Kabul airport: కాబుల్‌ విమానాశ్రయానికి చేరుకున్న తొలి అంతర్జాతీయ విమానం

అఫ్గానిస్థాన్‌ పూర్తిగా తాలిబన్ల వశమైన అనంతరం కాబుల్ విమానాశ్రయంలో తొలిసారి ఓ అంతర్జాతీయ విమానం దిగింది.....

Published : 13 Sep 2021 23:43 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ పూర్తిగా తాలిబన్ల వశమైన అనంతరం కాబుల్ విమానాశ్రయంలో తొలిసారి ఓ అంతర్జాతీయ విమానం దిగింది. పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం.. ఇస్లామాబాద్ నుంచి కాబుల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. అందులో ఒక్క విదేశీయుడు కూడా లేడని ఆ విమానంలో ప్రయాణించిన పాత్రికేయుడొకరు తెలిపారు. కేవలం 10మంది సిబ్బందితో విమానం కాబుల్‌కు చేరినట్లు పేర్కొన్నారు. ఆ విమానంలో ప్రయాణికులకంటే సిబ్బందే అధికంగా ఉన్నారని వెల్లడించారు. అయితే అది సాధారణ కమర్షియల్‌ విమానమా? లేక ప్రత్యేక విమానమా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

గతనెల 31న అమెరికా సైనిక ఉపసంహరణ పూర్తయ్యాక కాబుల్ విమానాశ్రయం తాలిబన్ల అధీనంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఇంతవరకూ కమర్షియల్ విమానాలు ల్యాండ్ కాలేదు. పాకిస్థాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం రాకతో కాబుల్ ఎయిర్‌పోర్ట్ నుంచి కమర్షియల్ విమానాల రాకపోకలకు తాలిబన్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత వారిమీద భయంతో అనేక మంది దేశాన్ని వీడేందుకు కాబుల్‌ విమానాశ్రయానికి దండెత్తారు. విదేశీయులు సహా అఫ్గాన్లు ఎయిర్‌పోర్టుకు పోటెత్తారు. దీంతో అక్కడ తొక్కిసలాట ఏర్పడి దాదాపు 40 మంది మృతిచెందినట్లు తాలిబన్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే విమానాశ్రయంలోని సాంకేతిక పరికరాలు, సామగ్రి ధ్వంసమైంది. తర్వాత ఎయిర్‌పోర్టుకు విమానాల రాకపోకలను తాలిబన్లు నిలిపివేశారు. అనంతరం కతర్‌తో పాటు మరికొన్ని దేశాల నిపుణులతో విమానాశ్రయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పునరుద్ధరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని