Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Updated : 07 Jun 2022 16:59 IST

1. తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీలో టీచర్‌ పోస్టులన్నీ ఎస్టీలకే కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని గతంలోనే రద్దు చేసిన సుప్రీంకోర్టు.. ఏపీ, తెలంగాణకు రూ.2.50 లక్షల చొప్పున జరిమానా విధించింది. సుప్రీంకోర్టు జరిమానాను ఏపీ ప్రభుత్వం చెల్లించగా, తెలంగాణ ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులను పాటించలేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

రైలు ఇంజిన్ కింద కూర్చుని 190 కి.మీ. ప్రయాణం చేసిన వ్యక్తి

2. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు విధివిధానాలు ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బదిలీలకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారు బదిలీలకు అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది.

3. TSPSC: మరో 1,433 ఉద్యోగాల భర్తీకి అనుమతి

పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖల్లో మరో 1,433 ఉద్యోగాల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ఈమేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 657 ఏఈఈ, 113 ఏఈ, హెల్త్‌ అసిస్టెంట్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, ఏఎస్ఓ.. తదితర పోస్టులు ఉన్నాయి. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా పోస్టులు భర్తీ చేయనున్నారు.

గృహ రుణ వ‌డ్డీ రేట్ల పెంపు ఎలాంటి ప్ర‌భావం చూపుతుంది?

4. వీడియో బయటపెట్టిన రఘునందన్‌ కూడా నేరస్థుడే: రేణుకాచౌదరి

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలే కాదని.. పసి పిల్లలు కూడా సురక్షితంగా లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటనలో వీడియో బయటపెట్టిన భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు కూడా నేరస్థుడేనన్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ వేధింపులు తాళలేక భాజపా కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే ఏం చర్యలు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు.

5. పోలీసుల యాక్షన్‌ బట్టే నా రియాక్షన్‌: రఘునందన్‌

కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై కేసు నమోదు చేశారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటనపై నిర్వహించిన మీడియా సమావేశంలో బాలిక పేరు, ఫొటో, ఊరు పేర్లను తాను చెప్పలేదన్నారు. తనపై కేసు విషయంలో పోలీసుల యాక్షన్‌ బట్టే తన రియాక్షన్‌ ఉంటుందని రఘునందన్‌ వ్యాఖ్యానించారు. 

6. విజనరీ.. ప్రిజనరీకి తేడా తెలుస్తోంది: ధూళిపాళ్ల

ఏపీలో నిన్న విడుదలైన పదో తరగతి ఫలితాలు చూసి చాలా మంది పిల్లలు బాధ పడుతున్నారని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. ఫలితాల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని.. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. వైకాపా ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేసిందని ఆయన ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ధూళిపాళ్ల మీడియాతో మాట్లాడారు.

7. వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం ప్రారంభం.. 

వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, కంబైన్డ్‌ హార్వెస్టర్ల పంపిణీని సీఎం జగన్‌ ప్రారంభించారు. గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో జెండా ఊపి వాటిని ప్రారంభించిన అనంతరం స్వయంగా ఆయన ట్రాక్టర్ నడిపారు. అనంతరం సీఎం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్‌ హార్వెస్టర్లను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 

22 ఏళ్లకు ఆత్మహత్యాయత్నం.. 33 ఏళ్లకు కంపెనీ సీఈఓ

8. సిద్ధూ కుటుంబానికి రాహుల్‌ పరామర్శ.. తండ్రి కన్నీరుమున్నీరు

కాంగ్రెస్‌ సీనియర్​ నేత రాహుల్‌ గాంధీ పంజాబ్‌లోని మాన్సా జిల్లాకు చేరుకొని హత్యకు గురైన ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిద్ధూ తండ్రి బాల్‌కౌర్‌ సింగ్‌.. రాహుల్‌ను చూడగానే ఆయన్ను హత్తుకొని కన్నీరుమున్నీరయ్యారు. మంగళవారం ఉదయం చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్​.. నేరుగా సిద్ధూ స్వగ్రామానికి వెళ్లారు.

9. నా రక్తాన్ని చిందిస్తా గానీ.. బెంగాల్‌ను ముక్కలు కానివ్వను: దీదీ

బెంగాల్‌ నుంచి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ పలువురు భాజపా నేతలు డిమాండ్లు చేస్తున్న వేళ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీటుగా స్పందించారు. రాష్ట్రాన్ని విభజించాలనే ప్రయత్నాల్ని అడ్డుకొనేందుకు అవసరమైతే తన రక్తాన్ని చిందించేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు భాజపా వేర్పాటు రాజకీయాలు చేస్తోందంటూ విరుచుకుపడ్డారు. 

10. ఆరు నెలల్లో 5 బిలియన్‌ డాలర్లు అవసరం: శ్రీలంక ప్రధాని విక్రమసింఘే

ఇంధన దిగుమతుల కోసం దాదాపు 3.3 బిలియన్ డాలర్లతో సహా పౌరుల ప్రాథమిక అవసరాలు తీర్చేందుకు శ్రీలంక ప్రభుత్వానికి వచ్చే ఆరు నెలల్లో కనీసం అయిదు బిలియన్ డాలర్లు అవసరమవుతాయని ఆ దేశ ప్రధాని రణిల్‌ విక్రమసింఘే మంగళవారం పార్లమెంట్‌కు తెలిపారు. ఆర్థిక స్థిరత్వాన్ని నెలకొల్పడం మాత్రమే సరిపోదని.. మొత్తం ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని