Sandeshkhali: బెంగాల్‌ ప్రభుత్వానికి చుక్కెదురు.. ‘సందేశ్‌ఖాలీ’లో సువేందు పర్యటనకు కోర్టు ఓకే

Sandeshkhali issue: సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపుల అంశం పశ్చిమబెంగాల్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో కోర్టు అనుమతితో భాజపా నేత సువేందు అధికారి ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. 

Published : 20 Feb 2024 13:46 IST

కోల్‌కతా: ‘సందేశ్‌ఖాలీ’ వ్యవహారం పశ్చిమ్ బెంగాల్‌(West Bengal)ను రాజకీయంగా కుదిపేస్తోంది. ఆ ప్రాంతంలో పర్యటించేందుకు విపక్ష భాజపా నేత సువేందు అధికారికి మంగళవారం కలకత్తా హైకోర్టు అనుమతి ఇచ్చింది.(Sandeshkhali issue)

సందేశ్‌ఖాలీ ప్రాంతంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతుదారులు మహిళలపై లైంగికవేధింపులకు పాల్పడ్డారంటూ భాజపా ఆరోపించిన సంగతి తెలిసిందే. దాంతో అక్కడ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడ పర్యటించేందుకు వెళ్తున్న రాజకీయ నేతలను పోలీసులు మధ్యలోనే ఆపేస్తున్నారు. అక్కడకు వెళ్లేందుకు సువేందు అధికారి కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నారు. కానీ ఉదయం ఆయనతో పాటు, సీపీఎం నాయకురాలు బృందాకారత్‌ను ధమఖాలీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దాంతో మరోసారి కోర్టును ఆశ్రయించారు. వెంట పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు లేకుండా ఘటనా ప్రాంతానికి వెళ్లొచ్చంటూ తాజాగా పర్మిషన్ లభించింది. సువేందుతో పాటు భాజపా ఎమ్మెల్యే శంకర్ ఘోష్ ప్రస్తుతం ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు.

ఆధార్‌కార్డులను ఎందుకు పనిచేయనివ్వడం లేదు?

కొద్దిరోజులుగా సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపుల అంశం పశ్చిమబెంగాల్‌లో చర్చనీయాంశంగా మారింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీలో టీఎంసీ నేత షాజహాన్‌ షేక్‌, అతడి అనుచరులు ఇక్కడి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఫిర్యాదులు చేయగా పోలీసు యంత్రాంగం కూడా టీఎంసీ నేతకే అనుకూలంగా వ్యవహరించినట్లు బాధితులు వాపోయారు. ఈడీ అధికారులపై దాడి కేసులో నిందితుడైన షేక్‌ షాజహాన్‌ ఇప్పటికే పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం సందేశ్‌ఖాలీ కేసును (Sandeshkhali Case) కలకత్తా హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని