MK Stalin: నీట్‌ వ్యతిరేక బిల్లు త్వరగా ఆమోదించండి.. రాష్ట్రపతికి స్టాలిన్‌ లేఖ

నీట్‌ వ్యతిరేక బిల్లును త్వరగా ఆమోదించాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు విజ్ఞప్తి చేశారు.

Published : 14 Aug 2023 22:55 IST

చెన్నై: నీట్‌(NEET) పరీక్ష కారణంగా తమిళనాడులో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్న వేళ సీఎం స్టాలిన్‌(MK Stalin) రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Droupadi Murmu)కు లేఖ రాశారు. తమ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన నీట్‌ వ్యతిరేక బిల్లును ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. నీట్‌ వల్ల తమ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 16కి చేరిందని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లిన స్టాలిన్‌.. నీట్‌ మినహాయింపు బిల్లును ఆమోదించడం ద్వారా విద్యార్థుల మరణాలను నివారించవచ్చని పేర్కొన్నారు. రెండు సార్లు ప్రయత్నించినా నీట్‌లో ర్యాంకు రాలేదన్న మనస్తాపంతో శనివారం ఓ విద్యార్థి  బలవన్మరణానికి పాల్పడగా.. కుమారుడి మరణవార్త విని తండ్రి సైతం మరుసటి రోజే ఉరి వేసుకొని మృతిచెందిన ఘటన తీవ్ర విషాదం నింపిన విషయం తెలిసిందే. 

అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ డిగ్రీ కోర్సుల బిల్లు-2021కు అనుమతి మంజూరు చేయడంలో నెలకొన్న జాప్యం వల్లే దురదృష్టకరమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల తక్షణమే ఈ బిల్లుకు ఆమోదం తెలిపాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. నీట్ ఒత్తిడి కారణంగా ఆగస్టు 12, 13తేదీల్లో కొడుకు, తండ్రి ఆత్మహత్యల చేసుకున్న ఘటనను తన లేఖలో ఉటంకించారు. ఈ బిల్లుకు సంబంధించిన శాసన ప్రక్రియను ప్రస్తావించిన  సీఎం.. నీట్‌ ఆధారిత ప్రవేశ ప్రక్రియ ద్వారా పేద, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులపై ప్రతికూల ప్రభావాన్ని జస్టిస్‌ ఏకే రాజన్‌ కమిటీ అధ్యయనం చేసిందని తెలిపారు. ఆ కమిటీ సమర్పించిన నివేదిక, చర్చల ఆధారంగా 2021 సెప్టెంబర్‌ 13న ఈ బిల్లుకు ఆమోదం లభించినట్టు పేర్కొన్నారు. 

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష నీట్ పరిధి నుంచి తమిళనాడును శాశ్వతంగా మినహాయించాలంటూ అక్కడి ప్రభుత్వం ఓ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు వైద్య విద్య కోర్సుల్లో అవకాశాలు కల్పిస్తారు. 2021లోనే సీఎం ఎంకే స్టాలిన్‌ ఈ బిల్లును ప్రతిపాదించగా.. భాజపా మినహా అన్ని విపక్ష పార్టీలూ ఇందుకు ఆమోదం తెలిపాయి. భాజపా సభ్యులు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్‌ చేశారు. కానీ, ఆ బిల్లును గవర్నర్‌ తిరస్కరించారు. దీంతో ఇటీవల ఆ బిల్లులో కొన్ని మార్పులు చేసిన తిరిగి పంపించగా  ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం పరిశీలనలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని