logo

Mahesh Bank: మహేశ్‌ బ్యాంక్‌ సైబర్‌ దోపిడీ కేసు.. సూత్రధారి గుర్తింపు

హైదరాబాద్‌లోని ఏపీ మహేశ్‌ బ్యాంక్‌పై సైబర్‌ దోపిడీ కేసులో పోలీస్‌ అధికారులు ఎట్టకేలకు కీలక సూత్రధారిని గుర్తించారు. దిల్లీలో ఉంటున్న నైజీరియన్‌ చక్స్‌... మహేశ్‌ బ్యాంక్‌ సర్వర్‌లోకి ప్రవేశించిన

Updated : 03 Apr 2022 07:19 IST

రూ.12.48 కోట్ల నగదు బదిలీకి నగరానికి వచ్చిన ఇద్దరు నిందితులు

పథకం భాగస్వాముల్లో ఒక నైజీరియన్‌అరెస్టు

కర్నూలు బియ్యం వ్యాపారి రసూల్‌.. దిల్లీ అక్తర్‌..

ఈనాడు, హైదరాబాద్‌

హైదరాబాద్‌లోని ఏపీ మహేశ్‌ బ్యాంక్‌పై సైబర్‌ దోపిడీ కేసులో పోలీస్‌ అధికారులు ఎట్టకేలకు కీలక సూత్రధారిని గుర్తించారు. దిల్లీలో ఉంటున్న నైజీరియన్‌ చక్స్‌... మహేశ్‌ బ్యాంక్‌ సర్వర్‌లోకి ప్రవేశించిన హ్యాకర్ల ఆదేశాల మేరకు రూ.12.48 కోట్లు కాజేందుకు కార్యాచరణ రూపొందించాడు. గతేడాది నవంబరు నుంచి చక్స్‌ అదే పనిలో ఉన్నాడు. హైదరాబాద్‌ కేంద్రంగా సైబర్‌ దోపిడీ చేయాలన్నది అతడి పథకమే. ఇందుకోసం ఇద్దరు నైజీరియన్లు స్టీఫెన్‌ ఓర్జీ, సీ ఆప్టిల్‌కు బాధ్యతలు అప్పగించాడు. కమీషన్‌ ఇస్తే ఖాతాలు ఇచ్చేందుకు సిద్ధమైన వారినీ చక్స్‌ సిద్ధం చేశాడు. అంతా పూర్తయ్యాక ఈ ఏడాది జనవరి 22, 23 తేదీల్లో స్టీఫెన్‌ ఓర్జీ, ఆప్టిల్‌ ద్వారా రూ.12.48 కోట్లు బదిలీ చేయించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. స్టీఫెన్‌ ఓర్జీని నాలుగు రోజుల క్రితం అరెస్ట్‌ చేసిన పోలీసులు అతడి ద్వారా సైబర్‌ దోపిడీ తెర వెనుక జరిగిన విషయాలను తెలుసుకున్నారు.

సైబర్‌ దోపిడీ చేసేందుకు నైజీరియన్‌ చక్స్‌ ఏడు ఖాతాలను తెరవాలని అనుకున్నాడు. ఇందులో ఒక ఖాతా తెరిచే బాధ్యతను తనతో సంబధాలున్న దిల్లీ వాసి అక్తర్‌కు అప్పగించాడు. బియ్యం వ్యాపారం, ఇతర పనుల కోసం దిల్లీకి వస్తున్న కర్నూలు నివాసి రసూల్‌తో అక్తర్‌ నాలుగు నెలల క్రితం మాట్లాడాడు. కమీషన్‌ ఇస్తాం... మహేశ్‌ బ్యాంక్‌లో ఖాతా తెరవాలని కోరారు.

* దిల్లీ నుంచి కర్నూలుకు వచ్చిన రసూల్‌ తన స్నేహితుడికి విషయం చెప్పగా.. అతడు కూకట్‌పల్లిలో ఉంటున్న కోలిశెట్టి సంపత్‌కుమార్‌తో మాట్లాడాడు. అతడు సరేననడంతో డిసెంబరులో మహేశ్‌ బ్యాంక్‌లో ఖాతాను ప్రారంభించారు.

* జనవరి రెండోవారంలో అక్తర్‌కు చక్స్‌ ఫోన్‌ చేశాడు. రెండు, మూడు రోజుల్లో రసూల్‌ను హైదరాబాద్‌కు వెళ్లి సంపత్‌ను కలుసుకోవాలని సూచించాడు. రసూల్‌ కర్నూలు నుంచి జనవరి 20న హైదరాబాద్‌ వచ్చాడు. తర్వాత అక్తర్‌ రసూల్‌కు ఫోన్‌చేసి చక్స్‌ మనుషులు వస్తున్నారని చెప్పాడు. జనవరి 22 రాత్రి సంపత్‌, రసూల్‌లు కారులో శంషాబాద్‌కు వెళ్లగా.. నైజీరియన్లు స్టీఫెన్‌ ఓర్జీ, ఆప్టిల్‌లు కలుసుకున్నారు.

* అదే రోజు రాత్రి రెండు గంటలపాటు కారులో తిరిగారు. కారులో ఉన్నప్పుడే ఓర్జీ తన ల్యాప్‌టాప్‌ ద్వారా మహేశ్‌ బ్యాంక్‌లోని సంపత్‌ ఖాతాకు రూ.99 లక్షలు బదిలీ చేశాడు. మరో బ్యాంక్‌లో సంపత్‌ ఖాతాకు కమీషన్‌ కింద రూ.5 లక్షలు బదిలీ చేశాడు.

పార్వతీపురం అలెక్స్‌.. నాగోలు నవీన్‌

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా పార్వతీపురంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న అలెక్స్‌ పాండీతో ఒక నైజీరియన్‌ ద్వారా చక్స్‌ నాలుగు నెలల క్రితం మాట్లాడాడు. హైదరాబాద్‌లోని మహేశ్‌ బ్యాంక్‌లో ఖాతా తెరిపిస్తే పదిశాతం కమీషన్‌ ఇస్తామన్నారు.

* అలెక్స్‌ పాండీ విజయవాడలో ఉన్న అతడి స్నేహితుడు పూసా పవన్‌రాజుకు ఈ విషయాన్ని చెప్పాడు. తనకు హైదరాబాద్‌లో శాన్విక ఎంటర్‌ప్రైజెస్‌ నిర్వహిస్తున్న మేడారపు నవీన్‌ తెలుసని చెప్పగా.. అలెక్స్‌ పాండీ నవీన్‌తో మాట్లాడాడు. మహేశ్‌ బ్యాంక్‌లో ఖాతా తెరిపించాడు.

* నవీన్‌కు సంబంధించిన ఆన్‌లైన్‌ ఖాతా వివరాలన్నింటినీ అలెక్స్‌పాండీ నైజీరియన్‌ చక్స్‌కు చేరవేయగా... చక్స్‌ జనవరి 22, 23 తేదీల్లో రూ.4 కోట్ల నగదును నవీన్‌ ఖాతాకు బదిలీ చేసి అటునుంచి దిల్లీ, యూపీ, ఈశాన్య రాష్ట్రాల్లోని బ్యాంక్‌ ఖాతాలకు పంపించేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని