Food Innovations : యుద్ధాలు వచ్చాయి.. కాఫీ, క్యాండీ తెచ్చాయి!

ప్రస్తుతం మనం తింటున్న క్యాండీలు (candy), కుర్‌కురేలు, తాగుతున్న ఇన్‌స్టంట్‌ కాఫీ (Instant Coffee).. ఇళ్లలో వాడుతున్న ఎయిర్‌ ఫ్రయర్స్‌ (Air Fryers), మైక్రోవేవ్ అవెన్‌ (Microwave Ovens)అన్నీ యుద్ధాలతో సంబంధం కలిగి ఉన్నాయి. అదెలాగో తెలుసుకోండి. 

Published : 16 May 2023 12:14 IST

‘అవసరమే ఆవిష్కరణకు మూలం’. ప్రతి అవసరం ఓ ఆవిష్కరణ దిశగా అడుగులు వేయిస్తుంది. ముఖ్యంగా ప్రపంచ యుద్ధ సమయాల్లో (World wars) సైనికులకు రోజూ తాజా ఆహారం దొరికేది కాదు. దాంతో ప్రత్యామ్నాయం కోసం అన్వేషించారు. ఆ క్రమంలో ఎన్నో ఆహార ఉత్పత్తులు (Food Innovations) కనిపెట్టారు. అవేంటో తెలుసుకోండి.

నిల్వ మాంసం

అమెరికన్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీ ‘హార్మెల్ ఫుడ్‌ కార్పొరేషన్‌’ 1937లో పంది మాంసాన్ని నిల్వ చేసే విధానాన్ని కనుగొనింది. దానికి ‘స్పామ్’ అనే పేరు పెట్టింది. ఇందులో పంది మాంసంతో పాటు ఉప్పు, నీరు, బంగాళదుంప పొడి, చక్కెర, సోడియం నైట్రైట్‌ ఉండేవి. ఇవి తిన్న సైనికులకు మంచి శక్తి లభిస్తుందనే ఉద్దేశంతో అమెరికా సైన్యం సుమారు 150 మిలియన్‌ పౌండ్ల ఆహారాన్ని కొనుగోలు చేసింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆ ఆహారం ఎంతగానో ఉపయోగపడింది. అప్పటి నుంచి అమెరికా సైనికులు ఏ దేశంలో శిబిరం ఏర్పాటు చేసినా ఈ తరహా ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకెళ్తున్నారట. ప్రస్తుత కాలంలో ఇలాంటి ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ ఏర్పడింది.

తక్షణ శక్తినిచ్చే క్యాండీలు

స్పానిష్‌ సివిల్‌ వార్‌ సమయంలో ఫారెస్ట్ మార్స్‌ ఎస్‌ఆర్‌. అనే వ్యాపారవేత్త పలు రకాల క్యాండీలను తయారు చేశాడు. మిల్కీ వే, మార్స్‌ చాక్లెట్ బార్స్‌, ఎం అండ్‌ ఎం చాక్లెట్ పేరుతో  వాటిని మార్కెట్లో విక్రయించేవారు. అధిక చక్కెర శాతంతో తయారైన వీటిని తిన్న వారికి తక్షణశక్తి లభించేది. అందుకే ఆయన వీటిపై అప్పట్లోనే పేటెంట్‌ తీసుకున్నాడు. ‘నోటిలోనే కరిగిపోతాయి.. మీ చేతిలో కాదు’ అంటూ మార్స్‌ క్యాండీ కంపెనీ ‘ఎం అండ్‌ ఎం’ ఉత్పత్తులను ప్రత్యేకంగా ప్రచారం చేస్తూ అమెరికా సైన్యానికి విక్రయించింది.

ఎయిర్‌ ఫ్రయర్‌

విలియం మ్యాక్సన్ అనే యూఎస్‌ నేవీ అధికారి ఎయిర్‌ ఫ్రయర్‌ను కనుగొన్నారు. తొలి ఎయిర్‌ ఫ్రయర్‌ దాదాపు 35 పౌండ్ల బరువుండేదట. దాని పేరు మ్యాక్సన్‌ వర్ల్‌విండ్‌ ఒవెన్‌. దానిని అల్యూమినియం, స్టీల్‌తో తయారు చేశారు. 120 వోల్ట్‌ల డీసీ మోటార్‌ను వినియోగించుకొని అందులో ఆహారాన్ని వేడి చేయొచ్చు. ఆరు రకాల పదార్థాలను ఒకేసారి ఇందులో వేడి చేసుకోవచ్చనే విషయం కనుక్కున్నారు. 1947లో ఆయన చనిపోయారు.  2008లో ఫిలిప్స్‌ కంపెనీ మళ్లీ ఎయిర్‌ ఫ్రయర్లను విస్తృతంగా ప్రవేశపెట్టింది. దాంతో ప్రతి కిచెన్‌లోనూ వీటి వాడకం పెరిగింది.

మైక్రోవేవ్‌ ఒవెన్‌

మైక్రోవేవ్‌ను ఓ ఇంజినీర్ కాకతాళీయంగా కనిపెట్టారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రేథియాన్‌ ఇంజినీర్ పర్సీ లా బారెన్ స్పెన్సర్‌ మ్యాగ్నెట్రాన్స్‌లను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాడు. ఆ ప్రక్రియలో భాగంగా ఓ క్రియాశీల రాడార్‌ ఎదుట అతను నిల్చొని ఉండగా.. తన జేబులోని క్యాండీ బార్‌ కరిగిపోయింది. దాంతో ఆయన పాప్‌కార్న్‌లు తయారు చేసేందుకు యత్నించి సఫలీకృతుడయ్యాడు. తర్వాత అనేక ప్రయోగాలు చేసి ఎట్టకేలకు  అన్ని రకాల ఆహారాలు వండే మైక్రోవేవ్‌ ఒవెన్‌ అభివృద్ధి చేయగలిగారు. ఫలితంగా 1945లో ఒవెన్‌కు పేటెంట్‌ పొందారు. దానికి రాడార్‌ రేంజ్‌ అనే పేరు పెట్టారు. మొదట్లో ఆ మైక్రోవేవ్‌ ఆరు అడుగులు ఉండేదట. 

ఫ్రీజ్‌ డ్రైయింగ్ టెక్నాలజీ

1906లో ఫ్రాన్స్‌లో జాక్‌ ఆర్సన్‌ డాసన్‌వల్‌ ఫ్రీజ్‌ డ్రైయింగ్‌ టెక్నాలజీని కనుగొన్నాడు. యుద్ధ సమయంలో రక్తంలోనీ సీరంను నిల్వ చేసేందుకు మొదట్లో ఈ సాంకేతికతను వినియోగించేవారు. తరువాత నాటిక్‌ ల్యాబ్స్‌ దాన్ని నాసా వ్యోమగాముల కోసం మరింత అభివృద్ధి చేసింది. దాంతో తేలికైన, అధిక కేలరీలతో కూడిన ఆహారం తయారైంది.

చీజ్‌ ఉత్పత్తులు

ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న కుర్‌కురే సహా అన్ని రకాల ప్రాసెస్డ్‌ చీజ్‌ ఉత్పత్తులన్నీ ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా అమెరికా మిలటరీ కృషి మూలంగానే వచ్చాయి. 1943లో డీహైడ్రేటెడ్‌ చీజ్‌ పౌడర్‌ను అభివృద్ధి చేశారు. దాంతో అమెరికా సైన్యం అనేక ఉత్పత్తులను సేకరించి పెట్టింది. ఎంతలా అంటే యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఆ ఉత్పత్తులు నిల్వ ఉండే స్థాయిలో ఆ సేకరణ సాగింది.  1948లో వాటిని ఫ్రిటో-లే అనే కంపెనీకి విక్రయించారు.

ఇన్‌స్టంట్ కాఫీ

1901లో సటోరి కటో అనే జపనీస్‌-అమెరికన్‌ శాస్త్రవేత్త నీటిలో కరిగే కాఫీ పౌడర్‌ను తయారు చేశాడు. కానీ ఆ ఉత్పత్తికి గిరాకీ రాలేదు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలు కాగానే అమెరికా మిలటరీ రోజుకు 37వేల పౌండ్ల ఇన్‌స్టంట్‌ కాఫీని కొనుగోలు చేసిందట. ప్రస్తుతం ఇళ్లు, మాల్స్‌, కార్యాలయాల్లో ఇన్‌స్టంట్ కాఫీకి ఉన్న డిమాండ్‌ ఎలాంటిదో చెప్పనవసరం లేదు. 

-ఇంటర్నెట్ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని