వైట్‌హౌస్‌ను వీడేందుకు సిద్ధంగా మెలానియా?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ అభ్యర్థి జోబైడెన్‌ విజయం సాధించినప్పటికీ.. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ ఓటమిని అంగీకరించని విషయం తెలిసిందే. దీనిపై అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ ఇప్పటి...

Published : 10 Dec 2020 23:43 IST

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ అభ్యర్థి జోబైడెన్‌ విజయం సాధించినప్పటికీ.. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ ఓటమిని అంగీకరించని విషయం తెలిసిందే. దీనిపై అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ ఇప్పటి వరకూ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. అయితే, ఆమె మాత్రం వైట్‌హౌస్‌ను వీడాలని అనుకుంటోందని తెలిసింది. వైట్‌హౌస్‌ వీడిన తర్వాత బడ్జెట్‌, సిబ్బంది కేటాయింపుల విషయాలు చూసుకొనేందుకు ఓ వ్యక్తిని నియమించినట్లు తెలుస్తోంది. ఆ మేరకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసుకొంటోందని ఆమె సన్నిహితులు తెలిపారు. 2024లో తిరిగి వైట్‌హౌస్‌లో అడుగుపెడతానన్న ట్రంప్‌ మాటలపై మెలానియా అపనమ్మకంగా ఉన్నారని ఆమె తెలిపారు.

ప్రస్తుతం అమెరికా ప్రథమ మహిళగా మెలానియా తన బాధ్యతల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారని ఆమె ముఖ్య సహాయకురాలు తెలిపారు. ఆమె వైట్‌హౌస్‌లోని గులాబీతోట సంరక్షణ, ఈ ఏడాది క్రిస్మస్‌ సంబరాలతో పాటు తల్లిగా, భార్యగా, అమెరికా ప్రథమ మహిళగా తన బాధ్యతల్లో తీరిక లేకుండా ఉన్నారని ఆమె వివరించారు. ఇప్పటి వరకూ అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారు, వారి భార్యలు వైట్‌హౌస్‌లో తమ అనుభవాలను వివరిస్తూ పుస్తకాలు విడుదల చేశారు. మెలానియా కూడా వారి బాటలోనే నడుస్తున్నారు. కానీ పూర్తిస్థాయి రచన కాకుండా ఎక్కువశాతం ఫొటోలతో ఈ పుస్తకాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే వివిధ ప్రచురణ సంస్థలతో మెలానియా సమావేశమయ్యారని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని