Sushant Singh Death Case: ఆ చాట్స్‌, పోస్టులు లేకే సుశాంత్‌ కేసు ఆలస్యం..!

Sushant Singh Rajput Death Case: బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ మృతి కేసు దర్యాప్తు మూడేళ్లు గడుస్తున్నా ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అయితే ప్రస్తుతం దానికి సంబంధించి ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. 

Published : 30 Jun 2023 19:21 IST

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (Sushant Singh Rajput) మరణంపై మిస్టరీ ఇంకా వీడట్లేదు. అతడి మృతి వెనుకగల కారణాలపై స్పష్టత రాలేదు. అయితే అతడు తొలగించిన పోస్టులు, చాట్స్‌, ఈ మెయిల్స్‌ గురించి తెలిస్తే.. ఈ కేసు ఒక కొలిక్కి రావొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. వాటిని తిరిగి పొందేందుకు టెక్‌ సంస్థలు గూగుల్‌, ఫేస్‌బుక్‌కు 2021లోనే కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అధికారిక అభ్యర్థన పంపిందట. అప్పటి నుంచి ఆ దిగ్గజ సంస్థల సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం.

‘సామాజిక మాధ్యమ సంస్థల స్పందన కోసం మేం ఎదురుచూస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న ఈ కేసుకు లాజికల్‌గా ఒక ముగింపు ఇచ్చేందుకు ఆ సమాచారం ఉపయోగపడొచ్చు’ అని దర్యాప్తు సంస్థ అధికారి ఒకరు  జాతీయ మీడియా సంస్థతో అన్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్(Devendra Fadnavis).. సుశాంత్‌ మృతి కేసుపై స్పందించిన మరుసటి రోజే ఈ వార్త వెలుగులోకి రావడం గమనార్హం.

‘ఈ కేసులో తొలుత ఉన్న సమాచారం వాళ్లూ వీళ్లు చెప్పిన మాటల ఆధారంగానే ఉంది. కానీ, ఆ తర్వాత కొంతమంది ఈ కేసుకు సంబంధించి తమ వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. దానిపై మేం చర్యలు చేపట్టాం. వారి వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు సమర్పించాలని కోరాం. ప్రాథమిక సాక్ష్యాలను సేకరించాం. ప్రస్తుతం వాటి విశ్వసనీయతను అధికారులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దశలో నేను కేసు గురించి ఏం చెప్పలేను’ అని ఫడణవీస్‌ వెల్లడించారు.

2020 జూన్‌ సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (Sushant Singh Rajput) ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కన్పించిన విషయం తెలిసిందే. ఆయన మృతి బాలీవుడ్‌తో సహా దేశవ్యాప్తంగా సినీ అభిమానులను షాక్‌కు గురిచేసింది. తొలుత ఆయనది ఆత్మహత్య అని వార్తలు వచ్చాయి. అయితే సుశాంత్‌ మృతిలో కుట్ర కోణం ఉందని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో ఈ కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. అయితే, మూడేళ్లు గడిచినా.. ఇప్పటి వరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి లభించకపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని