Rajnath Singh: గల్వాన్‌ వీరులకు రాజ్‌నాథ్‌ నివాళులు..

మూడేళ్ల క్రితం తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరులైన భారత సైనికులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాళులు అర్పించారు.  

Published : 15 Jun 2023 23:51 IST

దిల్లీ: గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన భారత సైనికుల ధైర్యసాహసాలు, త్యాగనిరతిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కొనియాడారు. వారు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు. గల్వాన్‌ ఘర్షణ జరిగి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆయన గురువారం వీర సైనికులకు నివాళులర్పించారు. 2020 జూన్‌ 15న భారత్‌, చైనా సైనికుల మధ్య తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో ఘర్షణలు జరిగాయి. అందులో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌ బాబు సహా 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పోరులో తమ సైనికులెవరూ మరణించలేదని చైనా తొలుత బుకాయించింది అయితే తమ దేశానికి చెందిన ఐదుగురు మిలటరీ సిబ్బంది చనిపోయారని 2021 ఫిబ్రవరిలో అధికారికంగా అంగీకరించింది. వాస్తవానికి డ్రాగన్‌ సైనికులు చాలా ఎక్కువ మంది మరణించి ఉంటారని అంచనా. గల్వాన్‌ ఘర్షణల తర్వాత రెండు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు బాగా పెరిగాయి. వీటిని చల్లార్చేందుకు భారత్‌, చైనాల నడుమ 18 సార్లు ఉన్నతస్థాయి చర్చలు జరిగాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో తూర్పు సెక్టార్‌లో తన పోరాట సామర్థ్యాన్ని పెంచుకోవడానికి భారత సైన్యం అనేక చర్యలు చేపట్టింది. ఎలాంటి ఉపరితలంపైనైనా ప్రయాణించే వాహనాలు, లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించే మందుగుండు సామగ్రి, హైటెక్‌ నిఘా సాధనాలు, రాడార్లు, ఆయుధాలను సమకూర్చుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని