న్యూజిలాండ్‌ పార్లమెంట్‌లో మలయాళం మాట్లాడితే..

న్యూజిలాండ్‌ పార్లమెంట్‌కు రెండోసారి ఎన్నికై మంత్రి పదవిని దక్కించుకున్న భారత సంతతి మహిళ ప్రియాంక రాధాకృష్ణన్‌ పార్లమెంట్‌లో మలయాళంలో మాట్లాడిన ఓ వీడియో వైరల్‌గా మారింది...

Published : 06 Nov 2020 22:47 IST

పాత వీడియోను పంచుకున్న పౌర విమానయానశాఖ మంత్రి

దిల్లీ: న్యూజిలాండ్‌ పార్లమెంట్‌కు రెండోసారి ఎన్నికై మంత్రి పదవిని దక్కించుకున్న భారత సంతతి మహిళ ప్రియాంక రాధాకృష్ణన్‌ పార్లమెంట్‌లో మలయాళంలో మాట్లాడిన ఓ వీడియో వైరల్‌గా మారింది. మూడేళ్ల క్రితం తన మాతృభాష అయిన మలయాళంలో మాట్లాడిన వీడియోను భారత పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. కేరళ మూలాలున్న ఆమె 2017లో లేబర్‌ పార్టీ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అదే ఏడాది నవంబర్‌లో జరిగిన పార్లమెంటు సమావేశంలో రాధాకృష్ణన్‌ కొద్దిసేపు మలయాళంలో మాట్లాడారు. మాతృభాషలో మాట్లాడిన అనంతరం ఈ పార్లమెంట్‌లో నా మాతృభాష అయిన మలయాళం మాట్లాడటం ఇదే మొదటిసారి అని భావిస్తున్నాను అని ఆనందం వ్యక్తం చేశారు. 

కాగా న్యూజిలాండ్‌ పార్లమెంట్‌కు రెండోసారి ఎన్నికైన ప్రియాంకను రెండోసారి ప్రధానిగా ఎన్నికైన జెసిండా ఆర్డెన్స్‌ మంత్రి పదవిని అప్పగించారు. ఈసందర్భాన్ని పురస్కరించుకొని 2017లో ప్రియాంక మాట్లాడిన ఆ వీడియోను మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘న్యూజిలాండ్‌ పార్లమెంట్‌లో మలయాళంలో మాట్లాడి భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు’ అని రాధాకృష్ణన్‌ను మంత్రి కొనియాడారు. కాగా ఆ వీడియో ప్రస్తుతం వైరలవుతోంది.

కేరళ మూలాలున్న ప్రియాంక కుటుంబం మొదట సింగపూర్‌కు వలసవెళ్లింది. అక్కడే పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న ప్రియాంక ఉన్నత చదువులకోసం న్యూజిలాండ్‌కు వెళ్లారు. అక్కడే ఉన్నత చదువులు పూర్తి చేసుకొన్నారు. 2017లో మొదటిసారి న్యూజిలాండ్‌ పార్లమెంట్‌కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. న్యూజిలాండ్‌ పార్లమెంట్‌కకు ఎన్నుకోబడిన మొట్టమొదటి భారత సంతతి వ్యక్తిగా నిలిచారు. కాగా రెండోసారి ఎన్నికైన ఆమె ఈసారి మంత్రి పదవిని దక్కించుకున్నారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని