రామాలయ ట్రస్టు అధ్యక్షుడిగా గోపాల్‌దాస్‌

దిల్లీలోని గ్రేటర్‌ కైలాశ్‌లో సీనియర్‌ న్యాయవాది పరాశరన్‌ నివాసంలో బుధవారం అయోధ్య రామజన్మభూమి ఆలయ నిర్మాణ ట్రస్టు తొలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ట్రస్టు సభ్యులు కొత్త అధ్యక్షుడితో పాటు కార్యదర్శి, కోశాధికారిని ఎన్నుకున్నారు.

Published : 19 Feb 2020 22:37 IST

దిల్లీ: దిల్లీలోని సీనియర్‌ న్యాయవాది పరాశరన్‌ నివాసంలో అయోధ్య రామజన్మభూమి ఆలయ నిర్మాణ ట్రస్టు తొలి సమావేశం బుధవారం ముగిసింది. ఈ సమావేశంలో ట్రస్టు సభ్యులు కొత్త అధ్యక్షుడితో పాటు కార్యదర్శి, కోశాధికారిని ఎన్నుకున్నారు. మహంత్‌ నృత్య గోపాల్‌దాస్‌ను ట్రస్టుకు నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా చంపత్‌రాయ్‌, కోశాధికారిగా గోవింద్‌ గిరి నియమితులయ్యారు. ఈ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన నిర్మాణ సమితికి ప్రధాని నరేంద్రమోదీ మాజీ ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్‌ అధికారి నృపేంద్ర మిశ్రా నేతృత్వం వహించనున్నారు. 15 రోజుల తర్వాత అయోధ్యలో మరోసారి సమావేశం కానున్న ట్రస్టు సభ్యులు.. ఆలయ నిర్మాణ ప్రారంభోత్సవానికి సంబంధించి తేదీని ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 

ఈ సందర్భంగా అధ్యక్షుడు నృత్యగోపాల్‌దాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా ఆలయ నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుంది. నిర్మాణానికి సంబంధించిన మోడల్ అదేవిధంగా ఉంటుంది. కానీ ఎత్తు, వెడల్పులో పెరుగుదల ఉంటుంది’’ అని చెప్పారు. చంపత్‌ రాయ్‌ మాట్లాడుతూ.. విరాళాల కోసం అయోధ్యలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో ఖాతా ప్రారంభించడానికి ఈ సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. సమావేశంలో కేంద్రం తరపున హోంమంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి జ్ఞానేశ్ కుమార్, యూపీ ప్రభుత్వం తరపున అవినాశ్‌ మహంతి, అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్‌ అనుజ్‌ కుమార్ జా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని