సైలెంట్‌ కిల్లర్లకు.. స్మార్ట్‌ చెక్‌..!

హిందూ మహా సముద్రంలో పాగా వేసి భారత్‌ను ముప్పేట బంధించాలనే చైనా ఆశాలకు డీఆర్‌డీవో గండికొడుతోంది. సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌లో ఆధిపత్యం లభించేలా ఓ కీలక టార్పిడోను శరవేగంగా అభివృద్ధి చేస్తోంది. దానికి సంబంధించిన సోమవారం ఉదయం నిర్వహించిన కీలక పరీక్షలో విజయం సాధించింది.

Updated : 12 Aug 2022 14:23 IST

 కీలక టార్పిడోను పరీక్షించిన డీఆర్‌డీవో

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

హిందూ మహా సముద్రంలో పాగా వేసి భారత్‌ను ముప్పేట బంధించాలనే చైనా ఆశాలకు డీఆర్‌డీవో గండికొడుతోంది. సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌లో ఆధిపత్యం లభించేలా ఓ కీలక టార్పిడోను శరవేగంగా అభివృద్ధి చేస్తోంది. దీనికి సంబంధించి సోమవారం ఉదయం నిర్వహించిన కీలక పరీక్షలో విజయం సాధించింది. సూపర్‌ సానిక్‌ మిసైల్‌ అసిస్టెడ్‌ రిలీజ్‌ ఆఫ్‌ టార్పిడో (స్మార్ట్‌) ఆయుధ వ్యవస్థను నేడు పరీక్షించింది. ఈ విషయాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ‘యాంటీ సబ్‌మెరైన్‌ యుద్ధతంత్రలో కీలకమైన మలుపు. ఈ విజయానికి కారణమైన డీఆర్‌డీవో శాస్త్రవేత్తలను, ఇతర భాగస్వాములను అభినందిస్తున్నాను’’అని ఆయన ట్వీట్‌ చేశారు. ఈ ఆయుధానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. బాలిస్టిక్‌ క్షిపణి+టార్పిడో కలిస్తే స్మార్ట్‌గా రూపుదిద్దుకుంటుంది.

బ్రహ్మోస్‌ తర్వాత పెద్ద ప్రాజెక్టు..

బ్రహ్మోస్‌ మాక్‌ 3 యాంటీషిప్ మిసైల్‌ తర్వాత చేపట్టిన అత్యంత కీలకమైన ప్రాజెక్టు ఇదే. 2016లో ఈ ప్రాజెక్టుకు రూ.340 కోట్లను కేటాయించారు. దేశ సముద్ర జలాల్లోకి ప్రమాదకరంగా చొచ్చుకొచ్చే శత్రు సబ్‌మెరైన్లను దూరం నుంచే ధ్వంసం చేయడానికి దీనిని వాడతారు. ఇది పనిచేసే విధానాన్ని బట్టి దీని రేంజి దాదాపు 650 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

రెండు రకాల ఆయుధ వ్యవస్థలను సమ్మిళితం చేసి దీనిని అభివృద్ధి చేశారు. భారత్‌ ఇప్పటికే టార్పిడోలు.. క్షిపణులు తయారు చేస్తోంది. ఈ టెక్నాలజీలను కలిపి సరికొత్త హైబ్రీడ్‌  ఆయుధాన్ని తయారు చేశారు. సాధారణంగా భారీ టార్పిడోలు కూడా నీటిలో అత్యధికంగా 50  కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. రాకెట్‌ అసిస్టెడ్‌ విధానంలో 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయి. కానీ, ఈ సరికొత్త హైబ్రీడ్‌ విధానంలో మాత్రం 600 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. 

శత్రువుకు ఏమాత్రం అనుమానం రాకుండా..

స్మార్ట్‌ను యుద్ధనౌకలపై నుంచి కానీ.. లేదా సముద్రం ఒడ్డున ఉంచిన ట్రక్‌పై నుంచి కానీ ప్రయోగించవచ్చు. ఇది లక్ష్యానికి సమీపం వరకు గాల్లో క్షిపణి వలే ప్రయాణిస్తుంది.. సబ్‌మెరైన్‌ సమీపానికి రాగానే గాల్లో నుంచి నీటిలోకి టార్పిడోను పడేస్తుంది. అది వెళ్లి లక్ష్యాన్ని ఢీకొంటుంది. దాడికి  కొన్ని నిమిషాల ముందు వరకు ఈ టార్పిడోను శత్రుసబ్‌మెరైన్‌ గుర్తించలేదు. దీంతో దానికి అప్రమత్తమై తప్పించుకునే అవకాశాలు దాదాపు మూసుకుపోతాయి. ఇది గాల్లో తక్కువ ఎత్తులో ప్రయాణించడంతో రాడార్లకు కూడా అంత తేలిగ్గా దొరకదు. దీనికి డేటా లింక్‌లు కూడా ఉండటంతో నియంత్రణ ఉంటుంది.   

అమెరికా, రష్యాలు ఇటువంటి ప్రయోగాలు చేశాయి. చైనా వద్ద వైయూ-8 పేరుతో ఇప్పటికే ఒక వ్యవస్థ ఉంది. కానీ, దీని రేంజి చాలా తక్కువ. దీంతో పోలిస్తే భారత్‌ అభివృద్ధి చేసిన స్మార్ట్‌ చాలా ఉత్తమమైన వ్యవస్థ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని