Lucile Randon : ఈ బామ్మ 118 ఏళ్లు ఎలా జీవించారో తెలుసా!

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గిన్నిస్‌ రికార్డుకెక్కిన ఫ్రాన్స్‌కు చెందిన బామ్మ లూసిల్‌ రాండన్‌ కన్నుమూసింది. ప్రస్తుతం ఆమె వయసు 118 ఏళ్లు. ఇంతకాలం ఆమె జీవనం ఎలా సాగింది. ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసుకుందాం పదండి.

Published : 20 Jan 2023 14:10 IST

ఫ్రాన్స్‌(France)కు చెందిన బామ్మ లూసిల్‌ రాండన్‌(118) కన్నుమూసింది. టౌలోన్‌ పట్టణంలోని నర్సింగ్‌హోమ్‌లో ఆమె తుది శ్వాస విడిచారు. క్రైస్తవ సన్యాసిని అయిన లూసిల్‌ రాండన్‌(lucile randon).. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గిన్నిస్‌(guinness book) రికార్డుకెక్కింది. ఈమె మరణంతో అమెరికాకు చెందిన 115 ఏళ్ల మారియా బ్రన్యాస్‌ మోరేరా ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వృద్ధురాలిగా రికార్డుల్లో మిగలనున్నారు.

ఇదీ కుటుంబ నేపథ్యం

1904 ఫిబ్రవరి 11న దక్షిణ ఫ్రాన్స్‌లోని అలెస్‌ పట్టణంలో లూసిల్‌ రాండన్‌ జన్మించారు. ఈమెకు ముగ్గురు సోదరులు, ఒక కవల సోదరి కూడా ఉండేది. ఆమె పేరు లైడీ. పుట్టిన ఏడాది తర్వాత కన్నుమూసింది. అసలు పేరు లూసిల్‌ రాండన్‌ అయినప్పటికీ సిస్టర్‌ ఆండ్రేగా ప్రాచుర్యం పొందారు. తన అన్న పేరులోని కొంత భాగాన్ని ఆమె గౌరవ సూచకంగా స్వీకరించారు. క్రైస్తవం పట్ల ఆసక్తితో బాప్టిజం తీసుకున్నారు. అప్పటికి ఆమె వయసు 26 ఏళ్లే.

సేవే పరమావధిగా జీవనం

లూసిల్‌ రాండన్‌ తొలినాళ్లలో ఓ ధనిక కుటుంబంలోని పిల్లలకు ట్యూషన్‌ చెప్పేది. తన జీవిత కాలంలో రెండు ప్రపంచ యుద్ధాలను చూసింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత అనాథలకు, వృద్ధులకు ఆమె సేవ చేయడం ప్రారంభించింది. అనాథ చిన్నారులను చూస్తే లూసిల్‌ హృదయం చలించిపోయేది. నన్‌గా మారిన తరువాత రాండన్‌ విచీలోని ఆస్పత్రిలో 31ఏళ్ల పాటు సేవలందించింది. 75 ఏళ్లు వచ్చేవరకు వివిధ పనులు చేస్తూ జీవించిన ఆమె 2009 నుంచి టౌలోన్‌ పట్టణంలోని నర్సింగ్‌హోమ్‌లో కాలం వెల్లదీశారు. 2010 తరువాత నుంచి కళ్లు సరిగా కనిపించేవి కావు. నడవటానికి చేతకాక వీల్‌ ఛైర్‌ వాడేది. నర్సింగ్‌హోమ్‌లోనే నిద్రిస్తూ కన్నుమూసింది.

కొవిడ్‌ సోకినా కోలుకుంది

కొవిడ్‌ 19 (covid 19) ప్రబలిన తొలినాళ్లలో లూసిల్‌ రాండన్‌ ఆ మహమ్మారి బారినపడింది. ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ లక్షణాలు లేవు. దీంతో వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. మూడు వారాలకే నెగెటివ్‌ కూడా వచ్చింది. దీంతో కొవిడ్‌ నుంచి కోలుకున్న అత్యంత వృద్ధురాలిగానూ ఆమె రికార్డుల్లోకెక్కింది.

దురదృష్టకరమైన గుర్తింపు

లూసిల్‌ రాండన్‌ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా 2022 ఏప్రిల్లో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. అయితే దీనిని ఆమె ‘దురదృష్టకరమైన గుర్తింపు’గా పేర్కొన్నారు. ‘ఈ పాటికి నేను స్వర్గంలో ఉంటే బాగుండేది. కానీ.. ఆ దయగల ప్రభువు నాకు ఇంకా అవకాశం కల్పించలేదంటూ’ ఆ సందర్భంలో ఆమె వ్యాఖ్యానించినట్లు సమాచారం. రాండన్‌ తన 118వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ తన స్వదస్తూరితో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమెకు లేఖ రాశారు. 2021లో పోప్‌ ఫ్రాన్సిస్‌ కూడా ఆమె పుట్టిన రోజున శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖ పంపారు. లూసిల్‌ రాండన్‌ కంటే ముందు జపాన్‌కు చెందిన కానె టనక 119 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

పని చేస్తూ ఉండండి.. ఆరోగ్యంగా ఉంటారు

పదవీ విరమణ చేసే వరకు బతికి ఉంటే చాలనుకునే ఈ రోజుల్లో లూసిల్‌ రాండన్‌ ఇన్నేళ్లు జీవించడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. అది ఎలా సాధ్యమైందని ఓ సందర్భంలో ఆమెను ప్రశ్నిస్తే ‘పని చేస్తున్నంత కాలం మీరు ఆరోగ్యంగా ఉంటారు. నేను నా 108వ ఏట వరకు పనిచేస్తూనే ఉన్నానని’ తాను ఆచరించిన జీవన విధానాన్ని వెల్లడించారు. 

ఇక ఈ బామ్మ ఆహార అలవాట్ల విషయానికి వస్తే ప్రత్యేకంగా ఏమీ తీసుకునేది కాదని ఆమె సన్నిహితులు తెలిపారు. ఉదయం 7గంటలకు నిద్రలేచి అల్పాహారం తీసుకునేదట. ఎలాంటి ఆహారమైనా ఆండ్రే తినేదట. ఈ వయసులోనూ మిఠాయిలు, చాక్లెట్లను తీసుకోవడానికి ఏ మాత్రం సంకోచించేది కాదట. అయితే రోజూ ఉదయం మాత్రం చాక్లెట్(chocolate) తప్పనిసరిగా తినేది. ఆమె అభిరుచి తెలిసి చాక్లెట్లను ఇవ్వడానికి ఇతరులు ఆసక్తి చూపేవారు. ఇక బామ్మ వైన్‌ తీసుకోవడాన్ని ఇష్టపడేది. తన జీవిత కాలం మొత్తం వైన్‌(wine) తీసుకుంటూనే ఉందని ఆమె వ్యక్తిగత వైద్యుడొకరు వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని