Sisodia: రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడంపైనే భాజపా శ్రద్ధ: సిసోదియా

తనపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ పూర్తిగా అసంబద్ధమైనదేనని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా పేర్కొన్నారు.

Published : 27 Aug 2022 01:54 IST

దిల్లీ: తనపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ (CBI FIR) అసంబద్ధమైనదేనని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా (Manish Sisodia) పేర్కొన్నారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడానికే కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఓ సీరియల్‌ కిల్లర్‌గా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇతరులు చేస్తోన్న మంచి పనులను చూసి అభద్రతా భావంతోనే ప్రధాని మోదీ ఈ విధంగా చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వంపై వస్తోన్న ఆరోపణలు, నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడుల నేపథ్యంలో దిల్లీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

‘ఇతరులు చేస్తోన్న మంచి పనులను చూసి ప్రధానమంత్రి మోదీ అభద్రతా భావానికి గురవుతున్నారు. ఆయనకంటే అభద్రతాభావం ఉన్న వ్యక్తిని ఇంకెక్కడా చూడలేదు. ఒకవేళ అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధానమంత్రిగా ఉంటే మాత్రం.. ఇటువంటివి చేసేవారు కాదు. కేంద్రం చేసిన మంచి పనులన్నింటికీ అరవింద్‌ కేజ్రీవాల్‌ మద్దతు ఇచ్చారు. కానీ, ప్రధానమంత్రి మాత్రం అందుకు వ్యతిరేకంగా చేస్తున్నారు’ అని మనీశ్‌ సిసోదియా పేర్కొన్నారు. సీబీఐ అధికారులు తన ఇంట్లో 14గంటలపాటు దాడులు చేశారన్న సిసోదియా.. తనతోపాటు తన పిల్లల దుస్తులను వెతికినప్పటికీ ఏమీ గుర్తించలేదన్నారు.

‘నాపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ పూర్తిగా అసంబద్ధమైనది. నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదు. ఇతర రాష్ట్రాలను పడగొట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఓ సీరియల్‌ కిల్లర్‌గా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయడంపై పెట్టే శ్రద్ధ.. పాఠశాలలు, ఆస్పత్రులను నిర్మించడంపై పెడితే బాగుంటుంది’ అని మనీశ్‌ సిసోదియా పేర్కొన్నారు. గతంలో తాము రూపొందించిన మద్యం విధానాన్ని సిసోదియా సమర్థించుకున్నారు. అయితే, దానిపై విమర్శలు రావడంతో దిల్లీ ప్రభుత్వం ఇటీవలే ఆ విధానాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని