భారత్‌ సహకారమే కీలకం: WEF చీఫ్‌

పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ తయారీ చేయడంతో పాటు కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు జరుగుతోన్న ప్రపంచ కార్యాచరణ ప్రణాళికల్లో భారత్‌ ఒక కీలక భాగమని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం అభిప్రాయపడింది.

Published : 30 Oct 2020 22:34 IST

దిల్లీ: పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ తయారు చేయడంతో పాటు కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు జరుగుతోన్న ప్రపంచ కార్యాచరణ ప్రణాళికల్లో భారత్‌ ఒక కీలక భాగమని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం అభిప్రాయపడింది. అంతేకాకుండా పర్యావరణ మార్పులు, ఆర్థిక అసమానత్వం వల్ల ఎదురయ్యే సవాళ్లతోపాటు రాబోయే రోజుల్లో సంభవించే మహమ్మారులను ఎదుర్కోవడంలోనూ భారత్‌ అత్యంత క్రియాశీల పాత్ర పోషిస్తుందని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ క్లాజ్‌ ష్వాబ్‌ స్పష్టంచేశారు. దీనిలో భాగంగా అంతర్జాతీయ సహకారాన్ని అందించడంలో భారత్‌ పాత్ర కీలకమని అన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న వినాశక సంక్షోభం కరోనా వల్లేనని పేర్కొన్నారు. కానీ, దీనితో సమానంగా మానవ చరిత్రలోనే అత్యంత హీనమైన పర్యావరణ సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటున్నామని క్లాజ్‌ ష్వాబ్‌ గుర్తుచేశారు.

‘నేటి తరం సమాజంలో సామాజిక-ఆర్థిక విభజన, అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అవి మరింతగా క్షీణించాయి. వీటి పెరుగుదలను నియంత్రించడం మాత్రమే సరిపోదు. ఈ సమయంలో మనకు ఒక రీసెట్‌ అవసరం’ అని డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు క్లాజ్‌ ష్వాబ్‌ అభిప్రాయపడ్డారు. 50ఏళ్ల క్రితం వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరాన్ని క్వాజ్‌ ష్వాబ్‌ స్థాపించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని