logo

శివారు చెంత.. తాగునీటి చింత

ప్రణాళిక లేమి.. పట్టణాల్లో గతంలో వేసవి వస్తుందంటే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసేవారు. దానికి తగ్గ ప్రతిపాదనలు చేయడం నుంచి నిధులు మంజూరు చేసి అత్యవసర సందర్భాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం ప్రధాన కాలువల్లో అడ్డుకట్ట వేసి నీటిని గరిష్ఠంగా చెరువుల్లోకి నింపడం వంటి పనులు చేపట్టేవారు.

Published : 17 Apr 2024 06:13 IST

 పట్టణ కాలనీల్లో దాహం కేకలు
వైకాపా పాలనలో చర్యలు శూన్యం

పాలకొల్లులో ట్యాంకర్‌ వద్ద నీటి కోసం బారులుతీరిన మహిళలు
 

 

  • చింతలపూడిలోని ఆంథోనినగర్‌,   సిప్రియాంపేట కాలనీలకు తాగునీరు అందడం లేదు. ఏటా వేసవి ఆరంభంలోనే సమస్య తలెత్తుతున్నా పట్టించుకున్న నాథుడు లేరు. ఆయా ప్రాంతాలు మెరకగా ఉండటంతో నీరు పైపులైన్ల వెంబడి సరఫరా కావడం లేదు. అదనపు ట్యాంకుల నిర్మాణాన్ని విస్మరించారు.
  • ఆకివీడు నగరపంచాయతీ పరిధిలో శివారు ప్రాంతాలకు తాగునీరు అందక సుమారు 15 వేల మంది ఇబ్బంది పడుతున్నారు. వీరికి నీరందించేందుకు ఒకే ఒక్క ట్యాంకర్‌ అందుబాటులో ఉండటంతో రోజు తర్వాత మరుసటి రోజు, కొన్ని ప్రాంతాలకైతే మూడు రోజులకోసారి తాగునీరందిస్తున్నారు.అయిదేళ్ల వైకాపా పాలనలో ఉమ్మడి జిల్లాలోని పట్టణాల్లో పైపులైన్ల నిర్మాణం నుంచి అదనపు ట్యాంకుల సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో కనీస చర్యలు శూన్యమని చెప్పవచ్చు. వేసవిలో ముందస్తు చర్యలకు మంగళం పాడారు.
  • ఇది పాలకొల్లు బ్రాడీపేటలో తాగునీటి చెరువు దగ్గర 24 గంటలు నీటి సరఫరా వచ్చే కుళాయిలున్న ప్రాంతం. రోజు మొత్తం మీద ఏ సమయంలో చూసినా డబ్బాలతో అర్ధరాత్రి కూడా నీళ్లు పట్టుకునేవాళ్లతో రద్దీగానే కనిపిస్తుందంటే పట్టణంలో ఏ మేరకు తాగునీరు సమృద్ధిగా అందుతుందో తెలుసుకోవచ్చు. ప్రస్తుత వేసవిలో తాగునీటిని సరఫరా చేయడానికి పాలకొల్లు పురపాలిక ఏర్పాటు చేసిన ఒకే ఒక్క ట్యాంకర్‌ శివారు కాలనీవాసులకు దిక్కవుతుంది. పొరపాటున అది మరమ్మతులకు గురయితే అంతే సంగతి.

ప్రణాళిక లేమి.. పట్టణాల్లో గతంలో వేసవి వస్తుందంటే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసేవారు. దానికి తగ్గ ప్రతిపాదనలు చేయడం నుంచి నిధులు మంజూరు చేసి అత్యవసర సందర్భాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం ప్రధాన కాలువల్లో అడ్డుకట్ట వేసి నీటిని గరిష్ఠంగా చెరువుల్లోకి నింపడం వంటి పనులు చేపట్టేవారు. ఈ ఏడాది అటువంటి చర్యలు కనిపించడం లేదు.

టిడ్కో లబ్ధిదారులంతా బాధితులే..  ఉమ్మడి జిల్లాలోని టిడ్కో సముదాయాలన్నింటా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పాలకొల్లు సముదాయంలో సుమారు 1500 కుటుంబాలు నివాసముంటున్నారు. ఇక్కడకు నిత్యం ఒక ట్యాంకర్‌ నీటిని పంపినా ఎటూ సరిపోని దుస్థితి. దీనికి తగ్గట్టు ట్యాంకర్‌ ఒకచోట పెట్టుకుని అక్కడి నుంచి నీటిని పట్టుకుని అపార్టుమెంట్లలోకి బిందెలతో ఎక్కాలంటే చచ్చేంత పనవుతుందని లక్ష్మితాయారు, సుబ్బలక్ష్మి అనే లబ్ధిదారులు వాపోయారు. భీమవరం, తాడేపల్లిగూడెంలో కూడా ఇదే సమస్య వేధిస్తుంది. నిరుపేదలైన లబ్ధిదారులు చాలా మంది ప్రతిరోజు రూ.25 వెచ్చించి తాగునీటి డబ్బాలు కొనుక్కుని దాహం తీర్చుకుంటున్నారు.

పైపులైన్లు లేక..  అత్యధిక పట్టణాల్లో పరిశీలిస్తే శివారు కాలనీలకు తగిన పైపులైన్లు నిర్మించకపోవడమే తాగునీటి సమస్యకు ప్రధాన కారణం. జంగారెడ్డిగూడెంలో 15 శివారుకాలనీలున్నాయి. 15 వేల మందికి పైబడి జనాభా ఉన్న ఈ ప్రాంతాలకు పైపులైన్లు లేకపోవడం సమస్యగా మారింది. తాడేపల్లిగూడెం పట్టణంలో ఎప్పుడో 40ఏళ్ల కిందట నిర్మించిన పైపులైన్లు పాడయ్యి శివారు కాలనీలకు నీటి సరఫరా కావడం లేదు. కేంద్ర ప్రభుత్వ పుణ్యమా అని అమృత్‌లో 20 కి.మీ. మేర పైపులైన్లు పూర్తిచేశారు. మిగిలినదంతా పూర్తయితేగాని శివారు కాలనీలకు నీటి సమస్య తీరే పరిస్థితి కనిపించడం లేదు.

ఇవే ఆ కాలనీలు

  • పాలకొల్లు 3 8,000  రామయ్యహాలు, చిత్రాయిచెర్వుగట్టు, టిడ్కో సముదాయం.
  • ఆకివీడు 18 15,000 సమతానగర్‌, గంగానమ్మ గుడి ప్రాంతం, పత్రంవీధి, పెద్దపల్లివీధి, చిన్నపల్లివీధి, రజకులవీది, శారదాకాన్వెంట్‌రోడ్డు, రెడ్లవీధి, ఎప్‌సీఐ గోదాం రోడ్డు.
  • భీమవరం 18 15,000
  • తాడేపల్లిగూడెం 12 25,00
  • నరసాపురం 6 15000
  • తణుకు 3  8,000
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని