ఎవర్‌ గివెన్‌ నౌకపై భారీ జరిమానా

సూయజ్‌ కాల్వలో చిక్కుకున్న ‘ఎవర్‌ గివెన్‌’ నౌకపై ఈజిప్ట్‌ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. గతనెలలో సూయజ్‌ కాల్వలో నౌక చిక్కుకోవడంతో

Updated : 13 Apr 2021 18:47 IST

కైరో: సూయజ్‌ కాల్వలో చిక్కుకున్నరాకాసి నౌక ‘ఎవర్‌ గివెన్‌’పై ఈజిప్ట్‌ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. గతనెలలో సూయజ్‌ కాల్వలో నౌక చిక్కుకోవడంతో వాణిజ్య పరంగా భారీ నష్టం వచ్చిందని అక్కడి ప్రభుత్వం తెలిపింది. దీంతో బిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ పరిహారంపై ఈజిప్ట్‌ ప్రభుత్వ అధికారులతో ఎవర్‌ గివెన్‌ యాజమాన్యం చర్చిస్తోంది.

  గత నెల 23న సూయజ్‌ కాలువలో వెళుతున్న భారీ రవాణానౌక ఎవర్‌గివెన్‌  ప్రమాదవశాత్తు అడ్డం తిరగడంతో సూయజ్‌లో కొన్ని రోజుల పాటు రవాణా స్తంభించిపోయిన విషయం తెలిసిందే.

ఓడ కూరుకుపోయిన ప్రాంతంలో ఇసుక, బంకమట్టిని డ్రెడ్జర్లతో తవ్వుతూ.. మరోవైపు టగ్‌బోట్ల సహాయంతో నౌకను కదిలించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగాయి. అలా ఓడ కింద ఇసుకను తవ్వి నీటిని పంప్‌ చేశారు. వీటికి తోడు వాతావరణం కూడా సహకరించడంతో ఈ భారీ నౌకను తిరిగి కాలువలోకి తీసుకొచ్చి  గ్రేట్‌ బిట్టర్‌ లేక్‌కు తరలించారు.

ఆసియా, యూరప్‌ల మధ్య సరుకులు రవాణా చేసే ఈ భారీ నౌక ‘ఎవర్‌ గివన్‌’ సూయిజ్‌ కాలువలో చిక్కుకుపోవడంతో అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది. నౌకలో ఒక భాగం భూమిలోకూరుకుపోవడంతో దీన్ని తిరిగి కాలవలోకి తీసుకొచ్చేందుకు దాదాపు వారం రోజులుగా అంతర్జాతీయ నిపుణుల బృందం తీవ్ర కృషి చేసింది.

భారీ నౌక అంతరాయం వల్ల ప్రభావం..

400 మీటర్ల పొడవున్న ‘ఎవర్‌ గివన్‌’లో 20 వేల కంటైనర్లతో బయలుదేరింది.

నౌక బరువు 2లక్షల 20వేల టన్నులు

నౌక నిలిచిపోవడంతో రోజుకు రూ.65,205 కోట్ల (9 బిలియన్‌ డాలర్లు) వ్యాపారం స్తంభించింది.

భారీ నౌక చిక్కుకుపోవడంతో సూయిజ్‌ కాలువ మీదుగా వెళ్తున్న దాదాపు 369 నౌకలు మార్గమధ్యంలోనే నిలిచిపోయాయి. రాకాసిఓడ కదిలిన తరువాత వీటిని వరుసక్రమంలో సూయజ్‌ దాటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని