జాబ్‌ పోయింది.. ఆ కార్మికులకు నెలకు ₹15వేలు చొప్పున ఇవ్వండి!

మైనింగ్‌ కార్యకలాపాలు నిలిచిపోవడంతో అనేక మంది కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారిందని, వారందరికీ నెలకు రూ.15వేలు .......

Published : 18 May 2022 01:47 IST

గోవా సీఎంకు ఏఐటీయూసీ విజ్ఞప్తి

పనాజీ: మైనింగ్‌ కార్యకలాపాలు నిలిచిపోవడంతో అనేక మంది కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారిందని, వారందరికీ నెలకు రూ.15వేలు చొప్పున ఇచ్చి ఆదుకోవాలని గోవా ప్రభుత్వాన్ని ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఏఐటీయూసీ) కోరింది. గోవాలో 88 కంపెనీలకు 2015లో ఇచ్చిన ఇనుప ఖనిజం మైనింగ్ లీజులకు రెండోసారి రెన్యువల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో 2018లో గోవాలో మైనింగ్ పూర్తిగా నిలిచిపోయింది. ఆయా గనుల్లో యంత్ర పరికరాలను తొలగించాలని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కూడా లీజు సంస్థలకు నోటీసులు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో మైనింగ్ కార్మికుల సర్వీసు తొలగింపును ఎదుర్కొన్నట్లయితే..  నిరుద్యోగం, జీవనోపాధి, వారి కుటుంబాల అస్తిత్వానికి సంబంధించిన తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని సీఎం ప్రమోద్‌ సావంత్‌కు ఇచ్చిన వినతిపత్రంలో ఏఐఈయూసీ నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో లీజు సంస్థలు ఇప్పటికే కార్మికుల సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పేశాయన్నారు. రాష్ట్రంలో మైనింగ్ కార్యకలాపాలను శాస్త్రీయ పద్ధతిలో తక్షణమే పునరుద్ధరించాలని ఏఐటీయూసీ -గోవా విభాగం సీఎంకు విజ్ఞప్తి చేసింది. అలాగే, ఉపాధి కోల్పోతున్న మైనింగ్ కార్మికులందరికీ నెలకు రూ.15వేలు చొప్పున చెల్లించేలా నిధులు కేటాయించాలని కోరింది.

మరోవైపు, రాష్ట్రంలో ఇనుప ఖనిజం తవ్వకాలను ప్రభుత్వరంగ మైనింగ్ కార్పొరేషన్ల ద్వారా త్వరలో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా ఆ విషయంలో నేటికీ ఎలాంటి పురోగతిలేదని కార్మిక సంఘం నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. తాజాగా వేలం నిర్వహిస్తే కొత్తగా వచ్చే లీజు కంపెనీలు కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట వేసేలా రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం కార్మికులు చివరగా తీసుకొంటున్న వేతనాలు, సర్వీసును కొనసాగించేలా ప్రభుత్వం చూడాలన్నారు. 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల తర్వాత ఉద్యోగాలు కోల్పోయిన వారి ప్రయోజనాలకనుగుణంగా గోవా లేబర్‌ బోర్డు పథకానికి అనుగుణంగా ఓ కొత్త పథకాన్ని తీసుకురావాలని కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని