Third Wave: మూడో దశ కూడా ఇంతే ఉద్ధృతంగా..

కరోనా సెకండ్‌ వేవ్‌ సృష్టిస్తున్న విలయతాండవానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దేశంలో ఇప్పుడిప్పుడే కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే థర్డ్‌ వేవ్‌ త్వరలోనే రాబోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా థర్డ్‌ వేవ్‌ కూడా ప్రస్తుతమున్న రెండో దశ లాగే

Updated : 03 Jun 2021 04:10 IST

సగటున 98 రోజులు ఉంటుందన్న ఎస్‌బీఐ నివేదిక

దిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌ సృష్టిస్తున్న విలయతాండవానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దేశంలో ఇప్పుడిప్పుడే కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే థర్డ్‌ వేవ్‌ త్వరలోనే రాబోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా థర్డ్‌ వేవ్‌ కూడా ప్రస్తుతమున్న రెండో దశ లాగే ఉద్ధృతంగా ఉంటుందని ఎస్‌బీఐ నివేదిక వెల్లడించింది. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడం, ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం వల్ల కొవిడ్ మరణాల సంఖ్యను తగ్గించవచ్చని ఆ నివేదిక తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా రెండో దశ సగటుగా 108 రోజులు ఉండనుందని, మూడో దశ 98 రోజులు ఉంటుందని ఎస్‌బీఐ ఐదు పేజీల రిపోర్టులో వివరించింది.

మూడో దశను ఎదుర్కొనేందుకు భారత్‌ అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటే మరణాలు తక్కువగా నమోదవుతాయని వెల్లడించింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో వేగం పెంచడం, ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం వల్ల థర్డ్‌ వేవ్‌లో సీరియస్‌ కేసులను 20 శాతం నుంచి 5 శాతానికి తగ్గించవచ్చిని తెలిపింది. రెండో వేవ్‌లో ప్రస్తుతం మరణాల సంఖ్య 1.7 లక్షలు దాటింది. మౌలికసదుపాయాలను పెంచడం వల్ల మరణాల సంఖ్యను 40 వేలకే పరిమితం చేయొచ్చని నివేదిక తెలిపింది. కొవిడ్‌ మూడో దశ పిల్లలపైనే అధిక ప్రభావం చూపనుందని హెచ్చరిస్తూ.. వ్యాక్సిన్‌తోనే వారు సేఫ్‌ జోన్‌లోకి వెళతారని స్పష్టం చేసింది.  

దేశంలో రెండో దశ కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. రాష్ట్రాలు విధించిన లాక్‌డౌన్లు, ఆంక్షల ఫలితాలు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,32,788 కేసులు వెలుగులోకి వచ్చాయి. 3,207 మంది మృతిచెందారు. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,83,07,832. మృతుల సంఖ్య 3,35,102కు చేరింది. దేశంలో నమోదవుతున్న కేసుల కంటే రికవరీ రేటు అధికంగా ఉంటోంది. రికవరీ రేటు 92.48 శాతంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని