logo

మత సామరస్యానికి ప్రతీక.. మొహిజొద్దీన్‌ దర్గా

శతాబ్దాల చరిత్ర కలిగిన హజరత్‌ సయ్యద్‌ మౌలానా మొహిజొద్దీన్‌ దర్గా 763వ ఉర్సు (ఉత్సవాలు)కు ముస్తాబైంది. చుట్టూ పచ్చటి చెట్ల  మధ్య, ఆహ్లాదకర వాతావరణంలో కొలువైన ఈ దర్గా సంగారెడ్డి జిల్లా కోహీర్‌ పట్టణంలో ఉంది. పొరుగు రాష్ట్రాలైన

Published : 18 Jan 2022 02:25 IST

రేపటి నుంచి ఉత్సవాలు 

న్యూస్‌టుడే, కోహీర్‌

దర్గా ముఖ ద్వారం

శతాబ్దాల చరిత్ర కలిగిన హజరత్‌ సయ్యద్‌ మౌలానా మొహిజొద్దీన్‌ దర్గా 763వ ఉర్సు (ఉత్సవాలు)కు ముస్తాబైంది. చుట్టూ పచ్చటి చెట్ల  మధ్య, ఆహ్లాదకర వాతావరణంలో కొలువైన ఈ దర్గా సంగారెడ్డి జిల్లా కోహీర్‌ పట్టణంలో ఉంది. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, తదితర ప్రాంతాల నుంచే కాదు, ఇతర జిల్లాలనుంచి కూడా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. మత సామరస్యానికి ప్రతీకగా, నమ్మిన వారికి దైవంగా నిలుస్తున్న దర్గా ఉత్సవాలు ఈ నెల 19 నుంచి ప్రారంభమవుతున్నాయి.  దీనిపై ‘న్యూస్‌టుడే’ కథనం.

800 ఏళ్ల క్రితం...
దాదాపు 800 ఏళ్ల క్రితం తుర్కిస్థాన్‌ను పాలించే ప్రభువు కుమారుడైన హజరత్‌ సయ్యద్‌ మౌలానా మొహిజొద్దీన్‌ సదర్‌ తన 18వ ఏటనే 75మందితో కలిసి ప్రజాసేవకు దేశ సంచారం చేసుకుంటూ కోహీర్‌ ప్రాంతానికి వచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఆయన పేదలకు పెన్నిధిగా, మహిమలతో రోగులకు స్వస్థత చేకూర్చాడని, ప్రజలకు శాంతి మార్గాన్ని చూపాడని పలువురు పెద్దలు చెబుతారు.

హైదరాబాద్‌కు 95 కి.మీ. దూరం
హైదరాబాద్‌కు కేవలం 95 కి.మీ దూరంలో ఉన్న ఈ దర్గాను చేరుకోవడానికి ప్రభుత్వ బస్సు, రైలు సౌకర్యం కూడా ఉంది. ఆటోలు, ఇతర వాహనాలు అందుబాటులో ఉంటాయి. సంవత్సరానికోసారి జరిగే ఉర్సును కనుల పండువగా నిర్వహిస్తారు.  
ఈ నెల 19వ తేదీన సర్కారీ సందల్‌తో ఉర్సు ప్రారంభం.
20న గంధపు ఊరేగింపు, జియారాత్‌ సాంస్కృతిక ప్రదర్శనలు, రాత్రి ఖవాలీలు.
21వ తేదీన ప్రత్యేక గంధం తీసుకు రావడం, దీపారాధన, సాయంత్రం కుస్తీ పోటీలు.


అందరి సహకారంతో నిర్వహణ: షౌకత్‌ అలీ, నిర్వాహకులు
దర్గా ఉత్సవాలలో భాగంగా ఏటా కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. వీటికి కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, తదితర ప్రాంతాల నుంచి  మల్లయోధులు వచ్చి తలపడతారు. రాత్రి వేళల్లో నిర్వహించే ఖవాలీలు కనువిందుగా ఉంటాయి. కొవిడ్‌ నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేశాం. వికలాంగులకు రవాణా సౌకర్యం కూడా అందుబాటులో ఉండేలా చూస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని