AIIMS-Delhi: దిల్లీ ఎయిమ్స్‌ సర్వర్ల హ్యాకింగ్‌ వెనుక చైనా హస్తం?

ఎయిమ్స్‌లో సర్వర్లు మొరాయించినట్లు గత నెల 23న తొలిసారి గుర్తించారు. ఆ తర్వాత హ్యాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. ఎయిమ్స్‌ నుంచి హ్యాకర్లు రూ.200కోట్లు క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని డిమాండ్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి.

Published : 03 Dec 2022 01:13 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS) సర్వర్ల హ్యాకింగ్‌ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఆసుపత్రిలో మొత్తం ఐదు ప్రధాన సర్వర్లు సైబర్‌ దాడికి గురవ్వగా.. ఇందులో ఒక సర్వర్‌ను హాంకాంగ్‌ నుంచి హ్యాక్‌ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కుట్ర వెనుక చైనా హస్తం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఎయిమ్స్‌లో సర్వర్లు మొరాయించినట్లు గత నెల 23న తొలిసారి గుర్తించారు. ఆ తర్వాత హ్యాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. ఎయిమ్స్‌ నుంచి హ్యాకర్లు రూ.200కోట్లు క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని డిమాండ్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. హ్యాక్‌ చేసిన సర్వర్లలో దాదాపు 3-4కోట్ల మంది రోగుల సమాచారం నిక్షిప్తమై ఉంది. ఇందులో వీవీఐపీలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీల సమాచారం కూడా ఉంది. దీంతో ఆ డేటా ఇప్పుడు ప్రమాదంలో పడింది.

కాగా.. ఈ డేటాను డార్క్‌ వెబ్‌లో విక్రయానికి పెట్టే అవకాశముందని తెలుస్తోంది. చోరీకి గురైన ఎయిమ్స్‌ డేటా కోసం డార్క్‌వెబ్‌లో 1600 సార్లకు పైగా వెతికినట్లు తెలిసిందని దిల్లీ ఇంటెలిజెన్స్‌ ఫ్యూజన్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ ఆపరేషన్స్‌ (ఐఎఫ్‌ఎస్‌ఓ) విభాగం వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఎయిమ్స్‌ డేటాను అమ్మకానికి పెట్టలేదని సదరు వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.

ప్రస్తుతం ఎయిమ్స్‌లో సర్వర్లు, కంప్యూటర్లకు యాంటీ వైరస్‌ సొల్యూషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఆసుపత్రిలో మొత్తం 5వేలకు పైగా కంప్యూటర్లు ఉండగా.. ఇప్పటివరకు 1200 కంప్యూటర్లకు యాంటీ వైరస్‌ ఎక్కించారు. 50 సర్వర్లలో 20 సర్వర్లను స్కాన్‌ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశముంది. సర్వర్లు నిలిచిపోవడంతో ఎమర్జెన్సీ, ఔట్‌ పేషెంట్‌, ఇన్‌ పేషెంట్‌, లేబొరేటరీ వంటి సేవలు మాన్యువల్‌గానే నిర్వహిస్తున్నారు. డిసెంబరు 6 నుంచి తిరిగి ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని