Disease X: ‘డిసీజ్‌ ఎక్స్‌’ ముప్పు.. దొంగ వస్తాడని భయపడటం లాంటిదే..!

Disease X: ప్రపంచానికి డిసీజ్‌ ఎక్స్‌ రూపంలో మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. ఆరోగ్య రంగ నిపుణులు స్పందించారు. అదంతా ఊహాజనితమే అని, అయితే సంసిద్ధత అవసరమని అన్నారు.

Published : 02 Oct 2023 13:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా (Corona) తరహాలోనే ‘డిసీజ్‌ ఎక్స్‌ (Disease X)’ రూపంలో మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు రావడం యావత్‌ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ మహమ్మారి కొవిడ్‌ కంటే అధిక ప్రభావం చూపించే అవకాశముందని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు చెప్పడం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, ఈ భయాలను తాజాగా కొంతమంది అంటువ్యాధుల నిపుణులు తోసిపుచ్చారు. ప్రస్తుతానికి అలాంటి మహమ్మారి ఏదీ వ్యాప్తిలో లేదని, సమీప భవిష్యత్తులోనూ వచ్చే అవకాశం లేదన్నారు. ‘‘డిసీజ్‌ ఎక్స్‌ కేవలం ఊహాజనిత ముప్పు’’ అని పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా కొత్త మహమ్మారి వస్తే దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించింది. ఈ క్రమంలోనే రాబోయే మహమ్మారిని ‘డిసీజ్‌ ఎక్స్‌ (Disease X)’ అని పేర్కొంది. అయితే, దీనిపై ఇటీవల బ్రిటన్‌ మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. కరోనా మహమ్మారి తరహాలో డిసీజ్‌ ఎక్స్‌ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రభావం చూపిస్తుందని బ్రిటన్‌ వ్యాక్సిన్‌ టాస్క్‌ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్న డేమ్‌ కేట్‌ బింగ్‌హామ్‌ చెప్పినట్లు వాటిల్లో పేర్కొన్నాయి. కరోనా కంటే డిసీజ్‌ ఎక్స్‌ ప్రజలపై 7 రెట్ల అధిక ప్రభావం చూపిస్తుందని కేట్ వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో మరో మహమ్మారి ముంచుకొస్తోందని కొద్ది రోజులుగా నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.

Chandrayaan-3: ఆ కొలిమి తోడుంటే.. విక్రమ్‌ నిద్ర లేచేదే!

దీనిపై తాజాగా పలువురు ఆరోగ్య రంగ నిపుణులు స్పందిస్తూ అదంతా ఊహాజనిత ముప్పు అని కొట్టిపారేశారు. అయితే, భవిష్యత్తులో మహమ్మారులను ఎదుర్కొనేందుకు ఈ సంసిద్ధత ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ‘‘మీ ఇంట్లోకి దొంగలు రాకపోవచ్చు. కానీ, వస్తారేమోనన్న భయంతో మీరు సీసీటీవీలు ఏర్పాటు చేసుకుంటారు. ఇంటికి తాళం వేస్తారు. శునకాన్ని కొంటారు. అన్ని అయుధాలు సిద్ధంగా ఉంచుకుంటారు. డిసీజ్‌ ఎక్స్‌ (Disease X) కూడా.. ఇలా దొంగలొస్తారన్న ఊహ లాంటిదే. అయితే, భవిష్యత్తులో ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధత చాలా అవసరం. మరో ముప్పును ఊహించుకుంటూ దాన్ని ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు’’ అని నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ (NTAGI) డాక్టర్‌ ఎన్‌కే అరోడా ఓ జాతీయ మీడియాతో అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని