IRCTCలో సాంకేతిక సమస్య.. 4 గంటల తర్వాత సేవలు అందుబాటులోకి

ఐఆర్‌సీటీసీలో టికెట్ల బుకింగ్‌ నిలిచిపోయింది. సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ సమస్య ఏర్పడినట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది. 4 గంటల తర్వాత సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.

Updated : 25 Jul 2023 14:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐఆర్‌సీటీసీ టికెట్‌ బుకింగ్‌ సర్వీసులు (Ticket Booking services) దాదాపు నాలుగు గంటల విరామం అనంతరం అందుబాటులోకి వచ్చాయి. టికెట్‌ బుకింగ్‌ సర్వీసుల్ని పునరుద్ధరించినట్లు ఐర్‌సీటీసీ (IRCTC) ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ఇప్పుడు ఐఆర్‌సీటీసీ యాప్‌ (రైల్‌ కనెక్ట్‌), ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ యథాతథంగా పనిచేస్తున్నాయని తెలిపింది. జరిగిన అంతరాయానికి చింతిస్తున్నామంటూ విచారం వ్యక్తంచేసింది.

ఐఆర్‌సీటీసీలో ఈ ఉదయం సాంకేతిక సమస్య ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో టికెట్‌ బుకింగ్‌ సేవల (Ticket Booking services)కు అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని ఐఆర్‌సీటీసీ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతానికి తమ వెబ్‌సైట్‌, యాప్‌లో టికెట్‌ బుకింగ్‌ సేవలు అందుబాటులో లేవని, సమస్యను పరిష్కరించేందుకు తమ సీఆర్‌ఐఎస్‌ (CRIS) సాంకేతిక బృందం ప్రయత్నిస్తోందని తెలిపింది. అప్పటివరకు ప్రత్యామ్నాయ మార్గాలైన అమెజాన్‌, మేక్‌మైట్రిప్‌ వంటి బీ2సీ వేదికల ద్వారా ప్రయాణికులు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. సరిగ్గా తత్కాల్‌ టికెట్‌ బుకింగ్‌ సమయంలో అంతరాయం ఏర్పడడంతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని