LPG Cylinder Price: ఉజ్వల లబ్ధిదారులకు రూ.503కే వంటగ్యాస్‌ సిలిండర్‌.. నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి!

LPG Cylinder Price: మహిళా దినోత్సవం సందర్భంగా వంట గ్యాస్‌ సిలిండర్‌పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ప్రకటించారు. 

Updated : 08 Mar 2024 16:25 IST

దిల్లీ: మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) గుడ్‌న్యూస్‌ చెప్పారు. గృహ వినియోగ వంటగ్యాస్‌ సిలిండర్‌పై (LPG Cylinder price) రూ.100 తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. తద్వారా కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.

తాజా తగ్గింపుతో దేశ రాజధాని దిల్లీలో 14.2 కిలోల సిలిండర్‌ ధర (LPG Cylinder price) రూ.803కి చేరనుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈరోజు అర్ధరాత్రి నుంచే కొత్త ధరలు అమల్లోకి వస్తాయని తెలిపాయి. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. అంతర్జాతీయ ధరలు దిగొచ్చిన నేపథ్యంలోనే దేశీయంగా తగ్గింపు సాధ్యమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. గత 23 నెలలుగా అవి స్థిరంగా కొనసాగుతున్నాయి.

‘‘ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మా ప్రభుత్వం ఎల్‌పీజీ సిలిండర్ ధరను (LPG Cylinder price) రూ.100 తగ్గించాలని నిర్ణయించింది. దీనివల్ల దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుంది. ముఖ్యంగా ‘నారీశక్తి’కి ప్రయోజనం చేకూరుతుంది’’ అని ప్రధానమంత్రి మోదీ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. గత ఆరు నెలల్లో వంట గ్యాస్ ధరను తగ్గించడం ఇది రెండోసారి. గతేడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక్కో సిలిండర్‌పై కేంద్రం రూ.200 కుదించింది. దీంతో 14.2 కిలోల సిలిండర్‌ ధర రూ.1,103 నుంచి రూ.903కు దిగొచ్చింది. తాజాగా మరో రూ.100 తగ్గించటంతో అది రూ.803కు చేరింది.

‘‘దిల్లీలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద రూ.300 రాయితీ పొందుతున్న వారికి సిలిండర్‌ రూ.503కే లభించనుంది. మిగతావారు దీన్ని రూ.803కు పొందొచ్చు’’ అని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ తెలిపారు. మరోవైపు ప్రధాని అధ్యక్షతన గురువారం భేటీ అయిన కేంద్ర క్యాబినెట్‌.. ఉజ్వల రాయితీని 2025 మార్చి వరకు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. 2023 అక్టోబర్‌లోనే ప్రభుత్వం ఈ సబ్సిడీని రూ.200 నుంచి రూ.300కు పెంచింది.

ఏప్రిల్‌-మేలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. గతకొన్నేళ్లలో గణనీయంగా పెరిగిన గ్యాస్‌ ధరలు ఎన్నికల ప్రచారంలో కీలకాంశంగా మారనున్నాయి. 2021 జులై నుంచి 2023 ఆగస్టు మధ్య 14.2 కిలోల సిలిండర్‌ ధర రూ.294 పెరిగింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌.. అధికార పార్టీపై విమర్శలకు దీన్ని అస్త్రంగా మార్చుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని