ఒక రెస్టారెంట్‌.. ఒక్క రోజు.. ఒక్కరే కస్టమర్‌

కరోనా కట్టడిలో ప్రపంచమంతా ఒకతీరుగా ఉంటే స్వీడన్‌ మాత్రం భిన్నంగా ఉంది. దేశాలన్నీ లాక్‌డౌన్‌ విధించి.. కఠిన నిర్ణయాలు తీసుకుంటే ఆ దేశంలో చిన్నపాటి నిబంధనలతో అన్ని కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఎందుకలా అంటే.. ప్రజలు స్వతహాగా క్రమశిక్షణతో.. సమాజంపై

Published : 05 May 2020 10:00 IST

కరోనా కట్టడిలో ప్రపంచమంతా ఒక తీరుగా ఉంటే స్వీడన్‌ మాత్రం భిన్నంగా ఉంది. దేశాలన్నీ లాక్‌డౌన్‌ విధించి.. కఠిన నిర్ణయాలు తీసుకుంటే ఆ దేశంలో చిన్నపాటి నిబంధనలతో అన్ని కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఎందుకలా అంటే.. ప్రజలు స్వతహాగా క్రమశిక్షణతో.. సమాజంపై బాధ్యతతో కరోనా కట్టడిలో భాగస్వామ్యం కావాలి గానీ.. బలవంతంగా వారిపై ఆంక్షలు విధించొద్దు అని ఆ దేశాధినేతలు సెలవిస్తున్నారు. దీంతో స్వీడన్‌లో ప్రజలంతా భౌతిక దూరం పాటిస్తూనే తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో దేశంలోని రెస్టారెంట్లు డైనింగ్‌ టేబుళ్లను దూరం దూరం పెట్టి.. పరిమిత సంఖ్యలో కస్టమర్లకు సేవలందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ స్వీడన్‌ జంట వినూత్న రెస్టారెంట్‌ను ప్రారంభించబోతుంది. ఆ రెస్టారెంట్‌లో ఒక రోజు కేవలం ఒక్క కస్టమర్‌కే ఆహారం అందిస్తారట. ఈ విచిత్రమైన రెస్టారెంట్‌ గురించి మీరూ తెలుసుకోండి.

స్వీడన్‌లోని వార్మ్‌లాండ్‌కి చెందిన భార్యభర్తలు రాస్మస్‌ పెర్సన్‌.. లిండా కార్లసన్‌ మే10న ‘టేబుల్‌ ఫర్‌ వన్‌’ పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించనున్నారు. అదేదో రద్దీగా ఉండే కమర్షియల్‌ ప్రాంతంలో అనుకుంటే పొరపాటే.. ఈ జంట పెట్టనున్న రెస్టారెంట్‌ ఓ కాలనీలో, వాళ్లు నివస్తున్న ఇంటి పక్కన ఉండే పొలంలోనే. పొలం మధ్యలో ఒక డైనింగ్‌ టేబుల్‌, ఒక కుర్చీని మాత్రమే ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పెర్సన్‌ ఇంటి వంటగదికి ఓ తాడు కట్టి.. దానికి ఓ బుట్ట వేలాడదీశారు. రెస్టారెంట్‌కు వచ్చిన వాళ్లు ఆ టేబుల్‌ వద్ద కూర్చొని ఆర్డర్‌ ఇస్తే పెర్సన్‌ జంట తాజాగా వండి బుట్టలో పెట్టి టేబుల్‌ వద్దకు పంపుతారన్నమాట. అయితే ఈ రెస్టారెంట్లోకి ఒక రోజు కేవలం ఒక కస్టమర్‌కి మాత్రమే అనుమతిస్తారట.

ఈ ఆలోచన ఎందుకొచ్చింది?
లాక్‌డౌన్‌ సమయంలో కార్ల్సన్‌ తల్లిదండ్రులు వారి ఇంటికి వచ్చారట. ఇల్లు కొంచెం చిన్నది కావడం.. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాల్సి రావడంతో ఇంటి పక్కన ఉన్న పొలంలో భోజనం ఏర్పాట్లు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని భోజనం చేయడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే ఈ వసతిని అందరికి కల్పించాలని పెర్సన్‌ జంట నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసింది. 

‘‘ప్రస్తుతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో చాలా మంది ఉపాధి కోల్పోయి ఉండొచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండొచ్చు. ఇక్కడ భోజనానికి ఇంత ధర అని నిర్ణయించలేదు. ఎవరికి ఎంత వీలు అయితే అంత ఇవ్వొచ్చు. ఈ రెస్టారెంట్‌ కేవలం భోజనం చేయడానికే కాదు.. వచ్చే వ్యక్తి ఈ ప్రశాంతమైన చోట ఒంటరిగా కూర్చొని తన గురించి తాను ఆలోచించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది’’అని పెర్సన్‌ దంపతులు చెబుతున్నారు. మే 10 నుంచి ఆగస్టు 1 వరకు ఈ రెస్టారెంట్‌ను నిర్వహించనున్నారు. రెస్టారెంట్‌కు వచ్చే స్పందనను బట్టి కొనసాగించాలా వద్ద అని నిర్ణయిస్తారట.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని