America : అమెరికాలో ‘వాటర్‌మెలన్‌ స్నో’.. ఎలా ఏర్పడుతుందో తెలుసా!

అమెరికాలోని (America) కొండ ప్రాంతాల్లో పలు రంగుల్లో మంచు (Snow) దర్శనమిస్తోంది. కొత్తగా కనిపిస్తున్న ఈ మంచును చూసి పలువురు భయాందోళన చెందుతున్నారు. అయితే.. దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..

Published : 26 Jun 2023 15:27 IST

Image : Amazing Pop Culture Podcast

గత కొన్ని రోజులుగా అమెరికాలోని (America) కొండ ప్రాంతాల్లో ఎరుపు, గులాబీ రంగుల్లో మంచు (Snow) దర్శనమిస్తోంది. ముఖ్యంగా యూటా రాష్ట్రంలో ఈ తరహా మంచు ఎక్కువగా కన్పిస్తోంది. తెల్లగా ఉండే మంచు రంగు ఇలా మార్పు చెందడం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుందని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఎరుపు, గులాబీ వర్ణంలో కనువిందు చేస్తున్న ఈ మంచు (Snow) చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. అందుకే దీనిని ముద్దుగా ‘వాటర్‌మెలన్‌ స్నో’ (watermelon snow) అని పిలుస్తున్నారు. అయితే ఈ మంచు వల్ల ఏమైనా నష్టం ఉంటుందా అని చాలా మంది భయపడుతున్నారు.

నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్వతాల్లో ఇలాంటి మంచు సహజంగానే ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. జన  సంచారం ఉండే ప్రాంతాల్లో తాజాగా మంచు కనిపించడం వల్ల అందరికీ ఇది విచిత్రంగా తోస్తోందని వారు చెబుతున్నారు. ప్రజలు ఈ రంగులు చూసి అనుమానించాల్సిన విషయం ఏమీ లేదని స్పష్టం చేశారు.

ఎందువల్ల ఏర్పడుతోంది?

మంచు రంగు మారడానికి ప్రధాన కారణం శీతల వాతావరణంలో వృద్ధి చెందే గ్రీన్‌ ఆల్గేనట. మంచులో వేర్వేరు వర్ణాలకు కారణమయ్యే ఆల్గే జాతులను ‘క్లామిడోమోనస్‌ నివాలిస్‌’ అని పిలుస్తారు. అతి చల్లని ప్రదేశాల్లో ఈ ఆల్గే ఎక్కువగా పెరుగుతుందని యూటా స్టేట్ యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ స్కాట్‌ హోటాలింగ్‌ వెల్లడించారు. ఈ రకమైన ఆల్గేలకు గడ్డకట్టిన మంచును వివిధ రంగుల్లోకి మార్చే గుణం ఉంటుంది. అందుకే కొన్నిచోట్ల ఊదా, ఆకుపచ్చ, నారింజ రంగుల్లోకి కూడా మంచు మారిపోతుందట. 

సూర్యతాపంతో..

ప్రస్తుతం యూటా రాష్ట్రంలో కన్పిస్తున్న ఆల్గే నిద్రాణ స్థితిలోని తిత్తి రూపంలో ఉంది. తగినంత కరిగే నీరు, పోషకాలు చేరితే మంచు సాధారణ రంగులోకి మారిపోతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ మంచు లోపల దాని ఉపరితలం వరకు ఈదగల చిన్న ఫ్లాగెల్లా ఉంటుంది. అది బయటకు వచ్చి సోలార్‌ రేడియేషన్‌కు గురయితే ఆల్గే వికసిస్తుంది. అలా ఆల్గే వికసించడం దాని పునరుత్పత్తి దశకు సంకేతమని చెబుతున్నారు. ఈ సమయంలో ద్వితీయ వర్ణ ద్రవ్యం ఏర్పడటంతో ఆల్గే కణాలు నల్లగా మారతాయి. ఈ వర్ణద్రవ్యం అనే చర్య అతినీల లోహిత కిరణాల బ్లాకర్‌గా పని చేస్తుంది. అంటే ఆల్గే కణాలను సోలార్‌ రేడియేషన్‌ నుంచి కాపాడుతుంది. ఒకసారి ఆల్గే కణాలు సూర్య తాపానికి గురయితే.. అవి వాటి చుట్టూ ఉన్న నీటిని కరిగించి గతంలో ఉన్న మంచు రంగుని మళ్లీ తీసుకొస్తాయి.

‘వాటర్‌ మెలన్ స్నో’ కారణంగా లేదా ఆ మంచు కరిగిన నీరు తాగిన వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలోని కరవు పరిస్థితుల కారణంగా మంచు పడని ప్రాంతాల్లో కూడా ఈ ఏడాది మంచు కురవటం వల్ల ‘వాటర్‌ మిలాన్‌ స్నో’ చూసే వారికి సరి కొత్తగా ఉందని అంటున్నారు.

-ఇంటర్నెట్‌ డెస్క్ ప్రత్యేకం
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని