదొడ్లు, బల్లలు, దివ్యాంగులు, వృద్ధుల కోసం ర్యాంపులు కచ్చితంగా ఉంటాయి. వడదెబ్బ దృష్ట్యా వైద్య బృందాలు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు సరిపడా ఉండేలా చూస్తాం.

గత అసెంబ్లీ ఎన్నికల్లో నగదు ప్రవాహం బాగా కనిపించింది. ఈసారి ఎన్నికల్లో నగదు కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఎన్నికల కోడ్‌ వచ్చినప్పటి నుంచి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు మూడు చొప్పున మూడు షిప్టుల్లో తిరుగుతున్నాయి. స్టాటిక్‌ సర్వేలెన్స్‌ చెక్‌పోస్టులు నోటిఫికేషన్‌ వచ్చిన నాటి నుంచి ప్రారంభిస్తాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం మూడు చెక్‌పోస్టులు ఉండేలా చూస్తున్నాం.

నామపత్రాలు దాఖలు చేయడానికి రాజకీయ పార్టీలకు తగిన సూచనలు చేశారా?
రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటుచేసి నామపత్రాలను ఏ విధంగా నింపాలో అవగాహన కల్పించాం. సందేహాల నివృత్తికి ‘హెల్ప్‌ డెస్క్‌’ ఏర్పాటు చేశాం.  ఒక్కో అభ్యర్థి నాలుగు సెట్ల నామపత్రాలు వేయొచ్చు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి పోటీచేసే వారు ఫారం (ఎ), ఫారం (బి) సమర్పించాలి. ఇంకు సైన్‌తో కూడిన బీఫారం చివరి రోజు వరకు సమర్పించినా సరిపోతుంది. పైగా పారదర్శకత కోసం అభ్యర్థులు సమర్పించిన ప్రమాణ పత్రాలు (అఫిడవిట్) ఈసీ వెబ్‌సైట్లో పొందుపరుస్తాం. అదే రోజు ప్రజలెవరైనా చూడొచ్చు.

నగదు, మద్యం ఇప్పటి వరకు ఎంత సీజ్‌ చేశారు? ఫిర్యాదులు వస్తున్నాయా?
పార్లమెంటు పరిధిలో సీజ్‌ చేసిన నగదు, మద్యం, బంగారం అన్నింటి విలువ రూ.2.91 కోట్ల వరకు ఉంది. ఒక్క వరంగల్‌ జిల్లాలోనే రూ.18 లక్షల నగదు, 16 వేల లీటర్ల మద్యం పట్టుకున్నాం. మద్యంపై ఎక్కువ కేసులు అవుతున్నాయి. డిస్ట్రిక్‌ సీజర్‌ గ్రీవెన్స్‌ కమిటీ ఉంది. వీరికి తగిన ఆధారాలు చూపిస్తే వదిలేస్తున్నారు. సీ విజిల్‌పై ఇప్పటి వరకు మూడు ఫిర్యాదులే వచ్చాయి. వాటిని పరిష్కరించాం.  ప్రజలకు ఇంకా అవగాహన పెరగాలి. 1950 టోల్‌ఫ్రీ నెంబర్‌కు 28 ఫిర్యాదులు వచ్చాయి. ల్యాండ్‌లైన్‌ నెంబర్‌కు 26 వచ్చాయి. అన్నీ పరిష్కరించాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని