Apple hacking alert row: ‘డివైజ్‌ల భద్రతపై యాపిల్‌ స్పష్టతనివ్వాలి’: కేంద్ర మంత్రి

Apple hacking alert row: యాపిల్‌ పరికరాలు సురక్షితమైనవో లేదో ఆ సంస్థ స్పష్టతనివ్వాలని కేంద్ర మంత్రి రాజీవ్‌చంద్రశేఖర్‌ అన్నారు. పలు రాజకీయ నేతల ఐఫోన్లకు హ్యాక్ అలర్ట్‌లు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

Published : 31 Oct 2023 17:44 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా పలువురు విపక్ష నేతల ఐఫోన్ల (iPhones)కు మంగళవారం హ్యాక్‌ అలర్ట్‌ (Apple hacking alert) రావడం తీవ్ర చర్చకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వమే తమ ఫోన్లను హ్యాక్‌ చేస్తోందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. అయితే, ఈ ఆరోపణలను కేంద్రం కొట్టిపారేసింది. తాజాగా దీనిపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ (Rajeev Chandrasekhar) స్పందించారు. తమ ఉత్పత్తులు భద్రమైనవే కావో.. యాపిల్‌ (Apple) స్పష్టం చేయాలన్నారు.

‘‘ఎంపీలు సహా దేశవ్యాప్తంగా చాలా మందికి నేడు హ్యాక్‌ అలర్ట్‌ నోటిఫికేషన్లు వచ్చాయి. ఇతర దేశాల్లోని ఐఫోన్‌ యూజర్లకూ ఈ సందేశాలు వచ్చినట్లు తెలిసింది. ఈ పరిణామాల తర్వాత యాపిల్‌ కొన్ని విషయాలపై స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉంది. తమ ఉత్పత్తులు భద్రమైనవేనా? అదే దానిపై యాపిల్‌ స్పష్టత ఇవ్వాలి. 150కి పైగా దేశాల్లోని యూజర్లకు ఈ నోటిఫికేషన్‌ ఎందుకు పంపించారో చెప్పాలి. ఎందుకంటే ప్రైవసీకి అధిక ప్రాధాన్యమిస్తూ తాము ఉత్పత్తులు డిజైన్‌ చేస్తామని యాపిల్‌ పలుమార్లు చెప్పింది’’ అని రాజీవ్‌ చంద్రశేఖర్‌ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.

ఆ హ్యాక్‌ అలర్ట్‌.. నకిలీది కావొచ్చు: విపక్షాల ఆరోపణలపై యాపిల్‌ స్పష్టత

‘‘దేశ ప్రజలకు భద్రత కల్పించడం, వారి గోప్యతను రక్షించడానికి మా ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది. ఈ ఘటనను మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ అలర్ట్‌ మెసేజ్‌లపై మేం దర్యాప్తు చేపడుతాం. యాపిల్‌ ఉత్పత్తుల భద్రతపైనా విచారణ చేస్తాం’’ అని కేంద్రమంత్రి తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఇప్పటికే వెల్లడించారు. అలర్ట్‌ మెసేజ్‌లు వచ్చినవారు దర్యాప్తునకు సహకరించాలని కోరారు.

దేశవ్యాప్తంగా పలు విపక్ష పార్టీల నేతలకు నేడు ఈ అలర్ట్‌ మెసేజ్‌లు వచ్చిన విషయం తెలిసిందే. ‘ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే హ్యాకర్లు మీ ఫోన్‌ హ్యాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’ అనే సందేశంతో ఆ అలర్ట్‌ రావడంతో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై స్పందించిన యాపిల్‌.. దీనికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదని తెలిపింది. ఇలాంటి నోటిఫికేషన్లు ఒక్కోసారి నకిలీ అలర్ట్‌లు కూడా కావొచ్చని స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని